వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
ఒంగోలు టౌన్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ వివాదం తెలుగు సినిమా తరహాలో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు అరెస్టులతో ఒక కొలిక్కి వచ్చింది ..డీఎస్పీ యు.నాగరాజు తెలిపిన వివరాలు ప్రకారం...నగరంలోని సత్యనారాయణపురం 3వ లైన్‌లో నివాసం ఉండే గుజ్జుల అయ్యప్ప 9వ తరగతి వరకు చదువుకుని చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో అతడికి కేశవరాజుకుంటకు చెందిన రియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు అయ్యప్ప చేత బెట్టింగ్ పెట్టించాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్‌కింగ్స్ తరఫున రూ.15 వేలను బెట్టింగ్ పెట్టించాడు.
అయితే ఆ టీం ఓడిపోయేలా ఉండడంతో అయ్యప్పకు ఫోన్ చేసిన రియాజ్ రాజస్థాన్ మ్యాచ్ వైపు బెట్టింగ్‌ను మార్చమని చెప్పాడు. అయితే సిగ్నల్ సరిగా లేకపోవడంతో అయ్యప్ప మార్చలేకపోయాడు. ఈ విషయాన్ని రియాజ్‌కు చెప్పగా అందుకు అతడు అంగీకరించలేదు.
నాకు బెట్టింగ్‌లో వచ్చే రూ.23 వేలతో సహా మొత్తం రూ.38 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని అయ్యప్ప రెండు రోజుల పాటు రియాజ్‌కు కనిపించకుండా తిరిగాడు. ఈ క్రమంలో పీవీఆర్ స్కూల్‌లో క్రికెట్ చూస్తున్న అయ్యప్పను ఈ నెల 21న రియాజ్ స్నేహితులు కరీమ్‌బాషా, నాగార్జున, వినోద్‌లు కలిసి బలవంతంగా తీసుకెళ్లారు.
పాపాకాలనీలోని కరీమ్‌బాషా ఇంటికి తీసుకెళ్లి బంధించి కొట్టారు. అంతటితో ఊరుకోకుండా అయ్యప్ప తల్లి తిరుపతమ్మకు ఫోన్‌చేసి మీ అబ్బాయి మాకు డబ్బులు ఇవ్వాలి, అది ఇస్తేనే మీ అబ్బాయిని వదులుతామని బెదిరించారు. ఈ లోగా అయ్యప్ప అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం తెలిసిన తాలుకా పోలీసులు అతడిని వారి తలిదండ్రులకు అప్పగించి నిందితులు రియాజ్, కరీం బాషా, మౌలాలి, సాల్మన్‌లను అరెస్టు చేశారు. నాగార్జున, వినోద్‌లు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment