మదపుటేనుగు దాడిలో ఆడఏనుగు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని నాగిరెడ్డిపల్లె, చిన్నశ్యామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన బయటపడింది. స్థానికుల కథనం మేరకు చిన్నశ్యామ వద్ద కోసువాముల బండ వద్దకు మంగళవారం ఉదయం పశువుల కాపరులు వెళ్ళారు. సమీపంలోని పొదల నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రావుస్తులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పదేళ్ళ వయస్సు ఉన్న ఆడ ఏనుగు మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. పలవునేరు రేంజ్ పరిధిలో తిరుగాడుతున్న మదపుటేనుగుల దాడిలో గర్భధారణ వయుస్సుకు రాని ఆడఏనుగు తీవ్రంగా గాయుపడి మృతి చెందినట్లు డీఆర్వో జయశంకర్ తెలిపారు. తిరుపతి జూపార్క్ నుంచి వస్తున్న పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.