తుమ్మలగుంటలో జరుగుతున్న చంద్రగిరి ఐపీఎల్‌లో మూడో రోజు మంగళవారం సిక్సర్ల మోత మోగింది. పల్లెటూరి యువకుల బాదుడుకు బంతి మైదానం బయటకు పరుగులు పెట్టింది. బ్యాట్ చేతబట్టి మైదానంలోకి దిగిన యువకులు పరుగుల వర్షం కురిపించడంతో స్కోర్ బోర్డు తారజువ్వలా దూసుకుపోయింది. అంగ వైకల్యాన్ని జయించి ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టిన వేదాంతపురానికి చెందిన మునిశేఖర్ అందరినీ ఆకట్టుకున్నాడు. మూడో రోజు మొత్తం 52 మ్యాచ్‌లు జరిగాయి.
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలగుంట వేదికగా జరుగుతున్న వైఎస్‌ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ముందుగా నిర్ణయించిన సమయానికి క్రీడాకారులు మైదానానికి చేరుకుని తమకు కేటాయించిన గ్రౌండ్లలో పోటీకి సిద్ధమవుతున్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి క్రికెట్ కిట్లు, మెడల్స్, ప్రశంసపత్రాలను మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి అందించారు.
ఒంటి చేత్తో.. చితక్కొట్టాడు
సింగిల్ హ్యాండ్ సచిన్‌గా పిలిచే తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి చెందిన మునిశేఖర్‌కు కుడి చేయి మాత్రమే ఉంది. ఆత్మస్థైర్యంతో బరిలోకి దిగాడు. ఒంటి చేత్తో సిక్సర్లు కొడుతూ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టి 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ ప్రావిణ్యాన్ని చూసేందుకు క్రీడాకారులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అద్భుతమైన ఆటతీరుతో అంగవైకల్యాన్ని జయించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.
ఆటగాళ్లతో కిక్కిరిసిన క్రీడామైదానం
ఒకేసారి 16 మ్యాచ్‌లు నిర్వహించేందకు భారీగా 16 పిచ్‌లను సిద్ధం చేయడం, ప్రతి గ్రౌండ్‌లోనూ మ్యాచ్‌లు జరుగుతుండడం, వాటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సైతం తరలిరావడంతో తుమ్మలగుంట క్రీడా కాంప్లెక్స్ జన జాతరను తలపించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లు సాయంత్రం 5.30గంటలకు ముగిశాయి. మొత్తం 52 మ్యాచ్‌లను నిర్వహించగా 26 జట్లు విజయం సాధించాయి. విజేతలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయా గ్రౌండ్లలో ట్రోఫీలను బహుమతులుగా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment