ఆదా.. ఆదాయం డబుల్‌ | PM Modi in Odisha live Updates Development Projects | Sakshi
Sakshi News home page

ఆదా.. ఆదాయం డబుల్‌

Sep 27 2025 1:16 PM | Updated on Sep 28 2025 5:10 AM

PM Modi in Odisha live Updates Development Projects

కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలకు భారీ లబ్ధి  

జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గాయి  

కాంగ్రెస్‌ పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాం   

ఒడిశా పర్యటనలో ప్రధాని మోదీ స్పషీ్టకరణ  

రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం  

ఝార్సుగూడ:  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా లూటీ జరిగిందని, జనం సొమ్మును ఆ పార్టీ దోచుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల నుంచి కూడా భారీగా పన్నులు వసూలు చేసిందని ఆరోపించారు. లూటీ సంస్కృతి నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో పర్యటించారు. రూ.50 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘అంత్యోదయ గృహ యోజన’ కింద 50 వేల మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. 

ఝార్సుగూడ్‌లో ‘నమో యువ సమావేశ్‌’లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను తొలగించడంతోపాటు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్‌ బచత్‌(ఆదా), డబుల్‌ కమాయి(ఆదాయం) కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో రూ.2 లక్షల ఆదాయంపైనా పన్ను విధించారని గుర్తుచేశారు. అప్పటి పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని చెప్పారు. ఆదాయం పెంచుకొని, డబ్బులు ఆదాయ చేసుకొనే కొత్త శకం ఇప్పుడు ఆరంభమైందన్నారు. గతంలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో రూ.25 వేల పన్నులే ఉండేవని, ఇప్పుడు ఆ పన్నులు రూ.5 వేలకు పడిపోయాయని తెలిపారు. అంటే ప్రజలకు రూ.20 వేలు ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు.  


 

చిప్‌ నుంచి షిప్‌ దాకా...  
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో రైతులు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని ప్రధానమంత్రి ఆనందం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పాలనలో ట్రాక్టర్‌ కొంటే పన్ను కింద రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.40 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. వ్యవసాయ పరికారాల ధరలు భారీగా తగ్గిపోయానని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. 

పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చాలన్నదే తమ ధ్యేయమని ప్రకటించారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావడంతో ఒడిశా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పేదరికానికి మారుపేరైన ఒడిశా ఇప్పుడు సౌభాగ్యవంతంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆవశ్యకతను ప్రధానమంత్రి వివరించారు. చిప్‌ నుంచి షిప్‌ దాకా అన్నింటికా మనం స్వయం సమృద్ధి సాధించాలని, అదే మన సంకల్పమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.  

రూ.11 వేల కోట్లతో 8 ఐఐటీల విస్తరణ  
ఒడిశాలో ప్రధాని మోదీ  పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇందులో టెలికమ్యూనికేషన్లు, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.11 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీల విస్తరణకు మోదీ శంకుస్థాపన చేశారు. ఐఐటీ–భువనేశ్వర్‌ భాగస్వామ్యంతో సెమీకండక్టర్‌ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో నాణ్యత పెంచడానికి ‘మెరిట్‌’ పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా నుంచి గుజరాత్‌కు ప్రయాణించే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పచ్చజెండా ఊపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement