- పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ దొరబాబు
రూ.250 కోట్లతో దేశీయ ఆవుల పునరుత్పత్తి కేంద్రం
Published Sat, Oct 8 2016 7:52 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
చెల్లూరు(రాయవరం) :
దేశీయ ఆవుల పరిరక్షణ కు నెల్లూరు జిల్లాలోని చింతలదీవిలో రూ.250 కోట్లతో పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు తెలిపారు. మండలంలోని చెల్లూరులో బీజేపీ నేత ముత్యాల పుల్లయ్యచౌదరి ఇంట్లో శనివారం జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2,400 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరైందని, ఈ కేంద్రంలో ఒంగోలు, పుంగనూరు, సాహివాల్, గిర్, తదితర దేశీయ ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద పిండమార్పిడి విధానం అభివృద్ధికి, మేలుజాతి దూడల ఉత్పత్తికి కర్నూలు జిల్లా బన్వాసి, నంధ్యాల, విశాఖపట్నంలోని హనుమంతవాకలో సెమన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఏటా 40 లక్షల ఏఐ(ఆర్టిఫిషియల్ ఇనుస్ట్రుమెంట్) ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 2,400 మంది గోపాలమిత్రలకు అందజేసే గౌరవ వేతనం పెంచేందుకు కృషిచేస్తున్నట్లు దొరబాబు తెలిపారు. పశువుల పాల, అందాల ఈ పోటీల నిర్వహణకు జిల్లా స్థాయిలో రూ.3 లక్షలు, రాష్ట్ర స్థాయిలో రూ.6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పశువుల పాల, అందాల పోటీలు నిర్వహించామన్నారు.
Advertisement
Advertisement