
కుటుంబ ఆరోగ్యాన్నే కాదు సమాజ ఆరోగ్యాన్నీ రెప్పవేయకుండా కనిపెట్టుకోగలదు స్త్రీ! ఆ ఓపిక, శ్రద్ధ మెడిసిన్ డిగ్రీతో వచ్చినవి కావు.. డీఎన్‌ఏలో భాగమై వచ్చినవి!వాటి బలంతోనే డాక్టరమ్మగా అలుపులేని సేవలందిస్తోంది.. దేశ ఆరోగ్య నాడి లయ తప్పకుండా చూసుకుంటోంది! కానీ ఆమె సహనాన్ని బలహీనతగా తీసుకుని.. వైద్యరంగంలో ఆమె భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు! అది ప్రభుత్వ వైద్యరంగంలో స్త్రీల ప్రవేశానికి అడ్డంకిగా మారకముందే మేలుకుని.. నాయకత్వ హోదాల్లో మహిళలకు అవకాశాన్ని ఇచ్చి.. భద్రతను కల్పిస్తే... హెల్త్‌కేర్ సెక్టార్‌లో సాధికారత సాధ్యం కాదు తథ్యం!
→ ఆనందిబాయీ జోషీ
ఆమె బాల్యవివాహ బాధితురాలు. వైద్య సదుపాయాల్లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అప్పుడనుకుంది.. మెడిసిన్ చదవాలని! చదివింది.. అదీ అమెరికా, పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజ్‌లో. అలా చేతిలో మెడిసిన్ డిగ్రీ, మెడలో స్టెత్, దేశ తొలి మహిళావైద్యురాలిగా సొంతగడ్డ మీద అడుగుపెట్టింది. ఆవిడే డాక్టర్ ఆనందీబాయి జోషీ. మన సమాజం ఆమెను ప్రశంసించక పోగా.. తీవ్రంగా విమర్శించింది. వివక్షకు గురైనా వెరవక వైద్యసేవలందించింది. దురదృష్టం.. పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది.
→ డాక్టర్ కాదంబినీ గంగూలీ
మన దేశ తొలి మహిళావైద్యుల్లో మరో డాక్టర్.. కాదంబినీ గంగూలీ. యూరప్‌లో శిక్షణ పొందిన ఆమె మెడికల్ కెరీర్ అంతా దేశంలోని మహిళల ఆరోగ్యం, మాతా.. శిశు మరణాలను అరికట్టే ప్రయత్నానికే అంకితమైంది.
→ ఇంకా.. ∙మేరీ పూనెన్ ల్యుకోస్
మన తొలి మహిళా గైనకాలజిస్ట్ మేరీ పూనెన్ లుకోస్, దేశంలో క్యాన్సర్ రీసెర్చ్ సాగడానికి శ్రమించిన కమల్ రణదివే.. వీళ్లంతా స్వాతంత్య్రానికి పూర్వమే తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. స్త్రీ సాధికారతకు చిహ్నంగా నిలిచారు.
వీళ్ల స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం.. దేశంలో క్యాన్సర్ చికిత్సలో సమర్థమైన మార్పులకై కృషి చేసిన డాక్టర్ వి.శాంత, రేడియాలజిస్ట్ డా. కె.ఎ.దిన్షా, కార్డియాలజిస్ట్ డా.పద్మావతి అయ్యర్, డా. నీలమ్ క్లేర్, డా. అజితాచక్రవర్తి, డా. శశి వాధ్వా, డా. కామినీ రావు, డా. ఇందిరా హిందుజా లాంటివాళ్లెందరో వారి వారి విభాగాల్లో రాణించారు. మహిళలకు ఆరోగ్యం పట్ల స్పృహ కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ పాజిటివ్ నోట్ చూస్తుంటే వైద్యరంగంలో మన మహిళలు ఎంతో ముందుకెళ్లారనే భావన కలుగుతుంది. కానీ అధ్యయనం (2021 ప్రకారం) చేసి లెక్కలు తీస్తే ఆ సంఖ్య 29 శాతమే అని తేలింది. బోర్డ్ మెంబర్స్‌గా ఉన్నది 17 శాతమే. నర్సింగ్‌సేవల్లో మహిళల సంఖ్య 80 శాతం. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌లో 54 శాతం ప్రైవేట్ వైద్యరంగానిదే వాటా! అందులో కూడా నాయకత్వ హోదాల్లో ఉన్న మహిళల సంఖ్య 30 శాతానికి మించిలేదు.
అంతర్జాతీయ స్థాయిలో..
హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఆంట్రప్రెన్యూర్స్ గా రాణిస్తున్న అను ఆచార్య, కిరణ్ మజుందార్ షా, మీనా గణేశ్, డాక్టర్ నందితా షా, నాన్కీ లఖ్విందర్‌సింగ్, నటాషా పూనావాలా, సునీతా మహేశ్వరి, సమీనా హమీద్, సౌమ్య స్వామినాథన్, డాక్టర్ వి. శాంత సహా తెలుగు వనితలు సంగీతారెడ్డి, శోభనా కామినేని, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి లాంటి వాళ్లెందరి పేర్లో వినిపిస్తాయి. వీళ్లంతా తమ రంగాలలో తమ ముద్రను చూపించుకుంటున్నారు.
ప్రమాదం అంచున... జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన శారీరక హింసకు గురవుతున్నారు. ఇది హెల్త్‌కేర్ సెక్టార్‌లోకీ విస్తరించి మహిళావైద్యులు, నర్సుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది. దీనికి ఉదాహరణ ఇటీవలి కోల్‌కతా కేజీ కర్ ఆసుపత్రి పీజీ స్టూడెంట్ హత్యాచారమే! ఈ దారుణాలకు కారణం ఆయా విభాగాల్లో నాయకత్వ హోదాలో మహిళల సంఖ్య కనీసం 30 శాతం కూడా లేకపోవడమే. పైస్థాయిలో ఎక్కువమంది మహిళలున్న చోట పనిప్రదేశం భద్రంగా ఉంటుంది. భరోసా పెరుగుతుంది. మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుంది.
ముంబై.. దిక్సూచీ... ఈ విషయంలో ‘దిలాసా క్రైసిస్ సెంటర్’ను ఏర్పాటు ద్వారాదేశానికి మార్గదర్శిగా నిలిచింది ముంబై! ఇది మహిళల మీద హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది, దాన్నెలా గుర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా సహాయం పొందాలి, ఎలా సహాయం అందించాలి వంటి వాటి మీద ఆసుపత్రుల్లోని సిబ్బందికి శిక్షణనిచ్చింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణ, అవగాహనలో వైద్యరంగంలోని మహిళలదే కీలకపాత్ర. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం వీరి ప్రాతినిధ్యం శూన్యం. అది గ్రహించి ఇటు ప్రభుత్వ రంగం, అటు ప్రైవేట్ రంగం మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచి, వచ్చే మహిళా దినోత్సవానికల్లా వైద్యరంగంలో మహిళల విజయగా«థను చెప్పుకునే అవకాశాన్నిస్తాయని ఆశిద్దాం!
మహిళలతోనే భరోసా
నేను మహిళా బాస్‌ల కిందే పనిచేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా వారితో షేర్ చేసుకుంటాను. వెంటనే స్పందిస్తారు. నేను కూడా నా కింది ఉద్యోగుల విషయంలో అలాగే ఉంటాను. మన బాసులుగా కానీ, కొలీగ్స్‌గా కానీ మహిళలే ఉంటే ఇలాంటి భరోసా వస్తుంది. అయితే అవకాశాలను వెదుక్కుంటేనే మహిళా శక్తి పెరుగుతుంది. ఆ బలం పెరిగితే ఆటోమేటిగ్గా పని ప్రదేశం విమెన్ ఫ్రెండ్లీగా మారుతుంది.
– డాక్టర్ మౌనిక నేలపట్ల
అసిస్టెంట్‌ప్రొఫెసర్, జనరల్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, కామారెడ్డి
మేము వారధులం
ఒక రకంగా మేము ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలాంటి వాళ్లం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వారి ఆరోగ్యసంరక్షణలో మా పాత్ర ముఖ్యమైనది. వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండాలి కాబట్టి.. భద్రత, రక్షణ వంటి వాటిలో ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అవమానాలూ ఎదురవుతుంటాయి.
– జంగం రమాదేవి, ఆశ వర్కర్,పాల్వంచ, కామారెడ్డి జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment