- గొర్రెల సేకరణ చేయబోమని పశు వైద్యుల నిరసన
- సేకరణ కోసం వెళ్లిన 600 మంది అధికారులు వెనక్కు
- టెండర్ల ద్వారానే పంపిణీ చేయాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే గొర్రెల పథకానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. గొర్రెలను వివిధ రాష్ట్రాల నుంచి సేకరించేందుకు వెళ్లిన దాదాపు 600 మంది పశుసంవర్థక అధికారులు, పశు వైద్యులు వెనక్కు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. క్షేత్రస్థాయిలో పథకం అమలులో భాగస్వాములైన పశువైద్యులు, అధికారులే గొర్రెల కొనుగోలుకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. దీంతో అనేక ప్రాంతాల్లో గొర్రెల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గొర్రెల సేకరణ బాధ్యత పశు వైద్యులు, లబ్ధిదారులకు కాకుండా టెండర్ల ద్వారానే జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
సేకరణ, పంపిణీలో సమస్యలు
గత నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో కోటిన్నర గొర్రెలను పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే గొర్రెల పంపిణీకి మొదటి నుంచీ కష్టాలు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం పశు వైద్యులకు, ఇతర అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇతర రాష్ట్రాలలో వారం పది రోజులు పడిగాపులు కాసి, సొంత డబ్బులు ఖర్చు చేసుకుని తిరిగి వెతికినా అవసరమైన మేరకు గొర్రెలు లభించడం లేదు. ఒకవేళ దొరికినా వాటికి సరైన ధర కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక నిబంధనలకు విరుద్ధంగా చిన్న, ముసలి గొర్రెలు కొనడం లేదంటే తిరుగుముఖం పడుతున్నామని పశు వైద్యులు, లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం రెండేళ్లలో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేయాలి. ఈ ఏడాదికి 3.62 లక్షల మంది లబ్ధిదారులకు 72.11 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలన్న లక్ష్యం విధించారు. ఆ ప్రకారం రోజుకు 42 వేల గొర్రెలు పంపిణీ చేయాలి. మొదటి విడతలో భాగంగా 15.49 లక్షల గొర్రెలను నెల రోజుల్లో పంపిణీ చేయాలనుకున్నారు. అయితే ఈ నెల ఆరో తేదీ నాటికి కేవలం 1.96 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. ఇంత తక్కువ కావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
టెండర్ ప్రక్రియపై సమాలోచన
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి రోజుల తరబడి అక్కడ ఉండటం, సేకరణ చేయడం కష్టంగా మారింది. మరోవైపు పశు వైద్యాధికారి కిడ్నాప్ వ్యవహారం కూడా కలకలం రేపింది. అధికారుల వెంట లబ్ధిదారులు కూడా వెళ్తుండటంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఒక్కోసారి అధికారులు, లబ్ధిదారుల ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పథకాల మాదిరే టెండర్ ప్రక్రియ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. గొర్రెల పంపిణీ అశాస్త్రీయంగా సాగుతోందని, తమపై పని ఒత్తిడి పెరుగుతుందని పశు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణతో గత ఐదు రోజులుగా గొర్రెల కొనుగోలుకు బ్రేక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెండర్ ప్రక్రియ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,148 మంది పశు సంవర్ధక, పశు వైద్య అధికారులు గొర్రెల కొనుగోలులో పని చేస్తుండగా, ఇందులో దాదాపు 600 మంది కొనుగోళ్లు నిలిపివేసినట్లు సమాచారం.
దళారుల చేతుల్లోకి గొర్రెలు..
దళారుల జోక్యం లేకుండా గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దళారుల ప్రమేయం లేకుండా గొర్రెలను సేకరించడం అంత సులువైన వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొనుగోలు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ముందే దళారులు వెళ్లి అక్కడ ఎవరెవరు గొర్రెలు అమ్ముతున్నారో తెలుసుకుని వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన లబ్ధిదారులు, అధికారులకు దళారులు అధిక ధర చెబుతున్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ గొర్రెలు అనుకున్నంత స్థాయిలో లభించడం లేదు. మంత్రి తలసాని ఇటీవల జరిపి న సమీక్షలోనూ జిల్లా కలెక్టర్లు గొర్రెలు లభించడం లేదని స్పష్టం చేశారు.
(చదవండి: కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన పశువైద్యుడు తిరుపతి)
వామ్మో మేమెళ్లం!
Published Sun, Jul 9 2017 4:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM
Advertisement
Advertisement