"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి.
అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్‌లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా.
ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్‌లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్‌స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది.
ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్‌లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత.
సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం
‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్‌తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్‌కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది.
పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి
‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్‌లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్‌లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్‌లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment