healthcare sector
-
KOITA FOUNDATION: నై‘పుణ్య’ సేవ
కెరీర్లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు. తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు. క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్. ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్. హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్. ‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్టూల్స్ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్. ‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు. ‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్వర్కర్కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లకు ఇన్పుట్ డాటాతో ఔట్పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్. ‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్జీ ఈఎంఏ ఫైలింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది. విభాగాలవారీగా ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది. -
ఆరోగ్య విభాగంపై డాబర్ ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ విభాగం నుంచి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అలాగే హోమ్, పర్సనల్ కేర్ విభాగాల నుంచి ఆదాయాన్ని 5–7 ఏళ్లలో రూ.7,000 కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. హెల్త్ కేర్, హోమ్, పర్సనల్ కేర్‌తో కూడిన కన్జ్యూమర్ కేర్ విభాగం నుంచి డాబర్‌కు అధిక ఆదాయం వస్తుండడాన్ని గమనించొచ్చు. 2022–23 మొత్తం ఆదాయం రూ.11,530 కోట్లలో ఈ విభాగం నుంచి 56.2 శాతం లభించింది. హెర్బల్, ఆయుర్వేదిక్ ఉత్పత్తుల అమ్మకాలు తలసరి ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతాయని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది. ఎగువ మధ్యతరగతి జనాభా పెరుగుదలతో ప్రయోజనం పొందే ప్రీమియం బ్రాండ్లు కూడా డాబర్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో లో యూనిట్ ప్యాక్‌ల (ఎల్‌యూపీ) అమ్మకాలు సైతం పెరుగుతాయనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మందికి చేరుకునే విధంగా ఎల్యూపీల పోర్ట్‌ఫోలియో పెంచుతామని పేర్కొన్నారు. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో ప్రస్తుత ఉత్పత్తుల విభాగాలను విస్తరిస్తూనే, నూతన విభాగాల్లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రియల్ పేరుతో జ్యూస్‌ల విభాగంలో డాబర్ తగినంత మార్కెట్ వాటా సంపాదించం గమనార్హం. రియల్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. బాద్షా మసాలాను అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. డాబర్ గతేడాదే బాద్షా మసాలను రూ.587 కోట్లకు సొంతం చేసుకుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసుకునే ప్రణాళికతో ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు. గులాబరి బ్రాండ్‌పై బాడీవా‹Ù, సబ్బులను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. -
అంబానీ కీలక నిర్ణయం: మరో రంగంలో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: ఆసియా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం, రీటైల్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇపుడిక హెల్త్ కేర్ సెక్టార్లో ప్రవేశించనుంది. అదీ స్థానికంగా లభించే ఇతర ఆఫర్ల కంటే తక్కువకే జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన జినోమ్ కిట్‌ను 145 డాలర్లకు, మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 86 శాతం తక్కువకే అందించనుంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా మార్కెట్ చేయాలని రిలయన్స్ యోచిస్తోంది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జినోమ్ మ్యాపింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. క్యాన్సర్లు, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాలు లాంటి వ్యాధులు, వాటి ప్రభావాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్‌ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. మరికొన్నివారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కిట్‌ను కేవలం రూ.12 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రమేష్ హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనని రమేష్ హరిహరన్ తెలిపారు. ఫలితాలను వివరించడంలో స్ట్రాండ్ సరికొత్త శాస్త్రీయ పరిశోధనలను పొందుపరుస్తుందని హరిహరన్ తెలిపారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సహాయపడే జీవసంబంధమైన డేటా రిపోజిటరీని రూపొందించడానికి కూడా అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా MapmyGenome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. "మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..!) -
కరోనాతో హెల్త్‌కేర్‌లో ఉద్యోగాల వరద
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒక రంగానికి చాలా మేలు చేసింది. ఈ మహమ్మారి కారణంగా పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలు అంతకుముందు ఎన్నడూలేని స్థాయిలో భారీ నియామకాలకు మొగ్గు చూపించాయి. దీంతో ఈ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు పెద్ద పీట వేశాయి. నిపుణుల నియామకాలు 2021–22లో ఏకంగా 100 నుంచి 220 శాతం వరకు పెరిగినట్టు టీమ్‌లీజ్ సంస్థ ‘‘ప్రొఫెషనల్ స్టాఫింగ్ – డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ► హెల్త్‌కేర్ రంగంలో 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి 68 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 2021–22లో 75 లక్షలకు పెరిగింది. ఇందులో ప్రత్యేక నైపుణ్య ఉద్యోగులు 25 శాతం మంది ఉంటారు. ► 2025–26 నాటికి హెల్త్ కేర్ రంగం మొత్తం 95 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ► కరోనా తర్వాత హెల్త్‌కేర్ కంపెనీలకు డేటా ఆధారిత సహకారం కీలకంగా మారింది. రోగులకు సంబంధించి పెద్ద ఎత్తున డేటాను సమీకరించడం, విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇంత పెద్ద ఎత్తున డేటా విశ్లేషణ గతంలో ఎన్నడూ లేదు. ► డేటాకు సంబంధించి విధులతో కూడిన నర్స్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్, క్లినికల్ రీసెర్చ్ ఉద్యోగాలకు హెల్త్‌కేర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత తయారీ, విక్రయ విభాగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. ► హెల్త్‌కేర్ రంగంలో ప్రతి 5 నియామకాల్లో ఒకటి నర్స్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్ ఉండడం గమనార్హం. వీరి నియామకాలు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 175% పెరిగాయి. ► నాణ్యత నియంత్రణ, ల్యాబ్ కెమిస్ట్, క్రెడెన్షియలైజింగ్ స్పెషలిస్ట్‌కు డిమాండ్ 4%. నియామకాల్లో వృద్ధిని చూస్తే 200 శాతం పెరిగింది. ► ఫార్మా, బయోటెక్నాలజీ విభాగాల్లో ఎక్కువ నియామకాల వృద్ధి కనిపించింది. మొత్తం నియామకాల్లో 52 శాతం వాటా ఈ రెండు విభాగాల నుంచే ఉంది. ► మెడికల్ డివైజెస్ (పరికరాలు), హాస్పిటల్స్ సరఫరా విభాగాలు 23 శాతం నియామకాల వాటాతో రెండో స్థానంలోఉన్నాయి. ► హెల్త్‌కేర్ నియామకాల్లో ముంబై, బెంగళూరు ముందున్నాయి. పైగా మధ్య స్థాయి వ్యాపార సంస్థలే సగానికిపైగా ఉపాధి కల్పించాయి. ► రానున్న సంవత్సరంలో హెల్త్‌కేర్ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు 16–17 శాతంగా ఉంటుంది. -
లేడీబాస్.. మెగా డీల్
న్యూఢిల్లీ: లేడీబాస్ కిరన్ మజుందార్‌షా నేృతృత్వంలోని ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో దూసుకెళ్తోన్న బయోకాన్ భారీ డీల్‌కు తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్ బయోలాజిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్ బయోలాజిక్స్కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్ మధ్య డీల్ పూర్తి కానుంది. ఒప్పందంలో భాగంగా వయాట్రిస్ అంతర్జాతీయ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్ పొందిన బయోసిమిలర్స్ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది. రెండేళ్లలో ఐపీవోకు..: ఈ వ్యూహాత్మక కలయిక రెండు భాగస్వాముల పరిపూర్ణమైన సామర్థ్యాలు, బలాలను ఒకచోట చేర్చుతుందని బయోకాన్ బయోలాజిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘యూఎస్, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మార్కెట్లలో బయోకాన్ బయోలాజిక్స్ ఒక బలమైన వాణిజ్య వేదికను పొందేందుకు, ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించేందుకు, సంస్థ ప్రయాణాన్ని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. బయోకాన్ బయోలాజిక్స్ రెండేళ్లలో ఐపీవోకు రానుంది. తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ.60,400 కోట్లకు చేరుతుంది. ఐపీవో చాలా ఆకర్షణీయమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వాటాదార్లకు భారీగా విలువను సృష్టించబోతోంది. వయాట్రిస్ డీల్‌తో బయోసిమిలర్స్ రంగంలో బయోకాన్ బయోలాజిక్స్ లీడర్‌గా మారడానికి సహాయపడుతుంది. 2020–21లో రూ.2,900 కోట్ల ఆదాయం ఆర్జించాం’ అని వివరించారు. సుమారు రూ.7,550 కోట్లు.. వయాట్రిస్ బయోసిమిలర్స్ ఆదాయం వచ్చే ఏడాది సుమారు రూ.7,550 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్ కారణంగా బయోకాన్ ప్రస్తుత శ్రేణి వాణిజ్యీకరించిన ఇన్సులిన్లు, ఆంకాలజీ, ఇమ్యునాలజీ బయోసిమిలర్స్తోపాటు అభివృద్ధిలో ఉన్న అనేక ఇతర బయోసిమిలర్స్ ఆస్తులతో కూడిన సమగ్ర పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటానికి సాయపడుతుంది. ప్రస్తుతం 20 బయోసిమిలర్స్ పోర్ట్‌ఫోలియోను బయోకాన్ ఖాతాలో ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్‌తో గతంలో ప్రకటించిన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ పోర్ట్‌ఫోలియో సైతం తన ఖాతాకు జోడించింది. అంతర్జాతీయ బయోసిమిలర్స్ రంగంలో ధరల ఒత్తిడిని తగ్గించడంలో ఈ డీల్ సహాయపడుతుందని బయోకాన్ బయాలాజిక్స్ ఎండీ అరుణ్ చందవర్కర్ తెలిపారు. -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
ఏపీలో మొదలైన వైద్యవిప్లవం
నాణ్యమైన వైద్యం పొందాలన్నా, వైద్య విద్య చదవాలన్నా దీర్ఘకాలంగా పొరుగు రాష్ట్రాలమీద ఆధార పడుతున్నాం. కానీ వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఆ దిశగా సాగు తున్న అభివృద్ధి చిరకాల సమస్యలకు చరమగీతం పాడనుంది. ఏపీలో 8,000 కోట్ల రూపాయలతో కొత్తగా 16 మెడికల్ కళాశాలల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం. ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2,410 సీట్లు, మరో 20 ప్రైవేటు కాలేజీల్లో 2,800 సీట్లు, వెరసి 5,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వైద్య కళాశాలలతో ఏటా మరో రెండు వేల మంది చదువుకునే అవకాశం కలగనుంది. తాజాగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసు కున్న నిర్ణయం వైద్యవిద్యా యజ్ఞానికి మరింత మేలు చేకూరుస్తుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యు యేషన్ (ఎంబీబీఎస్) సీట్లు ఎన్నుంటాయో, వాటికి సమానంగా పీజీ సీట్లు కూడా పెంచుకొవచ్చనేది ఆ నిర్ణయ సారాంశం. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,275 పీజీ సీట్లు పెరుగుతాయి. కొత్తగా ఏర్పాటవుతున్న కళాశాలల్లో మరో 2,000 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్త మెడికల్ కళాశాలలతో 32 విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో బాటు ప్రతీ కళాశాలకు ఒక 500 పడకల అనుబంధ ఆసుపత్రి ఏర్పాటవుతుంది. అంటే మరో 8,000 పడకలు పెరుగుతాయి. కోవిడ్ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ప్రతీ అనుబంధ ఆసు పత్రిలో ఒక ఆక్సిజెన్ స్టోరేజ్ ప్లాంటు, ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం అవుతాయి. 2023 నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది. కొత్త కాలేజీల వల్ల 12 వేల మందికి శాశ్వత ఉపాధి లభిస్తుంది. సీనియర్ వైద్యులకు ప్రొఫెసర్ల హోదా, వైద్యులు, వైద్యబోధకుల నియామకాలతో పాటు నర్సింగ్, లాబ్ టెక్నీషియన్, ఐటీ, ఎలక్ట్రికల్ వంటి ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి. కోవిడ్ మహమ్మారి వేళ మన దేశంలో వైద్య సౌకర్యాల్లో బేలతనాన్ని కళ్లారా చూశాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ దేశంలో 1,457 మందికి ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నారు. వైద్య సదుపాయాల కల్పనలో మనదేశం ప్రపంచంలో 67వ స్థానంలో ఉంది. ఇంకా మన అవసరాలకు ఆరు లక్షల మంది వైద్యులు, ఇరవై లక్షల మంది నర్సులు కావాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టుల్లో 31 మెడికల్ కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ కొత్త 16 కళాశాలలు అందుబాటులోకి వస్తే వీటి సంఖ్య 48కి చేరుతుంది. ఇంతవరకూ ఉన్న వెనుకబాటుతనాన్ని సవరించుకుంటూ దేశంలోనే వైద్యవసతుల్లో అత్యున్నత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగనుంది. ఇవే కాకుండా ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం దక్కాలనే దీర్ఘదృష్టితో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఎన్నో సంస్కరణలు తెస్తున్నారు. గ్రామాల్లో 10,111 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు కాగా, 1,692 కోట్ల వ్యయంతో 854 కొత్త క్లినిక్స్ నిర్మాణం జరుగుతోంది. జ్వరమొస్తే డోలీ కట్టుకుని మైళ్ళ దూరం నడిచి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న ఏజెన్సీవాసుల కోసం 246 కోట్ల వ్యయంతో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు జరుగుతోంది. ఇకపై రాష్ట్రంలో ప్రతీ మండలంలో రెండు పీహెచ్ సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉండేటట్టు మార్పులు జరుగుతున్నాయి. పట్టణాల్లో పేదల వైద్యం కోసం ఇప్పటికే 560 యూహెచ్‌సీ (అర్బన్ హెల్త్ క్లినిక్)లు ఏర్పాటైనాయి. 355 కోట్లతో వాటికి 355 కొత్త భవనాలు, 265 పీహెచ్‌సీల మరమ్మతులకు 61.5 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రస్తుతమున్న 11 మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులను 3,820 కోట్లలో ఆధునీకరిస్తున్నారు. 682 కోట్ల రూపాయలతో 52 ఏరియా ఆస్పత్రులు, 528 కోట్ల రూపాయలతో 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి జరుగుతోంది. 13 కోట్ల రూపాయలతో రెండు మాతా శిశు సంరక్షణా కేంద్రాల మంజూరీ జరిగి, నిర్మాణాల కోసం సిద్ధమౌతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే ఏపీలో అందరికీ కార్పొరేట్ వైద్యం సంకల్పం నెరవేరనుంది. - చిలుకూరి శ్రీనివాసరావు వ్యాసకర్త ఉపాధ్యాయుడు -
ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలి
న్యూఢిల్లీ: రానున్న మధ్యంతర బడ్జెట్‌పై ఫార్మా, హెల్త్‌కేర్ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ కొన్ని విధానపరమైన చర్యల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎగుమతులకు ప్రస్తుతం ప్రోత్సాహాలు కల్పిస్తున్న ‘భారత్ నుంచి సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్)’ 2020 మార్చిలో కాల వ్యవధి తీరిపోతుందని, దీన్ని పొడిగించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతోంది. ఈ తరహా పథకాలను పొడిగించాలని పరిశ్రమ కోరుకుంటున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఇక పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలపై ఉన్న 150 శాతం ప్రామాణిక మినహాయింపును 200 శాతం చేయాలన్నది మరో డిమాండ్‌గా ఆయన పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీకి ఈ మాత్రం ప్రోత్సాహకం అవసరమన్నారు. జీఎస్టీని మినహాయించాలి... జీఎస్టీని హేతుబద్ధీకరించాలని హెల్త్‌కేర్ రంగం కోరుతోంది. పెరిగిన ముడి పదార్థాల ధరలతో ఆరోగ్య సంరక్షణ భారంగా మారుతోందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... ఈ రంగానికి సరఫరా అయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని మినహాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ ధరల భారాన్ని రోగుల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించకపోవడంతో, చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకోలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడి, తమ నిధుల లభ్యత ప్రభావితమై అధునాతన టెక్నాలజీలు, నాణ్యతపై వెచ్చించే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 150 శాతం తరుగుదలను అనుమతించే సెక్షన్ 35ఏడీని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. నూతన ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఇది ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ‘‘ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. మన దేశంలో ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే సగటు ఖర్చు 85 డాలర్లు (6,035). ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రానున్న బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నియంత్రణలు లేకుండా ప్రైవేటు రంగానికీ విస్తరింపచేయాలి’’ అని హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్, సీఈవో అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రోత్సాహకాలు కావాలి... చిన్న పట్టణాల్లోనూ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్లో ప్రకటించాలని హెల్త్‌కేర్ స్టార్టప్ ‘లెట్స్ఎండీ’ కోరింది. అలాగే, బీమా వ్యాప్తి కోసం చర్యలు అవసరమని ఈ సంస్థ సీఈవో నివేష్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల వ్యయాలు పెరిగిపోతుంటే, ఈ రంగంలో బీమా విస్తరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం, మెడికల్ డివైజెస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు మొదలైన చర్యలతో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా హెల్త్‌కేర్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో వీటికి తగినంత స్థాయిలో నిధుల కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం వైద్య పరికరాల రంగం 70 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీన్నుంచి బయటపడేందుకు మేకిన్ ఇండియా నినాదం తరహాలో బై ఇండియా (భారతీయ ఉత్పత్తులే కొనుగోలు చేయడం) విధానాలు కూడా అమలు చేస్తే బాగుంటుంది. – జీఎస్కే వేలు, మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ గ్రూప్ చైర్మన్ -
అపాక్స్ పార్ట్నర్స్ చెంతకు హెల్తీయమ్ మెడ్‌టెక్
ముంబై: భారత్‌కు చెందిన అతి పెద్ద సర్జికల్ ఉత్పత్తుల కంపెనీ హెల్తీయమ్ మెడ్‌టెక్(గతంలో స్యూటూర్స్ ఇండియా)ను బ్రిటిష్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, అపాక్స్ పార్ట్నర్స్ కొనుగోలు చేసింది. డీల్ విలువ దాదాపు రూ.2,000 కోట్లు. హెల్త్‌కేర్ రంగంలో అపాక్స్‌కు ఇది రెండో లావాదేవీ. 2007లో ఈ పీఈ సంస్థ, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో హెల్త్‌కేర్ రంగంలో తొలి పెట్టుబడి పెట్టింది. కాగా ఈ పీఈ సంస్థకు భారత్‌లో ఇది ఎనిమిదో ఇన్వెస్ట్మెంట్. ఈ కంపెనీ ఇప్పటి వరకూ వివిధ భారత కంపెనీల్లో 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఐగేట్, జెన్సర్ టెక్నాలజీస్, శ్రీరామ్ సిటీ యూనియన్, చోళమండలం ఫైనాన్స్ కంపెనీల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇతర పీఈ సంస్థలు భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతుండగా, ఈ పీఈ సంస్థ మాత్రం మంచి లాభాలు సాధించడం విశేషం. భారత కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ఈ పీఈ సంస్థ 250 కోట్ల డాలర్ల మేర రాబడులు పొందింది. అమెరికా తర్వాత ఈ సంస్థ అధికంగా పెట్టుబడులు పెడుతోంది భారత్‌లోనే. భారత్‌లో ప్రవేశించి గత ఏడాదికి పదేళ్లు దాటిన ఈ సంస్థ.. రానున్న నాలుగేళ్లలో భారత్‌లో వంద కోట్ల డాలర్లు పెట్టుబడుల పెట్టాలని యోచిస్తోంది. -
ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!
ఫిక్కీ-కేపీఎంజీ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత ఆర్థికాభివృద్ధిలో హెల్త్‌కేర్ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. 2011లో 74 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2020 నాటికి 16 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ తన నివేదికలో పేర్కొంది. హెల్త్‌కేర్ రంగంపై ప్రభుత్వం అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదని తెలిపింది. కేంద్రం ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంపై వెచ్చిస్తోన్న మొత్తం జీడీపీలో 4.2 శాతంగా ఉందని, ఇది ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. -
హెల్త్‌కేర్‌పై హెచ్‌సీఎల్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీయ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ కార్పొరేషన్ తాజాగా హెల్త్‌కేర్ రంగంపై దృష్టిపెట్టింది. తొలి దశలో రూ. 1,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. హెల్త్‌కేర్, వెల్నెస్ బిజినెస్‌ల ద్వారా 2020కల్లా 2 కోట్ల మందికి సేవలు అందించాలని భావిస్తున్నట్లు వివరించింది. ఇందుకు హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఐటీ దిగ్గజ ం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పీసీ తయారీ సంస్థ హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు మెజారిటీ వాటా ఉన్న సంగతి తెలిసిందే.దేశంలో ఉన్న 30 కోట్ల మంది పట్టణ మధ్య తరగతి జ నాభాపై హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కాగా ఇప్పటికే ఆరోగ్య పరిరక్షణ సేవలను అందిస్తున్న భారత్ ఫ్యామిలీ క్లినిక్‌లో మెజారిటీ వాటాను హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ సొంతం చేసుకుంది.