ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరు..! బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, లాడ్జీలే అడ్డా.. | - | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరు..! బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, లాడ్జీలే అడ్డా..

Published Sun, Apr 14 2024 11:55 PM | Last Updated on Mon, Apr 15 2024 9:51 AM

- - Sakshi

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు

చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు

అంతా ఆన్‌లైన్‌లోనే..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల ద్వారా యువత పెడ దారి పడుతోంది. గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు జరిపిన వారే మళ్లీ రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో ఇంట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లో జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి బెట్టింగ్‌ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

అన్నిరకాల క్రీడల్లో క్రికెట్‌ అంటే అందరికీ మక్కువ. చిన్నారుల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు క్రికెట్‌ అంటే అభిమానమే. అదే అభిమానంతో ఐపీఎల్‌ క్రికెట్‌పై యువత నుంచి మొదలుకుని మధ్య వయస్సు వారు సైతం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, లాడ్జీలను అడ్డగా చేసుకుని మందు, విందు పార్టీలు ఏర్పాటు చేసుకుని క్రికెట్‌ చూసుకుంటూ బాల్‌ టూ బాల్‌.. వికెట్‌ టూ వికెట్‌ అంటూ బెట్టింగ్‌లు పెడుతున్నారు. మరికొందరు రహస్య ప్రాంతాల్లో ఒకేచోట గుమిగూడి సెల్‌ఫోన్లలో క్రికెట్‌ వీక్షిస్తూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు పెడుతున్నారు.

ఇంట్లోనే ఉండి టీవీల ముందు కూర్చుని ఆన్‌లైన్‌ ద్వారానే బెట్టింగ్‌ కడుతున్నారు. పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు యువత టీవీలు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సంస్కృతి కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ పట్టణాలు, పల్లెల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాల్‌ టూ బాల్‌.. వికెట్‌ టూ వికెట్‌ అంటూ రూ.100 నుంచి బెట్టింగ్‌ ప్రారంభిస్తారు. రోజూ ఒక్కో మ్యాచ్‌పై సుమారు రూ.1000 నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో బెట్టింగ్‌ సాగుతోంది. అంతేకాకుండా బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

యువత పెడదారి..

  • జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన యువకుడు ఉన్నత చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు పాల్పడి ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.3లక్షలు అప్పు చేశాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కొడుకును మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడి అతను చేసిన అప్పు తిరిగి చెల్లించారు.
  • 2023 నవంబర్‌ 15న ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ నడుస్తుండగా మంచిర్యాలకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి కుమారుడు ఇంట్లో నుంచి రూ.50 వేలు తీసుకెళ్లి బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. విషయం ఇంట్లో తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు గమనించి కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లలేదు.

ఐపీఎల్‌ అంటేనే బెట్టింగ్‌ గేమ్‌..
నేడు క్రికెట్‌ ఆట అంటే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో అభిమానం. దీన్ని ఆసరాగా మల్చుకుని కొందరు వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బూకీలుగా మారుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగులు నడిపిస్తూ రెండు వర్గాల తరుపున మధ్యవర్థిత్వం చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. గూగుల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉన్నందువల్ల ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.

గతంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్ల గెలుపు ఓటమిపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు.

పలువురిపై కేసు నమోదు..
నిర్మల్‌టౌన్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఆడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ, చిలమంతుల శివచారి భైంసాకు చెందిన రెహమాన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌, ఐడీ క్రియేట్‌ చేసుకున్నారు. డబ్బులను కై న్లుగా మార్చి యూజర్‌ ఐడీలో పెట్టి బెట్టింగ్‌ ఆడుతున్నామని కస్టమర్లకు చెప్పారు.

కస్టమర్లకు కూడా ఐడీ క్రియేట్‌ చేసి ఆడిపిస్తామని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,170 నగదు, 4 ఫోన్లు, 1 ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఇవి చదవండి: మొబైల్‌ రిపేరే.. జాడ చూపింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement