పశువైద్యం మృగ్యం | not available the veterinary doctors | Sakshi
Sakshi News home page

పశువైద్యం మృగ్యం

Published Thu, Jan 23 2014 5:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

not available the veterinary doctors

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: పశువులకు వైద్యం దూరమవుతోంది. గ్రామాలకు దూరంగా పశువైద్యశాలలు ఉండటంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటి వద్దకు తీసుకువెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి మూతపడ్డాయి. వేళలులను కూడా సక్రమంగా పాటించడం లేదు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు
 
 పశువైద్యశాలలు తెరిచి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎక్కువ శాతం పశువైద్యశాలల్లో వేళలకు మంగళం పాడేస్తున్నారు. నిర్ణీత వేళల్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. దాంతో అనేక మంది పశుపోషకులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్నారు. 172 మంది గోపాలమిత్రులు ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ, ప్రాథమిక చికిత్సలకే వారు పరిమితమవుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులకు సుస్తీ చేస్తే వాటి పోషకులు వైద్యం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.

 జిల్లాలో 118 పశువైద్యశాలలు, 103 గ్రామీణ పశువైద్యశాలలు, 9 సహాయ సంచాలకుల పశువైద్యశాలలతోపాటు జిల్లా కేంద్రంలో బహుళార్థ పశువైద్యశాల ఉంది. 9 లక్షల 70 వేల 319 గేదెలు, 74,530 ఆవులు, 14లక్షల 6 వేల 401 గొర్రెలు, 4 లక్షల 6 వేల 260 మేకలు, 9 లక్షల 73 వేల 959 కోళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖపై ఉంది. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల పశువైద్యం దూరమవుతోంది. బుధవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

 ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్‌తోపాటు కొత్తపట్నం మండలాలున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి. ఒంగోలు మండలంలోని సుదూర గ్రామాలకు చెందిన పశువులకు, కొత్తపట్నం మండలంలోని పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు.

 కందుకూరు పరిధిలో పశువులకు గాలికుంటు, బొబ్బ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాక్సిన్ వేసినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడంతో వాటిపై ఆధారపడిన పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పశువైద్యులు సకాలంలో స్పందించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు.

  కనిగిరి నియోజకవర్గంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగినట్లుగా అక్కడ గతంలో సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పశువుల, గొర్రెల మార్కెట్ యార్డులు గతంలో ఉంటే ప్రస్తుతం వాటి ఆచూకీ లేకుండా పోయింది. సంచార పశువైద్యశాల సేవలు నిలిచిపోయాయి. సీఎస్‌పురం మండలం నల్లమడుగుల ఉప పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మూతపడింది.

 మార్కాపురం పరిధిలో పశువైద్య సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని పశువైద్యశాల మూతపడింది. మీర్జాపేట, తుమ్మలచెరువుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తర్లుపాడుకు చెందిన పశువైద్యుడు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండటంతో పశు పోషకులు పెదవి విరుస్తున్నారు.


 యర్రగొండపాలెం పరిధిలో పశువులకు సంబంధించి మందులున్నప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. తొలకరి వర్షాలకు ముందు పశువులకు వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా వర్షాలు పడిన తరువాత వేయడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పుల్లలచెరువులో పశువైద్యుడు ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు.

 సంతనూతలపాడు పరిధిలో పశువులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. చీమకుర్తిలోని పశువైద్యశాల నాలుగు సెంట్ల స్థలంలో నిర్వహిస్తున్నారు. ఆ స్థలంలోని గది నిండా దాణా, మందులతో నిండిపోతుంది. వర్షం వస్తే వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
 కొండపి పరిధిలోని పశువైద్యుల్లో ఎక్కువ మంది ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొండపిలో పశువైద్యశాలకు భవనం లేకపోవడంతో పాల కేంద్రంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పొన్నలూరులో 50 గ్రామాలకు ఒక్క పశువైద్యశాల ఉంది. 25 కిలోమీటర్ల నుంచి పశువులను తీసుకురావడం కష్టతరంగా మారింది.

 అద్దంకి పరిధిలో పశువైద్యశాలలు పశువులకు అందుబాటులో ఉండటం లేదు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు పశువైద్యశాల 26 గ్రామాల పరిధిలోని పశుపోషకులు ఉపయోగించుకోవలసి వస్తోంది. వైద్యులు, సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో బల్లికురవ, కొరిశపాడుల్లో ఎక్కువగా మూతపడే ఉంటున్నాయి.

 చీరాల పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే ఉంది. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉచితంగా అందించాల్సిన దాణాను అక్కడివారు విక్రయించుకుంటున్నారని పశుపోషకులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. మందులను కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది మందులు బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

 పర్చూరు పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. నూతలపాడు, చెరుకూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ సకాలంలో వాటిని తెరవడం లేదు. పర్చూరులో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు.

  దర్శి పరిధిలో పశువైద్యం సక్రమంగా అందడం లేదు. కురిచేడులో 54 వేల వరకు పశువులు ఉంటే ఒక్క పశువైద్యశాల ఉంది. దాంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటికి వైద్యం చేయించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొనకొండలో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.

 గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పశువైద్య సేవలు అందించాలంటే వాటి పోషకులకు భారంగా మారింది. అర్ధవీడు మండలం వెలగలపాయలోయ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి వైద్యశాల 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement