నాణ్యమైన వైద్యం పొందాలన్నా, వైద్య విద్య చదవాలన్నా దీర్ఘకాలంగా పొరుగు రాష్ట్రాలమీద ఆధార పడుతున్నాం. కానీ వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఆ దిశగా సాగు తున్న అభివృద్ధి చిరకాల సమస్యలకు చరమగీతం పాడనుంది. ఏపీలో 8,000 కోట్ల రూపాయలతో కొత్తగా 16 మెడికల్ కళాశాలల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం.
ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2,410 సీట్లు, మరో 20 ప్రైవేటు కాలేజీల్లో 2,800 సీట్లు, వెరసి 5,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వైద్య కళాశాలలతో ఏటా మరో రెండు వేల మంది చదువుకునే అవకాశం కలగనుంది. తాజాగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీసు కున్న నిర్ణయం వైద్యవిద్యా యజ్ఞానికి మరింత మేలు చేకూరుస్తుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యు యేషన్ (ఎంబీబీఎస్) సీట్లు ఎన్నుంటాయో, వాటికి సమానంగా పీజీ సీట్లు కూడా పెంచుకొవచ్చనేది ఆ నిర్ణయ సారాంశం. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,275 పీజీ సీట్లు పెరుగుతాయి. కొత్తగా ఏర్పాటవుతున్న కళాశాలల్లో మరో 2,000 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది.
కొత్త మెడికల్ కళాశాలలతో 32 విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో బాటు ప్రతీ కళాశాలకు ఒక 500 పడకల అనుబంధ ఆసుపత్రి ఏర్పాటవుతుంది. అంటే మరో 8,000 పడకలు పెరుగుతాయి. కోవిడ్ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని ప్రతీ అనుబంధ ఆసు పత్రిలో ఒక ఆక్సిజెన్ స్టోరేజ్ ప్లాంటు, ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణం అవుతాయి. 2023 నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది. కొత్త కాలేజీల వల్ల 12 వేల మందికి శాశ్వత ఉపాధి లభిస్తుంది. సీనియర్ వైద్యులకు ప్రొఫెసర్ల హోదా, వైద్యులు, వైద్యబోధకుల నియామకాలతో పాటు నర్సింగ్, లాబ్ టెక్నీషియన్, ఐటీ, ఎలక్ట్రికల్ వంటి ఉద్యోగాలు కూడా భర్తీ అవుతాయి.
కోవిడ్ మహమ్మారి వేళ మన దేశంలో వైద్య సౌకర్యాల్లో బేలతనాన్ని కళ్లారా చూశాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ దేశంలో 1,457 మందికి ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నారు. వైద్య సదుపాయాల కల్పనలో మనదేశం ప్రపంచంలో 67వ స్థానంలో ఉంది. ఇంకా మన అవసరాలకు ఆరు లక్షల మంది వైద్యులు, ఇరవై లక్షల మంది నర్సులు కావాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టుల్లో 31 మెడికల్ కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ కొత్త 16 కళాశాలలు అందుబాటులోకి వస్తే వీటి సంఖ్య 48కి చేరుతుంది. ఇంతవరకూ ఉన్న వెనుకబాటుతనాన్ని సవరించుకుంటూ దేశంలోనే వైద్యవసతుల్లో అత్యున్నత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగనుంది. ఇవే కాకుండా ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం దక్కాలనే దీర్ఘదృష్టితో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంస్కరణలు తెస్తున్నారు. గ్రామాల్లో 10,111 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు కాగా, 1,692 కోట్ల వ్యయంతో 854 కొత్త క్లినిక్స్ నిర్మాణం జరుగుతోంది. జ్వరమొస్తే డోలీ కట్టుకుని మైళ్ళ దూరం నడిచి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న ఏజెన్సీవాసుల కోసం 246 కోట్ల వ్యయంతో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు జరుగుతోంది.
ఇకపై రాష్ట్రంలో ప్రతీ మండలంలో రెండు పీహెచ్ సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరేసి డాక్టర్లు ఉండేటట్టు మార్పులు జరుగుతున్నాయి. పట్టణాల్లో పేదల వైద్యం కోసం ఇప్పటికే 560 యూహెచ్‌సీ (అర్బన్ హెల్త్ క్లినిక్)లు ఏర్పాటైనాయి. 355 కోట్లతో వాటికి 355 కొత్త భవనాలు, 265 పీహెచ్‌సీల మరమ్మతులకు 61.5 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రస్తుతమున్న 11 మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులను 3,820 కోట్లలో ఆధునీకరిస్తున్నారు. 682 కోట్ల రూపాయలతో 52 ఏరియా ఆస్పత్రులు, 528 కోట్ల రూపాయలతో 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధి జరుగుతోంది. 13 కోట్ల రూపాయలతో రెండు మాతా శిశు సంరక్షణా కేంద్రాల మంజూరీ జరిగి, నిర్మాణాల కోసం సిద్ధమౌతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే ఏపీలో అందరికీ కార్పొరేట్ వైద్యం సంకల్పం నెరవేరనుంది.
- చిలుకూరి శ్రీనివాసరావు
వ్యాసకర్త ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment