ఐపీఎల్ 16వ ఎడిషన్ రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతుండడంతో కొందరు బెట్టింగ్‌కు తెర లేపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్లపై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్‌కు బెట్టింగ్ జరుగుతోంది. ఆన్‌లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ భూతం మరింతగా విజృంభిస్తోంది. వందల నుంచి ప్రారంభమై రూ.వేలు, లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ పెడుతూ నిండా మునుగుతున్నారు.
పలమనేరు: ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి లక్షాధికారులు కావాలనే ఆశతో కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో యువకులు, విద్యార్థులు బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. తీరా నష్టపోయి అప్పులపాలై బికారీలుగా మారుతున్నారు. బెట్టింగుల కారణంగా యువత జీవితా లు నాశనమై ఆ కుటుంబాల్లో పెద్దలకు మనోవ్యధను కలిగిస్తోంది. చాలామంది యువకులు బైక్‌లను, ఒంటిపై ఉన్న చైన్లు, ఉంగరాలను అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
చాలామందికి బెట్టింగులు వ్యసనంలా మారుతోంది. ప్రస్తుతం బెట్టింగులు మూడు రకాలుగా ఉన్నాయి.
1. కొంతమంది కలసి ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు.
2. ఇంకొందరు రహస్యప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ బెట్టింగ్‌లు చేస్తున్నారు.
3. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను వాడుతున్నారు.
ప్రస్తుతం ఎలెవన్ బెట్, డ్రీమ్–11, ట్వంటీఫోర్‌క్లబ్, బీక్రిక్, మోస్ట్‌బెట్, ఐవిన్, మెల్‌బెట్, బెట్ 365, పారీమ్యాచ్, ఫెయిర్‌ప్లే లాంటి యాప్‌లను ఎక్కువ మంది బెట్టింగుల కోసం వాడుతున్నారు. పడమటి మండలాలను ఆనుకుని ఉన్న కర్ణాటక పరిధిలోని ముళబాగిలు, శ్రీనివాసపురం, కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన క్రికెట్ బుకీలకు చెందిన ముఠాలు జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచినా కీలక వ్యక్తుల జాడ తెలియడం లేదని తెలుస్తోంది.
టాస్ నుంచే..
ఐపీఎల్ మే 18 తేదీ వరకు జరుగుతుంది. రోజూ మధ్యాహ్నం మొదటి మ్యాచ్ 3.30, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్‌కు ముందుగానే టాస్ వేస్తారు. టాస్ ఎవరుగెలుస్తార నే దాంతో బెట్టింగులు మొదలవుతున్నాయి. ఆపై బాల్‌బై బాల్, ఓవర్ టు ఓవర్, ఎక్కువ వికె ట్లు, ఎక్కువ పరుగులు, సిక్స్‌లు, ఫోర్‌లతో పాటు మ్యా చ్ గెలుపు వరకు పందేలు సాగుతున్నాయి. మ్యాచ్ కు ముందుగా అయితే 1కి 2, ఓడిపోతే టీమ్‌పై 1కి 5 రెట్లు ఎక్కువగా బెట్టింగులు ఉంటున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి
పట్టణంలోని ఆవాస ప్రాంతాల్లో యువకు లు సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడుతున్నారు. ము ఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం బెట్టింగ్‌లకు అలవాటుపడ్డారు. మద్యం సేవించడం, గంజాలాగడాలు అన్నీ బెట్టింగులు జరిగే చోట సాధారణంగా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. – పుష్పరాజ్,
ఎస్సీ టీచర్స్ సంఘ నాయకులు, పలమనేరు
ప్రత్యేక నిఘా ఉంచాం
ఐపీఎల్ మొదలైయ్యాక సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులు రహస్యంగా సాగుతున్న విషయం తమ దృష్టిలో ఉంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. కేవలం స్మార్ట్‌ఫోన్లలో సాగే బెట్టింగ్ వ్యవహారాలను కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకొని ముఠాలను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, పలమనేరు
● బైరెడ్డిపల్లె మండలానికి చెందిన యువకుడు క్రికెట్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు.
● పలమనేరుకు చెందిన ఓ యువకుడు బెట్టింగుల కారణంగా వ్యాపారాన్ని వదులుకుని బెంగళూరుకు వెళ్లాడు.
● పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌ల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
● మదనపల్లెకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి పలమనేరులోఉంటూ ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
● పలమనేరు మండలం సముద్రపల్లెకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా బైక్‌ను తనఖా పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు.
ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో పదుల సంఖ్యలో జరిగాయి. కానీ వెలగుచూడని విషయాలు వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment