‘సోలార్’వైపు.. రైల్వే చూపు! | railway department plans to use solar energy | Sakshi
Sakshi News home page

‘సోలార్’వైపు.. రైల్వే చూపు!

Published Fri, Dec 27 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

railway department plans to use solar energy

సాక్షి, ముంబై: చర్చిగేట్ రైల్వేస్టేషన్ విద్యుత్ వినియోగాన్ని, ఖర్చును సాధ్యమైనంత మేర తగ్గించుకునేందుకు యోచిస్తోంది. త్వరలోనే సౌర శక్తి (సోలార్) వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇది అమల్లోకి వస్తే పశ్చిమ రైల్వేలో సౌరశక్తి ద్వారా విద్యుత్ అవసరాలు తీర్చుకుంటున్న మొదటి స్టేషన్‌గా చర్చిగేట్ రైల్వే స్టేషన్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. స్టేషన్ ఆవరణలో రైళ్ల ఇండికేటర్లు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రిక్ పరికరాల కోసం సౌర శక్తిని ఉపయోగించనున్నట్లు పశ్చిమ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.

ఇంధనం, విద్యుత్ వినియోగపు ఖర్చు భారీగా పెరిగిపోతుండటంతో పొదుపు చర్యల్లో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాల అమలుపై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ సౌరశక్తి వినియోగంలోకి వస్తే ఏడాదికి 4.44 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చు మిగులుతుందని, రూ.36 కోట్ల విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయని అధికారులు  అంచనా వేస్తున్నారు. పశ్చిమ రైల్వే పీఆర్వో శరత్ చంద్రాయన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, వచ్చే ఏడాది వరకు పూర్తి అవుతుందని అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ఇదే తరహాలో మిగతా రైల్వేస్టేషన్లలో కూడా సోలార్ వ్యవస్థను ఏర్పాటుచేస్తామని తెలిపారు. అంతేకాకుండా మున్ముందు స్టేషన్ లోపలి కార్యాలయాల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నట్లు వారు వెల్లడించారు.

 సౌరశక్తిని ఉపయోగించడంతో విద్యుత్‌ను ఆదాచేయడమే కాకుండా వాతావరణంలో కాలుష్యం తగ్గుతోందన్నారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ రైల్వే కూడా తమ కార్యాలయాల్లో సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ను ఆదా చేయడానికి యోచిస్తోంది. ముంబై డివిజన్‌లో ఈ ఏడాది 245 లక్షల యూనిట్లు నాన్‌ట్రాక్షన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉపయోగించగా, గత ఏడాది 263 లక్షల యూనిట్లను ఉపయోగించారు. ఇదిలా వుండగా, మూడేళ్ల క్రితం పశ్చిమ రైల్వే రూ.రెండు కోట్లు వెచ్చించి తమ కార్యాలయానికి అద్దాలను అమర్చింది. ఇప్పుడు ఈ అద్దాలను తొలగించి వీటి స్థానంలో గాలి, వెలుతురు వచ్చే మరో ప్రత్యామ్నాయాన్ని అమర్చేందుకు యోచిస్తోంది. దీనిబట్టి చూస్తే ప్రజాధనం ఎలా వృథా చేస్తున్నారో తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement