రేఖ–రిజ్వాన్
కెరీర్‌లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు.
తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు.
ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్‌ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు.
‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు.
క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్‌మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్.
ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్.
హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్.
‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్‌టూల్స్‌ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్.
‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు.
ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు.
‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్‌ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్‌ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్‌వర్కర్‌కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్‌లకు ఇన్‌పుట్ డాటాతో ఔట్‌పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది.
మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్.
‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ.
Comments
Please login to add a commentAdd a comment