veterinary doctors
-
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
పశుఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులు, పారా వెట్లు, డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అంబులెన్స్‌ల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని తెలిపారు. ప్రతీ జిల్లాలో ఎనిమిది మంది పశువైద్యులు, ఎనిమిది మంది పారా వెట్(వెటర్నరీ టెక్నీషియన్)లు, ఎనిమిది మంది పైలట్ల(డ్రైవర్లు) చొప్పున మొత్తం 144 మంది సిబ్బంది అవసరమన్నారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ డాక్టర్లు కూడా అర్హులే అన్నారు. పారా వెట్ పోస్టులకు డిప్లమో ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్ఎంవీ లైసెన్సుతో కనీసం 2–3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9154984484లో సంప్రదించాలన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్‌గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్‌లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్‌సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్‌గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్‌పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్‌రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
కొండచిలువకు ఎంత కష్టం వచ్చింది
-
అయ్యో! కొండచిలువకు ఎంత కష్టం..
సిడ్నీ : సాధారణంగా కొండచిలువలు ఎలుకలు, ఇతర జంతువులను మింగేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఒక కొండచిలువ బీచ్ టవల్‌ను మింగి నానా అవస్థలు పడింది. అయితే దానికి ఎలాంటి హానీ కలగకుండా వైద్యులు కష్టపడి కొండచిలువ నోటి నుంచి టవల్‌ను బయటికి తీశారు. వివరాలు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి మోంటీ అనే కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఒకరోజు దానిని సరదాగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఈలోగా కొండచిలువకు ఆకలయిందో ఏమో కానీ పక్కనే ఉన్న టవల్‌ను అమాంతం మింగేసింది. అయితే స్నాక్స్ పెడదామని భావించిన యజమానికి కొండ చిలువ నానా అవస్థలు పడుతూ కనిపించింది. దానికి ఏమైందోనని కంగారుపడిన యజమాని సిడ్నీలోని సాష్(స్మాల్ ఎనిమల్ స్పెషలిస్ట్) అనే వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పరీక్షలు చేసిన వెటర్నరీ వైద్యులు దాని కడుపులో ఒక బారీ పదార్థం ఉందని గుర్తించారు. ఎలాగోలా కష్టపడి చివరకు విజయవంతంగా కొండచిలువ కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. 'మోంటీ సురక్షితంగా ఉండడం నాకు ఆనందం కలిగించింది. అది అంత పెద్ద టవల్‌ను మింగేయడంతో కంగారుపడ్డాను. కానీ వైద్యులు చాకచక్యంగా దాని కడుపులో నుంచి టవల్‌ను బయటికి తీశారు. డాక్టర్లకు నా కృతజ్ఞతలు' అంటూ యజమాని పేర్కొన్నాడు. కాగా ఈ వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేయడంతో పాటు ప్లాస్టిక్ వంటి పదార్థాలు మూగ జీవాలకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చూడండి అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. This is what plastic & other waste is doing to other species. Vets here pulling AN ENTIRE BEACH TOWEL out of a python in Australia. Imagine what we are doing. Video Not for faint hearted person. pic.twitter.com/vDgPm6CgAe — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 28, 2020 -
బుజ్జి కుక్కకు బోలెడు కష్టం
రాష్ట్ర రాజధానిలో పెంపుడు శునకాలకు ప్రత్యేకించి పప్పీలకు ఆపదొచ్చింది. ఇంటిల్లిపాదీ అల్లారుముద్దుగా పెంచుకునే శునకాలపై మాయదారి కెనైన్ డిస్టెంపర్ వైరస్ పంజా విసురుతోంది. దీని బారినపడి పక్షం రోజులుగా హైదరాబాద్‌లో 30కిపైగా పెంపుడు కుక్కలు మరణించాయి. ఈ పరిణామం శునకాల యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ వేగంగా ఇతర పెంపుడు జంతువులకు వ్యాపిస్తుండటంతో వెటర్నరీ వైద్యులు హైఅలర్ట్ ప్రకటించారు. – హైదరాబాద్ ఎలా వ్యాపిస్తుంది? ఈ వైరస్ లాలాజలం, రక్తం లేదా మూత్రం ద్వారా ఒక శునకం నుంచి మరో శునకానికి వ్యాపిస్తుంది. అలాగే దగ్గు, జలుబుతోపాటు ఆహారం, మంచినీరును ఒకే గిన్నెలో పంచుకోవడం ద్వారా వైరస్ ఇతర శునకాలకు విస్తరిస్తుంది. లక్షణాలు ఏమిటి? పెంపుడు శునకాల శ్వాశకోస, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలను కెనైన్ డిస్టెంపర్ వైరస్ దెబ్బతీస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి మందగించడం, దగ్గు, తుమ్ములతోపాటు కళ్లు పుసులు కట్టడం, ముక్కు నుంచి పసుపుపచ్చ ద్రవం కారడం ఈ వ్యాధి లక్షణాలు. రోగ నిరోధక శక్తి లేకే... రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పెంపుడు కుక్కల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. శునకాలకు టీకాలను సకాలంలో వేయని కారణంగా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందని, పెంపుడు కుక్కలకు వైరస్ రాకుండా ఉండాలంటే టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. వైరస్‌ను గుర్తించాలిలా ఈ వైరస్‌కు గురైన శునకాలను గుర్తించేందుకు యజమానులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని శునకాలకు పొట్టపై పొక్కుల వంటివి వస్తే వాటికి తప్పకుండా ‘కెనైన్ డిస్టెంపర్’ వైరస్ వచ్చినట్లేనని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే శునకాలు బతకడం కష్టం అంటున్నారు. ఇలాంటి శునకాలకు దవడలు, కాళ్లు పదేపదే కొట్టుకోవడం, తలపై ఫ్లూయిడ్ బంప్స్ అవ్వడం, వైబ్రేషన్‌కు గురవుతాయంటున్నారు. వైరస్ గుర్తింపునకు ప్రత్యేక కిట్.. పెంపుడు శునకాలు కెనైన్ డిస్టెంపర్ వైరస్ బారిన పడ్డాయా లేదా అని నిర్ధారించేందుకు వైద్యులు ‘డయాగ్నోస్టిక్ కిట్’తో చెకప్ చేస్తారు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ను అదే రోజు నుంచి ప్రారంభిస్తారు. మొదటి వ్యాక్సినేషన్ ఆరు వారాల వయసు నుంచి పెంపుడు కుక్కకు ఇప్పించాలి. ఆరు వారాల అనంతరం ప్రతి నెల రెండు పర్యాయాలు, ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్‌ను ‘సెవెన్ ఇన్ వన్ లేదా నైన్ ఇన్ వన్’ అని పిలుస్తారు. ఒకటి నుంచి 20కి పెరిగిన కేసులు.. రాంనగర్‌కు చెందిన ఓ శునకం ఈ వైరస్‌బారిన పడటంతో యజమాని దాన్ని నారాయణగూడ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్ని పరీక్షించిన డాక్టర్ స్వాతిరెడ్డి ఈ పెట్ కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు ధ్రువీకరించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పెట్ నుంచి మరో 19 పెట్స్‌కు వైరస్సోకింది. ఇలా ఒక్క రాంనగర్ నుంచే ఈ వైరస్‌కు గురైన పెట్స్ కేసులు 20 నమోదయ్యాయి. ఒక్క నారాయణగూడ హాస్పిటల్లోనే ఫలక్‌నుమా నుంచి 6, రామాంతపూర్ నుంచి 2 కేసుల చొప్పున మూడు నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా నెలకు 20–30 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని రోజులకే చచ్చిపోయింది... మా ‘గోల్డెన్ రిట్రీవర్’ శునకం 4 నెలల వయసులో అనారోగ్యానికి గురవడంతో నారాయణగూడ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకినట్లు చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే మా పప్పీ చచ్చిపోయింది. –విక్కీ, రాంనగర్ ఇప్పటివరకు 30 కేసులను గుర్తించా... పలు సమస్యలతో బాధపడుతున్న పెట్స్‌ని హాస్పిటల్‌కు తీసుకురాగా చెక్ చేశాను. అవి కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు నిర్ధారించా. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ను అందించాల్సిన అవసరం ఉంది. వైరస్ వచ్చిన పెట్ని వేరే పెట్స్ మధ్యలో పెట్టడం కారణంగా మరో 19 పెట్స్‌కి కూడా ఈ వైరస్ సోకింది. వ్యాక్సినేషన్ సక్రమంగా ఇవ్వగలిగితే కొద్దిరోజులైనా పెట్ బతికే అవకాశం ఉంటుంది. – డాక్టర్ స్వాతిరెడ్డి, సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్, నారాయణగూడ అవగాహన అవసరం కెనైన్ డిస్టెంపర్ వైరస్ గురించి పెట్స్ యజమానుల్లో సరైన అవగాహన లేదు. కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థలు మందుకొచ్చి కొన్ని నిధులు సమకూరిస్తే అవగాహన కల్పించే పెట్స్ వైరస్‌కు గురి కాకుండా ఉండేందుకు సహకరించవొచ్చు. – డాక్టర్ ఎ. పరమేశ్వర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ హస్బెండరీ ఆఫీసర్ -
వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య
చెన్నై, పళ్లిపట్టు: అధికారి వేధింపులతో వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్కేపేటలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. పళ్లిపట్టు తాలూకా ఆర్కేపేట మహాన్‌కాలికాపురం గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు శివ(28). ఇతను బాలాపురంలోని ప్రభుత్వ పశు వైద్య కేంద్రంలో రెండు మాసాల కిందట వైద్యుడిగా విధుల్లో చేరాడు. బుధవారం విధులకు హాజరై సాయంత్రం ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబీకులు దిగ్భ్రాంతి చెందారు. విధుల్లో ఒత్తిడి, సహాయ డైరెక్టర్ మహేంద్రన్ నుంచి నిరంతరం వేధింపులు తాళలేక శివ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన బందువులు ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రమేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల రాస్తారోకో: వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్యకు తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్ మహేంద్రన్ కారణమని ఆరోపిస్తూ ఆయనను తొలగించాలని షోళింగర్ ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ప్రధాన రోడ్డుపై బంధువులు గురువారం రాస్తారోకో చేశారు. దీంతో ఆ మార్గంలో వాహన సేవలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. న్యాయం చేస్తామని హామీతో రాస్తారోకో విరమించారు. వైద్య సిబ్బంది ధర్నా:తమిళనాడు పశు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నుంచి వందకు పైగా వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనిగైవేలు అధ్యక్షత వహించారు. వైద్యుల పట్ల చిన్న చూపు ప్రదర్శించి తీవ్ర ఒత్తిడికి గురిచేసిన పశువైద్య సహాయ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశౠరు. వెంటనే అరెస్ట్ చేసి వైద్యులకు భద్రత కల్పించాలన్నారు. ధర్నాలో తిరుత్తణి సబ్ డివిజన్ కార్యదర్శి దామోదరన్, వైద్యులు పాల్గొన్నారు. అధికారిపై చర్యలు తీసుకుంటాం: జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి బంధువుల ఆరోపణల ఆధారంగా విచారణ చేపట్టి తిరుత్తణి పశుసంవర్థక శాఖ సహాయ డైరెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ అదనపు డైరెక్టర్ కుబేంద్రన్ తిరుత్తణిలో విలేకరులకు తెలిపారు. -
టెండర్లు వద్దు.. నేరుగా కొనండి!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలు, ఆవుల కొనుగోలుకు టెండర్లు పిలవకూడదని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిని ఎలా కొనాలన్న దానిపై పశుసంవర్థకశాఖ అధికారులు రెండు రకాల పద్ధతులను ప్రభుత్వానికి నివేదించారు. ఒకటి టెండర్లు పిలవడం, మరొకటి నేరుగా లబ్ధిదారులతో వెళ్లి కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో నేరుగా కొనుగోలు చేయడం వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. అంటే సబ్సిడీ గొర్రెల మాదిరిగానే బర్రెలను కూడా నేరుగా కొనుగోలు చేయనున్నారు. అలాగే ఈ బర్రెలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పశుసంవర్థకశాఖ మార్గదర్శకాలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించాక పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియ వైపే అధికారుల మొగ్గు సబ్సిడీ గొర్రెల కొనుగోలులో అనేక సమస్యలు వచ్చాయి. అనేక చోట్ల పేపర్ పైనే కొన్నట్లు, మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో ఈ బర్రెల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ద్వారా వెళితేనే మంచిదన్న అభిప్రాయాన్ని పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ద్వారా వెళితే ఆవు లేదా గేదె ప్రమాణాల ప్రకారం లేకుంటే కాంట్రాక్టర్‌దే బాధ్యత ఉంటుందన్నారు. పైగా పశు వైద్యులు వివిధ రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. ఆ నాలుగు డెయిరీల పాడి రైతులకే... ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పాడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతుల వాటా, ప్రభుత్వ వ్యయం కలిపి రూ.1,600 కోట్లతో ప్రణాళిక రచించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనుంది. రాష్ట్రంలోని పాడి రైతులందరికీ కాకుండా కేవలం విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, నార్ముల్ డెయిరీలకు పాలు పోసే రైతులకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో పాడి రైతుకు ఒక గేదె లేదా ఒక ఆవు వారి కోరిక మేరకు ఏదో ఒకటి ఇస్తారు. బర్రెలు కావాలా.. ఆవులు కావాలా ఏదో ఒకటి చెప్పాలని ఆయా డెయిరీలకు పశుసంవర్థకశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులను పంపిణీ చేయనుంది. అందులో 31 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులున్నారు. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పశు వైద్యులు ఆయా రాష్ట్రాలకు లబ్ధిదారులతో వెళ్లి పాడి పశువులను లారీల్లో తరలిస్తారు. ఒక్కో గేదె లేదా ఆవు యూనిట్ ధర రూ.62 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండే అవకాశముంది. పాడి పశువులను రెండేళ్లలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పథకం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కాదని వారంటున్నారు. ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదని, వచ్చే నెలలో పథకం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. -
వామ్మో మేమెళ్లం!
- గొర్రెల సేకరణ చేయబోమని పశు వైద్యుల నిరసన - సేకరణ కోసం వెళ్లిన 600 మంది అధికారులు వెనక్కు - టెండర్ల ద్వారానే పంపిణీ చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే గొర్రెల పథకానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. గొర్రెలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించేందుకు వెళ్లిన దాదాపు 600 మంది పశుసంవర్థక అధికారులు, పశు వైద్యులు వెనక్కు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. క్షేత్రస్థాయిలో పథకం అమలులో భాగస్వాములైన పశువైద్యులు, అధికారులే గొర్రెల కొనుగోలుకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. దీంతో అనేక ప్రాంతాల్లో గొర్రెల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గొర్రెల సేకరణ బాధ్యత పశు వైద్యులు, లబ్ధిదారులకు కాకుండా టెండర్ల ద్వారానే జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సేకరణ, పంపిణీలో సమస్యలు గత నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో కోటిన్నర గొర్రెలను పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే గొర్రెల పంపిణీకి మొదటి నుంచీ కష్టాలు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం పశు వైద్యులకు, ఇతర అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇతర రాష్ట్రాలలో వారం పది రోజులు పడిగాపులు కాసి, సొంత డబ్బులు ఖర్చు చేసుకుని తిరిగి వెతికినా అవసరమైన మేరకు గొర్రెలు లభించడం లేదు. ఒకవేళ దొరికినా వాటికి సరైన ధర కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక నిబంధనలకు విరుద్ధంగా చిన్న, ముసలి గొర్రెలు కొనడం లేదంటే తిరుగుముఖం పడుతున్నామని పశు వైద్యులు, లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం రెండేళ్లలో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేయాలి. ఈ ఏడాదికి 3.62 లక్షల మంది లబ్ధిదారులకు 72.11 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలన్న లక్ష్యం విధించారు. ఆ ప్రకారం రోజుకు 42 వేల గొర్రెలు పంపిణీ చేయాలి. మొదటి విడతలో భాగంగా 15.49 లక్షల గొర్రెలను నెల రోజుల్లో పంపిణీ చేయాలనుకున్నారు. అయితే ఈ నెల ఆరో తేదీ నాటికి కేవలం 1.96 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. ఇంత తక్కువ కావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. టెండర్ ప్రక్రియపై సమాలోచన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి రోజుల తరబడి అక్కడ ఉండటం, సేకరణ చేయడం కష్టంగా మారింది. మరోవైపు పశు వైద్యాధికారి కిడ్నాప్ వ్యవహారం కూడా కలకలం రేపింది. అధికారుల వెంట లబ్ధిదారులు కూడా వెళ్తుండటంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఒక్కోసారి అధికారులు, లబ్ధిదారుల ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పథకాల మాదిరే టెండర్ ప్రక్రియ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. గొర్రెల పంపిణీ అశాస్త్రీయంగా సాగుతోందని, తమపై పని ఒత్తిడి పెరుగుతుందని పశు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణతో గత ఐదు రోజులుగా గొర్రెల కొనుగోలుకు బ్రేక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెండర్ ప్రక్రియ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,148 మంది పశు సంవర్ధక, పశు వైద్య అధికారులు గొర్రెల కొనుగోలులో పని చేస్తుండగా, ఇందులో దాదాపు 600 మంది కొనుగోళ్లు నిలిపివేసినట్లు సమాచారం. దళారుల చేతుల్లోకి గొర్రెలు.. దళారుల జోక్యం లేకుండా గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దళారుల ప్రమేయం లేకుండా గొర్రెలను సేకరించడం అంత సులువైన వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొనుగోలు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ముందే దళారులు వెళ్లి అక్కడ ఎవరెవరు గొర్రెలు అమ్ముతున్నారో తెలుసుకుని వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన లబ్ధిదారులు, అధికారులకు దళారులు అధిక ధర చెబుతున్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ గొర్రెలు అనుకున్నంత స్థాయిలో లభించడం లేదు. మంత్రి తలసాని ఇటీవల జరిపి న సమీక్షలోనూ జిల్లా కలెక్టర్లు గొర్రెలు లభించడం లేదని స్పష్టం చేశారు. (చదవండి: కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన పశువైద్యుడు తిరుపతి) -
మదపుటేనుగు దాడిలో ఆడ ఏనుగు మృతి
మదపుటేనుగు దాడిలో ఆడఏనుగు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని నాగిరెడ్డిపల్లె, చిన్నశ్యామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన బయటపడింది. స్థానికుల కథనం మేరకు చిన్నశ్యామ వద్ద కోసువాముల బండ వద్దకు మంగళవారం ఉదయం పశువుల కాపరులు వెళ్ళారు. సమీపంలోని పొదల నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రావుస్తులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పదేళ్ళ వయస్సు ఉన్న ఆడ ఏనుగు మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. పలవునేరు రేంజ్ పరిధిలో తిరుగాడుతున్న మదపుటేనుగుల దాడిలో గర్భధారణ వయుస్సుకు రాని ఆడఏనుగు తీవ్రంగా గాయుపడి మృతి చెందినట్లు డీఆర్వో జయశంకర్ తెలిపారు. తిరుపతి జూపార్క్ నుంచి వస్తున్న పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
జీఓ 97ను రద్దు చేయాల్సిందే
ప్రొద్దుటూరు: ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 97ను రద్దు చేయాల్సిందేనని వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పశువైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారిన ఆ జీఓను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు శుక్రవారం కళాశాల ముందు ధర్నా చేశారు. ధర్నా ఐదవ రోజుకు చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అధ్యాపకులను బయటకు పంపించి కళాశాలకు తాళాలు వేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఆయన శుక్రవారం ధర్నాను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీఓ వలన పశు వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంపై త్వరలో విద్యార్థుల యూనియన్ ప్రతినిధులతో కలిసి తమ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఖర్చులకు గాను అసోసియేషన్ తరపున రూ.10 వేలు నగదు అందించారు. తాళ్లమాపురం పశువైద్యాధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ జీఓ విడుదల చేయడం చాలా బాధాకరమన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలాగే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు లక్ష్మినారాయణరెడ్డి, ఫణీంద్రారెడ్డి, మాధవ ఓబుళరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గంగాసురేష్, పి.అంకుశం, ఏరియా కార్యదర్శి నాగరాజు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. -
‘జిమ్మీ’ ఇక లేదు...
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఏఆర్ఐ క్వార్టర్స్ ప్రాంతవాసులకు రక్షణగా ఉన్న జిమ్మీ(కుక్క) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గత ఐదు సంవత్సరాలుగా క్వార్టర్స్ వాసులను విషసర్పాల నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న జిమ్మీ...గత ఎనిమిది నెలల క్రితం రక్తపింజరి కాటుకు గురైన అస్వస్థకు గురైంది. ఆ సమయంలో స్థానిక వెటర్నరీ డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి అనారోగ్యంగా ఉన్న జిమ్మీ శుక్రవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అదే ప్రాంతంలో గోతి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జమ్మీకి తోడుగా మరో కుక్క జానీ క్వార్టర్స్ ప్రాంతానికి వచ్చిన దాదాపు 40 కిపైగా పాములను కరిచి చంపాయి. క్వార్టర్స్‌వాసులు ఈ కుక్కల ఆలనాపాలనా చూసేవారు. క్వార్టర్స్‌లోకి విషసర్పాలతో పాటు ఏ జంతువులను, ఇతరులెవ్వరిని లోనికి రానిచ్చేవి కాదు. జిమ్మీ మృతదేహం వద్ద జానీ రోదిస్తూ కూర్చోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
6 కాళ్ల శునకం
నాలుగు కాళ్ల కుక్కను అందరూ చూస్తారు. కానీ, ఆరు కాళ్లు, రెండు తోకలున్న కుక్కను చూసి ఉండరు. ఆ బుల్లి ఆడ కుక్క ఇదే. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా ద్వీపంలో బుధవారం పుట్టింది. రెండు శరీరాలు ఉదర భాగంలో అతుక్కున్నట్లు పుట్టిన ఈ పప్పీకి కిందివైపు నాలుగు కాళ్లు, చెరో పక్కన రెండు కాళ్లు.. మొత్తం ఆరు కాళ్లున్నాయి. గొర్రెలు, పశువులు కొన్నిసార్లు ఇలా విచిత్రరీతిలో పుడతాయని, కుక్కల్లో ఇలాంటిది నిజంగానే అరుదైన విషయమని వెటర్నరీ వైద్యులు చెప్పారు. పుట్టిన కొద్దిగంటలకే ఈ బుల్లి శునకం మరణించింది. -
పశువుల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత
పాడి రైతులకు తప్పని తిప్పలు 22 ఆస్పత్రులు అప్‌గ్రేడైనా ఫలితం శూన్యం జిల్లాలో 39వైద్యుల పోస్టులు ఖాళీ గుడ్లవల్లేరు : పశువుల ఆస్పత్రులలో చాలినంతమంది వైద్యులు లేకపోవడంతో పాడిరైతులు అవస్థలు పడుతున్నారు. కాగా కొన్ని ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పశువులకు వైద్యం చేయడానికి వీల్లేక వైద్యులు సమస్యలెదుర్కొంటున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 212 పశువుల ఆసుపత్రులు ఉండగా, వాటిలో 92 ఆస్పత్రులకే వైద్యులు ఉన్నారు. మిగిలిన వాటిలో వైద్య సిబ్బందే ఇప్పటివరకూ వైద్యం అందిస్తూ వచ్చారు. మొత్తం 114మంది వైద్యులు ఉం డాల్సి ఉండగా 39 ఖాళీలున్నాయి. కాగా ఇటీవల పశు వైద్య సహాయకులకు పదోన్నతులు రావడంతో 90 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పశువులకు సకాలంలో వైద్యం అందక చనిపోతున్నాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఆసుపత్రుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వం జిల్లాలో 22ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసింది. కాగా అందుకు తగినట్లుగా వైద్యులను నియమిం చడం కానీ, భవనాలు నిర్మిం చడం కానీ జరగలేదు. కేవలం నాలుగు ఆస్పత్రులకు మాత్రమే వైద్యులను నియమించారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటని పాడిరైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించేందుకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చటం లేదు. గోపాల మిత్ర భవనాలతో పాటు 80 గ్రామీణ పశు వైద్యశాలల నిర్మాణాలకు రూ.5.03కోట్లను కేటాయించినా పనులు పూర్తి స్థాయిలో జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలోని ఆస్పత్రిలో చాలా కాలం నుంచి వైద్యుడు లేకుండానే సిబ్బందే పశువులకు వైద్యం అందిస్తున్నారని రైతుక్లబ్ కన్వీనర్ పెన్నేరు ప్రభాకర్ తెలిపారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసినా డాక్టరూ రాలేదు. కొత్త భవనం నిర్మించ లేదని చెప్పారు. విన్నకోటలో పశువుల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేయడంతో పాలకేంద్రం ఆవరణలో పశువులకు వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. జిల్లాలో పశువుల వైద్యులు, వైద్య సహాయకుల కొరత ఉన్నమాట వాస్తవమేనని జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ టి.దామోదరనాయుడు అంగీకరించారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో అప్‌గ్రేడైన 22 ఆస్పత్రుల్లో కొన్నింటికి భవనాలను నిర్మించాల్సి ఉందని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని వివరించారు. -
పశువైద్యం మృగ్యం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: పశువులకు వైద్యం దూరమవుతోంది. గ్రామాలకు దూరంగా పశువైద్యశాలలు ఉండటంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటి వద్దకు తీసుకువెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి మూతపడ్డాయి. వేళలులను కూడా సక్రమంగా పాటించడం లేదు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పశువైద్యశాలలు తెరిచి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎక్కువ శాతం పశువైద్యశాలల్లో వేళలకు మంగళం పాడేస్తున్నారు. నిర్ణీత వేళల్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. దాంతో అనేక మంది పశుపోషకులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్నారు. 172 మంది గోపాలమిత్రులు ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ, ప్రాథమిక చికిత్సలకే వారు పరిమితమవుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులకు సుస్తీ చేస్తే వాటి పోషకులు వైద్యం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లాలో 118 పశువైద్యశాలలు, 103 గ్రామీణ పశువైద్యశాలలు, 9 సహాయ సంచాలకుల పశువైద్యశాలలతోపాటు జిల్లా కేంద్రంలో బహుళార్థ పశువైద్యశాల ఉంది. 9 లక్షల 70 వేల 319 గేదెలు, 74,530 ఆవులు, 14లక్షల 6 వేల 401 గొర్రెలు, 4 లక్షల 6 వేల 260 మేకలు, 9 లక్షల 73 వేల 959 కోళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖపై ఉంది. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల పశువైద్యం దూరమవుతోంది. బుధవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్‌తోపాటు కొత్తపట్నం మండలాలున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి. ఒంగోలు మండలంలోని సుదూర గ్రామాలకు చెందిన పశువులకు, కొత్తపట్నం మండలంలోని పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. కందుకూరు పరిధిలో పశువులకు గాలికుంటు, బొబ్బ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాక్సిన్ వేసినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడంతో వాటిపై ఆధారపడిన పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పశువైద్యులు సకాలంలో స్పందించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగినట్లుగా అక్కడ గతంలో సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పశువుల, గొర్రెల మార్కెట్ యార్డులు గతంలో ఉంటే ప్రస్తుతం వాటి ఆచూకీ లేకుండా పోయింది. సంచార పశువైద్యశాల సేవలు నిలిచిపోయాయి. సీఎస్‌పురం మండలం నల్లమడుగుల ఉప పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మూతపడింది. మార్కాపురం పరిధిలో పశువైద్య సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని పశువైద్యశాల మూతపడింది. మీర్జాపేట, తుమ్మలచెరువుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తర్లుపాడుకు చెందిన పశువైద్యుడు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండటంతో పశు పోషకులు పెదవి విరుస్తున్నారు. యర్రగొండపాలెం పరిధిలో పశువులకు సంబంధించి మందులున్నప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. తొలకరి వర్షాలకు ముందు పశువులకు వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా వర్షాలు పడిన తరువాత వేయడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పుల్లలచెరువులో పశువైద్యుడు ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. సంతనూతలపాడు పరిధిలో పశువులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. చీమకుర్తిలోని పశువైద్యశాల నాలుగు సెంట్ల స్థలంలో నిర్వహిస్తున్నారు. ఆ స్థలంలోని గది నిండా దాణా, మందులతో నిండిపోతుంది. వర్షం వస్తే వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొండపి పరిధిలోని పశువైద్యుల్లో ఎక్కువ మంది ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొండపిలో పశువైద్యశాలకు భవనం లేకపోవడంతో పాల కేంద్రంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పొన్నలూరులో 50 గ్రామాలకు ఒక్క పశువైద్యశాల ఉంది. 25 కిలోమీటర్ల నుంచి పశువులను తీసుకురావడం కష్టతరంగా మారింది. అద్దంకి పరిధిలో పశువైద్యశాలలు పశువులకు అందుబాటులో ఉండటం లేదు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు పశువైద్యశాల 26 గ్రామాల పరిధిలోని పశుపోషకులు ఉపయోగించుకోవలసి వస్తోంది. వైద్యులు, సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో బల్లికురవ, కొరిశపాడుల్లో ఎక్కువగా మూతపడే ఉంటున్నాయి. చీరాల పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే ఉంది. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉచితంగా అందించాల్సిన దాణాను అక్కడివారు విక్రయించుకుంటున్నారని పశుపోషకులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. మందులను కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది మందులు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పర్చూరు పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. నూతలపాడు, చెరుకూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ సకాలంలో వాటిని తెరవడం లేదు. పర్చూరులో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. దర్శి పరిధిలో పశువైద్యం సక్రమంగా అందడం లేదు. కురిచేడులో 54 వేల వరకు పశువులు ఉంటే ఒక్క పశువైద్యశాల ఉంది. దాంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటికి వైద్యం చేయించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొనకొండలో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పశువైద్య సేవలు అందించాలంటే వాటి పోషకులకు భారంగా మారింది. అర్ధవీడు మండలం వెలగలపాయలోయ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి వైద్యశాల 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు. -
త్రిశంకు స్వర్గంలో వెటర్నరీ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ఆ వెటర్నరీ విద్యార్థులంత అదృష్టవంతులూ లేరు.. దురదృష్టవంతులూ లేరు. రాష్ట్రం లో పశువైద్యుల కొరత తీవ్రంగా ఉండడంతో బీవీఎస్సీ కోర్సు పూర్తయితే చాలు. ఇంటర్వ్యూలు కూడా లేకుండా ఉద్యోగాలు దొరికేవి. అలా వీరు అదృష్టవంతులు. అయితే, వారు చదివిన కాలేజీలకు గుర్తింపు రాకపోవడంతో డిగ్రీలు చెల్లనివిగా మారిపోయాయి. దీంతో వారు దురదృష్టవంతులుగా మిగిలి పోయారు. రాష్ట్రంలోని కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలు నిబంధనలు పాటించనందున వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) గుర్తింపు రద్దు చేసింది. దీంతో వారు ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోయారు. వివరాలిలా ఉన్నాయి. పశువైద్య విద్య ప్రాధాన్యం గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2008-09లో కోరుట్ల, ప్రొద్దుటూరుల్లో రెండు వెటర్నరీ కళాశాలను ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం సర్కార్ వీటిని పట్టించుకోలేదు. భవనాలు, అధ్యాపకులు, ప్రయోగశాలల ఊసే లేదు. వాటి గురించి హెచ్చరించినా స్పందన లేకపోవడంతో వీసీఐ ఆ రెండు కళాశాలల గుర్తింపు రద్దు చేసింది. అడ్మిషన్లను సైతం నిరాకరించింది. దీంతో ఆగమేఘాలమీద స్పందిం చిన రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది నియామకాలు పూర్తి చేసింది. భవనాల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాదికి అడ్మిషన్లకు అనుమతి సాధించింది. అయితే, ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కాలేజీల్లో మొదటి బ్యాచ్ పూర్తయి ఈ నెలలో విద్యార్థులకు పట్టాలు కూడా వచ్చాయి. కానీ, ఆ కాలేజీల డిగ్రీలను వీసీఐ గుర్తించలేదు. రాష్ట్రంలో 469 వెటర్నరీ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. ఆపోస్టులకు ఈ రెండు కాలేజీల్లో పట్టాలు పొందినవారు అర్హులు కాకుండాపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా త మ భవిష్యత్తు అంధకారమైందని ఆ కాలేజీలకు చెంది న 60 మంది గ్రాడ్యుయేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో గుర్తింపు వస్తుంది: డీన్ చంద్రశేఖర్‌రావు ప్రొద్దుటూరు, కోరుట్ల విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తామని వెటర్నరీ యూనివర్సిటీ డీన్ చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆ రెండు కాలేజీల డిగ్రీలకు త్వరలోనే వీసీఐ గుర్తింపు వస్తుందన్నారు.