Women doctors
-
మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
మహిళల కోసం... మహిళల చేత!
ఆ హాస్పిటల్లో మహిళలే డాక్టర్లు. వార్డ్ బాయ్ అనే పదం వినిపించదు. అన్ని సర్వీస్‌లూ మహిళలే అందిస్తారు. నైట్ షిఫ్ట్ అని వెనుకడుగు వేయడం ఉండదు. ఇరవై నాలుగ్గంటలూ మహిళలే పని చేస్తారు. ఎమ్ఎమ్సీహెచ్... అంటే ముస్లిమ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది హైదరాబాద్, చాదర్‌ఘాట్, ఉస్మాన్ పురాలో ఉంది. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉంది. మహిళల కోసం యాభై మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో సీఈవో నుంచి సెక్యూరిటీ స్టాఫ్ వరకూ అందరూ మహిళలే. నో ప్రాఫిట్ నో లాస్ విధానంలో పని చేస్తున్న ఈ హాస్పిటల్ గురించి సీఈవో డాక్టర్ నీలోఫర్ ఇలా వివరించారు. ► మూడు వందలకు పైగా... ‘‘మహిళా సాధికారతకు చిహ్నం మా హాస్పిటల్. ఇది 200 పడకల హాస్పిటల్. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా మహిళలందరికీ వైద్యసేవలందిస్తాం. విశేషం ఏమిటంటే... మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో మూడు వందల మందికి పైగా మహిళలం సేవలందిస్తున్నాం. ప్రధాన ద్వారం సెక్యూరిటీ నుంచి రిసెప్షన్, ఫార్మసీ, ఫార్మసీ స్టోర్స్ నిర్వహణ, ల్యాబ్ టెక్నీషియన్ లు అందరూ మహిళలే. అంబులెన్స్ డ్రైవర్లు, వెనుక ద్వారం దగ్గర సెక్యూరిటీ దగ్గర మాత్రం మగవాళ్లు డ్యూటీ చేస్తారు. ‘ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ’ నగరంలో స్థాపించిన మూడు స్కూళ్లు, మూడు హాస్పిటళ్లలో ఇది ఒకటి. మహిళల హాస్పిటల్‌గా పేరు వచ్చినప్పటికీ నిజానికి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో చిన్నపిల్లల విభాగం, డర్మటాలజీ, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా పని చేస్తున్నాయి. రోజుకు ఓపీ రెండు వందల వరకు ఉంటుంది. అందులో నూట పాతిక వరకు మహిళలే ఉంటారు. నెలకు సరాసరిన రెండు వందల డెలివరీలుంటాయి. ► ట్వంటీ ఫోర్ బై సెవెన్ ! సెక్యూరిటీ, ఫార్మసీ, రిసెప్షన్ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటాయి. వారంలో ఏడు రోజులూ, రోజులో ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీలో ఉంటారు మహిళలు. మీకో సంగతి తెలుసా? మా హాస్పిటల్లో డే కేర్ సెంటర్ ఉంది. మహిళకు తగిన సౌకర్యాలు కల్పిస్తే ఏ షిఫ్ట్‌లోనైనా డ్యూటీ చేయగలరని నిరూపిస్తోంది మా హాస్పిటల్. ఇది టీచింగ్ హాస్పిటల్. వరంగల్, కెఎన్ ఆర్ యూనివర్సిటీలతో అనుసంధానమై ఉంది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ నుంచి ఏటా ముపై ్పమందికి మహిళలకు అవకాశం ఉంటుంది. హాస్టల్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది. మా హాస్పిటల్లో కెఫెటేరియాతోపాటు లైబ్రరీ కూడా ఉంది చూడండి. వైద్యరంగంలో అమూల్యమైన పుస్తకాల కలెక్షన్ ఉంది. బయటకు ఇవ్వం, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ► వైద్యపరీక్షలిక్కడే! మా దగ్గర పూర్తి స్థాయి ల్యాబ్ ఉంది. 98శాతం టెస్ట్‌లు ఇక్కడే చేస్తాం. కొన్ని ప్రత్యేకమైన కేసులకు మాత్రం శాంపుల్స్ ముంబయికి పంపిస్తాం. ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సోనాలజిస్ట్లతోపాటు రేడియాలజిస్ట్ కూడా మహిళే. రేడియాలజీ లో మహిళలు తక్కువగా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో రేడియాలజిస్ట్ కూడా కొంత రేడియేషన్ ప్రభావానికి గురవుతుంటారు. కాబట్టి మహిళలు తాము గర్భిణులుగా ఉన్నప్పుడు డ్యూటీ చేయడం కష్టం. అందుకే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కొంచెం సంశయిస్తారు. అలాంటిది మా దగ్గర రేడియాలజిస్ట్‌గా కూడా మహిళే డ్యూటీ చేస్తున్నారు. ► నార్మల్ డెలివరీల రికార్డ్! ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన మా హాస్పిటల్ లో మొత్తం డాక్టర్లు పాతిక మంది, మెటర్నిటీ విభాగంలో ఇద్దరు హెచ్వోడీలతోపాటు పన్నెండు మంది డాక్టర్లు, దాదాపు వందమంది నర్సింగ్ స్టాఫ్, ఎనభైకి పైగా హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. పేట్ల బురుజులో ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తర్వాత అత్యధికంగా ప్రసవాలు జరిగేది మా హాస్పిటల్లోనే. గత ఏడాదికి గాను అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన హాస్పిటల్‌గా మా హాస్పిటల్‌కి ప్రశంసలు కూడా వచ్చాయి. మగడాక్టర్లు నియోనేటల్ విభాగంలో మాత్రం ఉన్నారు. ప్రధాన ద్వారం నుంచి కారిడార్‌తోపాటు ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీటీవీ నిఘాలో ఉంటాయి. ఐసీయూ బెడ్ పట్టే స్థాయి లిఫ్ట్ కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ ఇది చారిటీ హాస్పిటల్ కావడంతో మా దగ్గర ఫీజులు చాలా చాలా తక్కువ. ఓ యాభై ఐదేళ్ల కిందట ఒక మహిళ మగ డాక్టర్ దగ్గర ప్రసవం చేయించుకోవడానికి ఇష్టపడక, ఆ సమయానికి లేడీ డాక్టర్ అందుబాటులో లేక చివరికి ఆ గర్భిణి మరణించిందట. ఆ సంఘటన తర్వాత మహిళల కోసం మహిళలే పని చేసే ఒక హాస్పిటల్ ఉండాలని భావించిన అబ్దుల్ రజాక్ లతీఫ్ ఈ హాస్పిటల్‌ను ప్రతిపాదించారు. యాభై మూడేళ్లుగా మహిళల కోసం మహిళలే ఇరవై నాలుగ్గంటలూ సేవలందిస్తున్నారు’’ అంటూ వివరించారు డాక్టర్ నీలోఫర్. 40 ఇంక్యుబేటర్లు, వార్మర్, ఫొటో థెరపీ సర్వీస్, పుట్టిన బిడ్డ వినికిడి పరీక్ష కోసం ఆడిటరీ టెస్ట్ సౌకర్యం కూడా ఉంది. మా హాస్పిటల్ నిర్మాణం ఎంత ముందు చూపుతో జరిగిందంటే... డెలివరీ రూమ్ నుంచే నియోనేటల్కు, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు కనెక్షన్ ఉంది. అవసరమైతే బిడ్డను ఆ విభాగానికి పంపించి తల్లిని ఈ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. ఇద్దరూ క్షేమంగా ఉంటే మామూలు వార్డుకి లేదా రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
డాక్టరమ్మలు మదర్స్ డే సెల్యూట్
కడుపులో దాచుకుంటుంది. కనురెప్పలా కాచుకుంటుంది. కష్టాన్ని ఓర్చుకోవడం నేర్పుతుంది. పోరాడే శక్తిని ఇస్తుంది. చీకట్లను సంహరించే వెలుగు ఖడ్గాన్ని చేతికి ఇస్తుంది. జయము నీదేనని అభయమిస్తుంది. జయించి వస్తే.. ‘భళి భళి భళి.. భళిరా భళి’ అని భుజం తడుతుంది. ఎవరు?! ఇంకెవరు? మాతృమూర్తి! తొమ్మిది నెలలు కడుపులో మోసే ఓరిమి ఎవరికి ఉంటుంది? అమ్మకే కదా. అమ్మలా.. మన డాక్టరమ్మలు కూడా గత పదిహేను నెలలుగా విరామం లేకుండా, అలసటను కనిపించనివ్వకుండా, మోముపై చిరునవ్వును మాయం అవనివ్వకుండా కరోనా రోగులను బిడ్డల్లా సంరక్షిస్తున్నారు. ‘మీకేం కాదు’ అని ధైర్యం చెబుతున్నారు. ‘మేమున్నాం’ అని పక్కనే కూర్చుంటున్నారు! ఊపిరి నిలిపి బతుకు దీపాలు వెలిగిస్తున్నారు. అందుకే ఈ మదర్స్‌డేకి ప్రతి డాక్టరమ్మకూ మనం చేతులెత్తి నమస్కరించాలి. ఆ ఫ్రంట్‌లైన్ వారియర్‌కి సెల్యూట్ చెయ్యాలి. హ్యాపీ మదర్స్ డే డాక్టరమ్మా! మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. కన్నూర్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు. ఒక్కొక్కరూ ఒక్కో విభాగంలో నిపుణులు. అయితే గత ఏడాదిన్నరగా ఆ ఆసుపత్రులలోని కరోనా విభాగాలకే తమ పూర్తి సేవలు అందిస్తున్నారు! మహాశక్తి మాతకు ఉన్నట్లుగా పదీ పన్నెండు చేతులు ఉంటే తప్ప సాధ్యం కాని వైద్యవిధుల్ని ఈ డాక్టరమ్మలు విశ్రాంతి అన్నదే లేకుండా ఉరుకులు పరుగుల మీద నిర్వహిస్తున్నారు. వీళ్లు చెప్పినట్లు కరోనా రోగులు బుద్ధిగా వింటున్నారు. అంటే.. కరోనా రోగులు వినిపించుకునేలా వీళ్లు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. రోగి విసుగును ప్రదర్శిం^è వచ్చు. కానీ వైద్యులు సహనాన్ని కోల్పోకూడదు. అంతేకాదు, ఔషధంగా కాస్త ఆత్మీయమైన పలకరింపునూ పంచాలి. సాధ్యం అయ్యేదేనా ఇంత ఒత్తిడిలో! సాధ్యం చేశారు ఈ ఆరుగురు మహిళా వైద్యులు. అందుకే వీరి చేత ‘నేషనల్ హెల్త్ మిషన్’, కేరళ వైద్య శాఖ కలిసి ప్రజలకు ధైర్యమిచ్చే, ప్రజల్లో చైతన్యం కలిగించే వీడియోను రూపొందించాయి! ఆ వీడియో గత సోమవారం నెట్లోకి అప్లోడ్ అయింది. వైరస్‌పై విజయం సాధించడానికి ఈ మహిళా డాక్టర్లు ఇచ్చిన ‘నృత్య సందేశం’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాదు, ఆలోచన కలిగిస్తోంది. అప్రమత్తతను నేర్పుతోంది. ∙∙ రోగుల మన్ననలను పొందుతున్న ఈ ఆరుగురు మహిళా డాక్టర్ల ప్రస్తావన సమీక్షా సమావేశాలలో వచ్చినప్పుడు వీరందరూ కూడా భారత సంప్రదాయ నృత్యాలలో అభినివేశం ఉన్నవారేనన్న ఒక ఆసక్తికరమైన సంగతి యాదృచ్చికంగా వైద్యాధికారుల దృష్టికి వచ్చింది! వైద్యం ప్రాణాల్ని కాపాడే సంజీవని. నృత్యం ప్రజల్ని ప్రభావితం చేసే కళ. వైద్యాన్ని, నృత్యాన్ని కలిపి ప్రజా ప్రయోజం కోసం ఏమైనా చేయొచ్చా అని యోచించారు. అప్పుడు వచ్చిన ఆలోచనే.. ఈ మహిళా డాక్టర్ల నృత్య రూపకం. మాస్కులు ధరించండి, దూరాన్ని పాటించండి, బాధ్యతగా మెలగండి అని రోజూ ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలనే మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. తమ నృత్యం ద్వారా నాలుగు నిముషాల సందేశంగా ప్రజల్లోకి పంపారు. హెల్త్ ఇన్స్పెక్టర్ సురేశ్ శ్రేష్ట పాట రాస్తే, ఆ పాటకు ప్రశాంత్ కృష్ణన్ అనే సంగీతకారుడు బాణీలు కట్టి, తనే నేపథ్యగానం అందించారు. ‘అలయ దిక్కున్న మహమారి..’ అనే మలయాళ పల్లవితో పాట మొదలవుతుంది. చరణాలకు అనుగుణంగా ఒక్కో డాక్టర్ ఫ్రేమ్ మీదకు వచ్చి నృత్యాభినయం చేస్తుంటారు. ‘కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్’కు అనుబంధంగా ‘జ్వాల’ అనే మహిళా విభాగం ఉంది. ఆ విభాగం ఆధ్వర్యంలోనే ఈ వీడియోకు రూపకల్పన జరిగింది. అయితే అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆరుగురు డాక్టర్స్‌కి ఒకేసారి షూటింగ్‌కి సమయం దొరికేది కాదు. వార్డునుంచి అరక్షణం బయట పడాలన్నా మెడికల్ స్టాఫ్‌కి వెయ్యి జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది. ‘‘మొత్తానికి పూర్తి చేశాం’అని నవ్వుతూ అంటున్నారు డాక్టర్ మృదుల. ఆమె పిల్లల వైద్య నిపుణురాలు. పిల్లల కోసం అమ్మ ఎన్ని చేతుల్ని తగిలించుకుంటుందో ఈ మహిళా వైద్యులు కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు అన్ని విధాలా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే వీళ్లు వట్టి డాక్టర్లు కాదు. డాక్టరమ్మలు. -
ఆ విషయంలో భారత్‌దే తొలి స్థానం
ఇదివరకటి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి నామమాత్రంగా ఉండేది గాని, ఇటీవలి కాలంలో ఈ రంగాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో సైతం మహిళలు రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విద్యాభ్యాసంలో భారత మహిళలు ప్రపంచంలోనే ముందంజలో ఉంటున్నారు. అయితే, ఈ రంగాల్లో ఉపాధి పొందడంలో మాత్రం కొంత వెనుకబడి ఉండటమే నిరాశ కలిగిస్తోంది. అయినా, అడుగడుగునా ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమిస్తూ మన దేశానికి కొందరు మహిళలు శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ యువతరానికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశంలోని మహిళల స్థితిగతులు, ఈ రంగాల్లో రాణిస్తున్న కొందరు మహిళల గురించి తెలుసుకుందాం... శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న వారిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు గల దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టభద్రులవుతున్న మహిళలకు ఉపాధి కల్పించడంలో మాత్రం 19వ స్థానంలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మన దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) రంగాలలో సుమారు 2.80 లక్షల మంది శాస్త్రవేత్తలు ఉండగా, వీరిలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు. ఈ రంగాల్లో పట్టాలు తీసుకుంటున్న మహిళలు పరిశోధనలకు దూరమవుతున్నారు. ఇది భారత్ ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్తా చాటుకోవడానికి మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా, వాటిని అధిగమించి తమ ప్రతిభ నిరూపించుకుంటున్న మహిళలూ ఉంటున్నారు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన కొందరు నవతరం మహిళా శాస్త్రవేత్తల సంక్షిప్త పరిచయం... మురికివాడ నుంచి పరిశోధనల వైపు: షాలినీ ఆర్య ముంబై మురికివాడలో పుట్టి పెరిగిన షాలినీ ఆర్య ఆహార శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలోని ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సామాన్యులు చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటకాల్లో పోషకాలను మరింత పెంచడమే కాకుండా, అవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉపకరించే సాంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులను సామాన్యులకు మరింత చేరువ చేసే దిశగా ఆమె తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఆహార పదార్థాల్లో పోషకాల పెంపుదల, ఆహార పదార్థాలను ఎక్కువగా నిల్వచేసే సాంకేతిక పద్ధతులపై ఆమె రాసిన పరిశోధన వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె శాస్త్రవేత్తగా ఎదిగిన తీరు శాస్త్ర సాంకేతిక విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. షాలినీ తండ్రి రోజు కూలి. ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండేవారు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి షాలినికి ఐదేళ్ల వయసు వచ్చినా బడిలో చేర్చకుండా, ఆమె తమ్ముడిని బడిలో చేర్చాడు. తమ్ముడు రోజూ బడికి వెళుతుంటే తనకూ బడికి వెళ్లాలని ఉండేది. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమ్ముడి వెనకే అనుసరిస్తూ బడికి చేరుకుంది. పాఠాలు వినాలనే ఆశతో తమ్ముడి తరగతి గదిలో టీచర్ టేబుల్ కింద నక్కింది. టీచర్ ఆమెను గమనించి, ఆమె తండ్రికి కబురు చేసింది. షాలినీని కూడా బడిలో చేర్చమని చెప్పింది. టీచర్ మాటపై షాలినీని బడిలో చేర్పించాడు. బడిలో చేరినా, షాలినీకి ఇంటి పనులు ఎప్పటి మాదిరిగానే ఉండేవి. ఇంటిల్లిపాదికీ వంట చేయడం ఆమె డ్యూటీనే. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక చదువుకునేది. హైస్కూలు చదువు పూర్తయ్యాక ఇంజినీరింగ్ చదవాలనుకుంది. ఇంజినీరింగ్ మగపిల్లల కోర్సు, అది చదవొద్దన్నాడు తండ్రి. చివరకు తండ్రి ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేర్పించడానికి ఒప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చేస్తుండటంతో తనకు వంటావార్పు అంటేనే విసుగుపుట్టిందని, అయిష్టంగానే ఫుడ్ టెక్నాలజీలో చేరానని, అయితే, ఇందులో చేరిన తర్వాత త్వరలోనే తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, పూర్తిగా పరిశోధనల వైపు దృష్టి పెట్టానని చెబుతారు షాలినీ. బాల్యంలో పోషకాహార లోపంతో బాధపడిన తాను ఆహార శాస్త్రవేత్తను కాగలిగానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తోందని అంటారామె. ఫుడ్ టెక్నాలజీ రంగంలో షాలినీ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ నుంచి ‘మలాస్పినా స్కాలర్స్ అవార్డు’, భారత్‌లోని అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ నుంచి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్నారు. రాయల్ సొసైటీలో దక్కిన చోటు: డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ రెండేళ్ల కిందట ఈ అరుదైన రికార్డు సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఇంటస్టైనల్ విభాగం ప్రొఫసర్‌గా, వైరాలజీ నిపుణురాలిగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఆమె సాగించిన పరిశోధనలకు జాతీయంగా, అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు లభించింది. డయేరియా, రోటావైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె విశేషమైన కృషి చేశారు. రోటావైరస్ వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడంతో పాటు నోటి ద్వారా తీసుకునే పలు రకాల వ్యాక్సిన్ల పనితీరును మెరుగుపరచడంలో సత్ఫలితాలను సాధించి, ‘ఇండియాస్ వ్యాక్సిన్ గ్రాండ్‌మదర్’గా గుర్తింపు పొందారు. ప్రజారోగ్యం, వైరాలజీ, ఇమ్యూన్ రెస్పాన్స్ తదితర అంశాలపై ఆమె దాదాపు మూడువందలకు పైగా పరిశోధన వ్యాసాలను రాశారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో అవి ప్రచురితమయ్యాయి. గగన్‌దీప్ కాంగ్ సిమ్లాలో పుట్టారు. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి రైల్వేలో మెకానికల్ ఇంజినీర్. ఉద్యోగరీత్యా తండ్రికి తరచు బదిలీలు అవుతుండటంతో ఆమె చదువు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. చిన్న వయసు నుంచే ఆమెకు సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి ఉండేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి ఇంట్లోనే చిన్నసైజు లాబొరేటరీని ఏర్పాటు చేశారు. పన్నెండేళ్ల వయసులోనే ఆమె ఇంట్లోని ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంటర్ తర్వాత వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, మైక్రోబయాలజీలో ఎండీ, పీహెచ్డీ పూర్తి చేశారు. వైద్య పరిశోధనల్లో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ పీఎన్ బెర్రీ ఫెలోషిప్, ఇన్ఫోసిస్ ప్రైజ్ సహా పలు అవార్డులు, సత్కారాలు దక్కాయి. కట్టుబాట్లను దాటి కోడింగ్ ప్రపంచంలోకి: కోమల్ మంగ్తానీ కోమల్ మంగ్తానీ కోడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ‘ఊబెర్’ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కోమల్ గుజరాత్‌లోని సూరత్‌లో కట్టుబాట్లతో నడుచుకునే సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. వారి కుటుంబాల్లో మగపిల్లలే ఉన్నత చదువులకు వెళ్లరు. ఇక ఆడపిల్లల పరిస్థితి వేరే చెప్పేదేముంది? అయితే, కోమల్ తల్లిదండ్రులు కూతురి కోసం తమ సామాజికవర్గం నుంచి ఎదురైన విమర్శలకు వెరవకుండా ఆమెను ఉన్నత చదువులు చదివించారు. సూరత్‌లోని ధరమ్సిన్హ్ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కోమల్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరారు. కొన్నాళ్లకు మంచి అవకాశాలు రావడంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఒరాకిల్, వీఎం వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆరేళ్ల కిందట క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ ‘ఊబెర్’లో చేరారు. ఆ సంస్థ కోసం ‘ఊబెర్ ఈట్స్’, ‘ఊబెర్ రైడ్స్’, ‘ఊబెర్ ఫ్రైట్’, ‘జంప్ బైక్స్’ వంటి బిజినెస్ యాప్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోడింగ్ పరిజ్ఞానంలో మహిళలను, బాలికలను ప్రోత్సహించేందుకు ‘విమెన్ హూ కోడ్’, ‘గర్ల్స్ హూ కోడ్’ వంటి కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక మహిళలకు, బాలికలకు కోడింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళ: అదితి సేన్ దే అదితి సేన్ దే దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. భౌతికశాస్త్రంలో ఆమె పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఆమె అలహాబాద్‌లోని హరీశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీలో ఆమె విశేషమైన కృషి కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన అదితి చిన్ననాటి నుంచే సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి స్కూల్ టీచర్, తండ్రి పశ్చిమబెంగాల్ రాష్ట ప్రభుత్వోద్యోగి. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని బెథూనే కాలేజీ నుంచి మ్యాథమేటిక్స్ ఆనర్స్‌తో బీఎస్సీ పూర్తి చేసిన అదితి, తర్వాత అదే యూనివర్సిటీ పరిధిలోని రాజాబజార్ సైన్స్ కాలేజీ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ చదువుకుంటుండగానే క్వాంటమ్, స్టాటిస్టికల్ ఫిజిక్స్‌పై పరిశోధనలు ప్రారంభించారు. భారత్‌లో కొన్నాళ్లు పరిశోధనలు కొనసాగించాక, పోలండ్‌లోని దాంజిగ్ వర్సిటీలో అవకాశం దొరకడంతో, అక్కడ చేరి పీహెచ్డీ పూర్తి చేశారు. తర్వాత జర్మనీలోని లీబ్నిజ్ యూనివర్సిటీలో కొంతకాలం, ఆ తర్వాత స్పెయిన్‌లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటానిక్ సైన్స్‌లో కొంతకాలం రీసెర్చ్ ఫెలోగా పరిశోధనలు సాగించారు. భారత్ తిరిగి చేరుకున్నాక ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కోరిలేషన్స్ అంశాల్లో అదితి చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు లభించింది. సమాచార సాంకేతికతకు కొత్త పుంతలు: సునీతా సరావాగీ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తనవంతు పాత్ర పోషించిన శాస్త్రవేత్త సునీతా సరావాగీ. ప్రస్తుతం ఆమె ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోని సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా లెర్నింగ్‌లో ఇన్స్టిట్యూట్ చైర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దిశానిర్దేశం చేసిన కొద్దిమంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సునీతా సరావాగీ డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్ట్స్రాక్షన్ టెక్నిక్స్‌కు రూపకల్పన చేసిన తొలితరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ డేటాలోకి చేరిన పేర్లు, అడ్రస్‌ల డూప్లికేషన్‌ను తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సునీతా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. డేటాబేస్ మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కీలకమైన మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలపై సునీతా సాగిస్తున్న పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆమె ‘గూగుల్ రీసెర్చ్’కు విజిటింగ్ సైంటిస్ట్‌గా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో సాగించిన పరిశోధనలకు గుర్తింపుగా ఆమెకు ‘ఇన్ఫోసిస్’ పురస్కారం సహా పలు అవార్డులు, బహుమానాలు దక్కాయి. బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న వైద్యురాలు: డాక్టర్ రోహిణీరావు చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో అత్యంత పిన్నవయస్కురాలైన వైద్యురాలు డాక్టర్ రోహిణీరావు. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఆమె వృత్తిగా ఎంచుకున్న వైద్యరంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమే కాదు, తనకు గల రకరకాల అభిరుచుల కోసం కూడా ఆమె సమయం కేటాయిస్తారు. బోట్ సెయిలింగ్, భరతనాట్యం, రంగస్థల నటన, గుర్రపుస్వారీలోనే కాకుండా ‘భైరవముష్టి’ అనే ఒకరకమైన సంప్రదాయ యుద్ధక్రీడలో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ నైపుణ్యమే ఉంది. చెన్నైలోని చెంగల్పట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువు సాగిస్తూనే సెయిలింగ్‌లో ఏడు చాంపియన్ షిప్‌లు సాధించారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక కావేరీ హాస్పిటల్లో ఇంటర్న్‌గా చేరారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ రావడంతో అక్కడ ఎమ్మెస్సీ ఇంటర్నల్ మెడిసిన్ కోర్సులో చేరారు. అక్కడ చదువు పూర్తయ్యాక తిరిగి కావేరీ హాస్పిటల్లో చేరి, కిడ్నీ సమస్యలపై డాక్టరేట్ చేశారు. రోగులకు ఉల్లాసం కలిగించేందుకు ఆమె ‘మెడికల్ క్లౌనింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించారు. నవ్వుతో చాలా సమస్యలు దూరమవుతాయని, రోగులను నవ్వించగలిగితే వారు త్వరగా కోలుకుంటారని రోహిణి చెబుతారు. మెడికల్ క్లౌనింగ్ నిపుణురాలిగా ఆమె అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. మారుమూల ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తూ, అక్కడి వైద్యసేవలు మెరుగుపరచేందుకు కూడా ఆమె తన కృషిని కొనసాగిస్తున్నారు. -
తల్లి లేకుండానే ఈ లోకంలోకి వచ్చారా?
అన్నిరంగాల్లో మహిళలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిబంధకాలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అతివలు వడివడిగా ముందుకు సాగుతున్నారు. అయితే ప్రగతి పథాన పరుగిడుతున్న పడతులకు ప్రతిచోటా ప్రోత్సహించే పరిస్థితులు కనబడటం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో జీర్ణించుకుపోయిన పురుషాంహకారం మహిళలకు ఆటంకాలు సృష్టిస్తుండటం నేటికీ ఆగలేదు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సు చివరి రోజు ప్రేరణాత్మక ప్రసంగం చేసేందుకు వచ్చిన మోటివేషనల్ గురు స్వామి జ్ఞానవాత్సల్య చిటపటలాడుతూ వెళ్లిపోయారు. ఆయనగారి అసహనానికి కారణం మహిళామణులు. స్వాములోరు అక్కడకు రావడమే ఒక షరతు మీద వచ్చారు. ఆయన పెట్టిన నిబంధనకు నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు గురించి తెలియక తరుణీమణులంతా ‘ముందుకు’ రావడంతో ఆగ్రహించిన ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్–సర్వీసెస్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏఆర్‌ఐఎస్‌డీఏ) సంయుక్తంగా జూన్ 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు 26వ ‘రాజ్ మెడికాన్ 2019’ సదస్సును నిర్వహించాయి. నేటి సమాజంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపాలన్న లక్ష్యంతో జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఈ సదస్సును జరిపారు. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా స్వామి జ్ఞానవాత్సల్య ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రసంగించేందుకు ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన ఆయన.. ముందు వరుసలో మహిళలు కూర్చొని ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆడిటోరియంలోని ముందు వరుసల్లో మహిళలు కూర్చోవడానికి వీల్లేదని కార్యక్రమం ప్రారంభం కావడానికే ముందే నిర్వాహకులకు ఆయన హుకుం జారీచేశారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరగడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. ముందు ఏడు.. తర్వాత మూడు ‘‘స్వామి జ్ఞానవాత్సల్య ప్రేరణాత్మక మాటలు వినేందుకు చాలామంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చుకున్నారు. మహిళలు మొదటి ఏడు వరుసల్లో కూర్చోరాదని హఠాత్తుగా నిర్వాహకులు ప్రకటన చేశారు. మొదటి మూడు వదిలిపెట్టి నాలుగో వరుస నుంచి వనితలు కూర్చోవాలని తర్వాత మరోసారి ప్రకటించారు. ఈ గందరగోళం ఏంటని నిర్వాహకులను మహిళా వైద్యులు అడగ్గా.. ఇది స్వామి జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు అని సమాధానమిచ్చారు. ‘‘పోనీలే పెద్దాయన ప్రసంగం బాగా చేస్తాడు కదా అని ఆయన పెట్టిన నిబంధనకు అంగీకరించేందుకు మేమంతా సిద్ధమయ్యాం. డిమాండ్లు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రసంగం చేయకుండా జ్ఞానవాత్సల్య వెళ్లిపోయారు!’’ అని ఆయన నిర్వాకాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన డాక్టర్ రీతు చౌదరి వివరించారు. మహిళలు ముందు వరుసలో ఆసీనులయ్యారన్న అసహనంతోనే జ్ఞానవాత్సల్య ప్రసగించకుండానే వెనుదిరిగారని ఏఆర్‌ఐఎస్‌డీఏ ప్రతినిధి డాక్టర్ అజయ్ చౌదరి ధ్రువీకరించారు. మా జోలికి రాకండి స్వామి జ్ఞానవాత్సల్య పురుషాధిక్య వైఖరిపై మహిళా వైద్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాము ముందు కూర్చున్నామన్న ఒకే ఒక్క కారణంతో ఆయన వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. అందరికీ సుద్దులు బోధించే స్వామిజీలు కూడా ఆడవాళ్లను చులకనగా చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని నిరసించారు. ‘‘మహిళలపై వివక్షను ఒప్పుకోబోము’’ అన్నారు అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, లిబరేషన్ మాస పత్రిక సంపాదకురాలు కవితా కృష్ణన్. ‘‘స్త్రీలను ద్వేషించే ఇటువంటి ఆజ్ఞలు సైన్స్, మెడికల్ రంగంలోనే కాదు ఎక్కడా అనుమతించం. తాము 19వ శతాబ్దంలోనే ఉన్నట్టే ఉంటామని ఎవరైనా అంటే అటువంటి వారిని అలాగే ఉండిపొమ్మంటాం. కానీ మహిళలను ఇందులోకి లాక్కండి. వివక్షకు గురిచేసే ఆదిమ కాలం నాటి భావజాలాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక వనితలు ఉండరు. వైద్య, సాంకేతిక రంగాలకే కాదు అన్నిటికీ ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి’’ అని కవితా కృష్ణన్ గళమెత్తారు. వివక్ష తగునా..? స్వామి జ్ఞానవాత్సల్య వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను వివక్షకు గురిచేయకుండా స్వామికి సెల్ఫ్ మోటివేషన్ అవసరమని, చేసుకోవాలని చురకలు అంటించారు. ఇటువంటి వారు చెప్పే ప్రబోధాలను బహిష్కరించాల్సిన అవసరముందన్నారు. విద్యాధికులైన డాక్టర్లే ఇటువంటి వివక్షను ఎదిరించకపోతే వారి కంటే నిరక్షరాస్యులే నయమనిపిస్తారని నినదించారు. ఇలాంటి స్వాములు చెప్పే హితవచనాల కన్నా తాము చేసే సేవలే అమూల్యమైనవని డాక్టర్లు గుర్తించాలని సూచించారు. ఇరుకు మనస్తత్వం కలిగిన ఇలాంటి స్వాములు మహిళలకు జీవనగమ్యాలను నిర్దేశిస్తామనడం గర్హనీయమని కుండబద్దలు కొట్టారు. ‘తల్లి లేకుండానే ఆయన ఈ లోకంలోకి వచ్చారా?’ అని ట్విటర్లో ఓ మహిళ ఘాటుగా ప్రశ్నించారు. స్త్రీల పట్ల వివక్ష భావన కలిగిన ఇటువంటి వ్యక్తిని వైద్యులు తమ సదస్సుకు ఆహ్వానించకుండా ఉంటే బాగుండేదని మరొకరు అభిప్రాయపడ్డారు.ఈ మొత్తం వ్యవహారంపై స్వామి జ్ఞానవాత్సల్య ఇప్పటివరకు స్పందించలేదు. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
వితంతు వైద్యురాళ్లే టార్గెట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాను అభ్యుదయవాదిని వితంతు వైద్యురాళ్లకి జీవితాన్ని ఇస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయలు మోసం చేసిన యువకుడిని తిరువణ్ణామలై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తిరువణ్ణామలైకు చెందిన చక్రవర్తి అనే యువకుడు మ్యాట్రిమోనియంలలో తన పేరు అజయ్, విజయ్, విజయ్‌కుమార్, విదు, శరవణ్ ఇలా అనేక పేర్లతో నమోదు చేసుకున్నాడు. భర్తను కోల్పోయిన వైద్యురాళ్లనే లక్ష్యంగా చేసుకుని సంతానం ఉన్నా సరే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని నమ్మిస్తాడు. అతని వలలో పలువురు వైద్యురాళ్లుపడ్డారు. చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు అతడికి రూ. 50 లక్షలు అప్పగించింది. అలాగే, లాల్కుడికి చెందిన మరో వైద్యురాలు రూ. 20 లక్షలు ఇచ్చి తనూ మోసపోయింది. అయితే, అతను పెళ్లి చేసుకోకుండా మోసం చేయడంతో లాల్‌కుడి వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికవేధింపులు, మోసం, హత్యా బెదిరింపులు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
పేట ఆస్పత్రిలో అరాచకాలు
నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ కందల కృష్ణారెడ్డి అరాచకాలకు అంతేలేకుండో పోతోంది. ఏడాది క్రితం అభివృద్ధి కమిటీ పేరుతో పదవి తెచ్చుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆస్పత్రిలోనే తిష్టవేశారు. తనకు ప్రత్యేక గదిని కేటాయించుకుని అందరికన్నా పెద్ద కుర్చీయే ఉండాలంటూ అభివృద్ధి నిధులతో దర్జాగా ఆ గదిని అలంకరించుకున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రికి వచ్చే డిప్యూటీ సివిల్ సర్జన్ నుంచి వైద్యులు, సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బందితో సహా తన కనుసన్నల్లోనే ఉండాలంటూ ఆంక్షలు విధించారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధిత ఉద్యోగులపై మరింతగా అరాచకాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు పరిపాటిగా మారింది. నాయుడుపేట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కొత్తగా వచ్చిన మహిళా వైద్యులతో పాటు సిబ్బంది సైతం ఆస్పత్రిలో అడుగు పెడితే అభివృద్ధి కమిటీ చైర్మన్ గదికి వెళ్లి నమస్కారం చేసి విధులు నిర్వర్తించాలని కృష్ణారెడ్డి హుకుం జారీ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో టీవీటీ కంపెనీ సౌజన్యంతో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న క్లీనింగ్ సూపర్వైజర్ జువ్వలపాటి వజ్రమ్మతో పాటు మరో ఆరుగురు మహిళలు క్లీనింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వజ్రమ్మపై కొంతకాలంగా అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం తన భర్త జువ్వలపాటి హుస్సేన్‌కు సమాచారం ఇవ్వడంతో చైర్మన్‌ను ప్రశ్నించడంపై ఆస్పత్రి వద్ద సోమవారం వివాదం చోటు చేసుకుంది. మీ అంతు చూస్తానంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానంటూ చైర్మన్ బెదిరింపులకు దిగారు. తన భార్యపై లైంగిక వేధింపులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నిస్తుంటే అక్కడే ఉన్న ఓ రోగి ఎందుకిలా చేశారన్నందుకుగాను చైర్మన్ కృష్ణారెడ్డి అనుచరుడు ఆ వృద్ధుడి చెంప చెళ్లు మనిపించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ‘జిల్లా కలెక్టర్, మీడియాకు చెప్పుకుంటారా.. చెప్పుకోండి’ అంటూ రుబాబు చేశారు. అంతలోనే చుట్టుపక్కల ప్రాం తాల నుంచి బాధితులపై దాడి చేసేందుకు తన అనుచరులు గుమికూడటంతో భయాందోళనకు గురైన బాధితురాలు వజ్రమ్మ, భర్త హుస్సేన్, రజక వృత్తిదారుల సం ఘం రాష్ట్ర సభ్యుడు పుల్లూరు మనోరమ అక్కడి నుంచి తిన్నగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోమవారం ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు స్పందించక పో వడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మామ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి, సమీప బంధువులు జలదంకి మధుసూదన్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారి నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు బాధితులు తెలిపారు. అంతేకా కుండా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఈ కేసును రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేయకపోతే ఉద్యమం క్లీనింగ్ సూపర్వైజర్ జువ్వలపాటి వజ్రమ్మపై లైంగిక వేధింపులతో పాటు చాకలి కులానికి చెందినదానా అంటూ అసభ్యకరంగా మాట్లాడటం సాక్ష్యాలు చూపిస్తే మీకు ఉద్యోగం ఉండబోదంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న చైర్మన్ కృష్ణారెడ్డిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి 38 గంటలు అవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయక పోవడం విడ్డూరం. టీడీపీ నాయకులు ఈ కేసు మాఫీ చేసేందుకు బాధితులకు ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆ బెదిరింపులకు లొంగబోం. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే సీఎం చంద్రబాబును కలిసి అధికారపార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలపై ఎండగడతాం.–మన్నూరు భాస్కరయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేధింపులు తట్టుకోలేకే తిరుగుబాటు చేశా ఆస్పత్రిలో నేను బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నా. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేదలకు న్యాయం చేద్దామని ఆలోచించా. ప్రైవేటు ఉద్యోగమైనా, జీతం రూ.5 వేలైనా ఉద్యోగానికి న్యాయం చేద్దామని తోటి సిబ్బందితో నిస్పక్షపాతంగా పనిచేయించా. అందరు బాధ్యతగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. మూడు నెలల పాటు టీవీటీ కాంట్రాక్ట్ కంపెనీ నుంచే మాకు జీతాలు అందేవి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తన చేతుల మీదుగా జీతాలు పంపిణీ చేయకపోతే కంపెనీని తొలగిస్తామంటూ మాకు ఉద్యోగం అందించిన కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి ఆయన సమక్షంలోనే జీతాలు పంపిణీ జరిగేది. అప్పటి నుంచి మమ్మల్ని లైంగికంగా వేధిస్తూ మానసికంగా క్షోభకు గురిచేసేవాడు. గతంలో ఆయన ఒత్తిళ్లు తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం చేశా. అయినా ఆ రాక్షసుడు వేధింపులు అధికం చేశాడు. కుటుంబ సభ్యులకు చెప్పి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు.–జువ్వలపాటి వజ్రమ్మ, క్లీనింగ్ సూపర్వైజర్ -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే బ్యాచ్.. ఒకే బెంచ్
తండ్రి తను డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ముగ్గురు కుమార్తెలు ఒకేసారి డాక్టర్లు అయి ఆయన కలల్ని నెరవేర్చారు! ఇదొక అపూర్వమైన సందర్భం. కర్ణాటక, బళ్లారి నగరంలోని శ్రీరాంపురం కాలనీకి సమీపంలో.. విశ్వనాథపురం కాలనీలో నివాసం ఉంటున్న శంకర్.. స్థానిక ఆస్పత్రిలో నర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు శ్వేత, స్వాతి, శ్రుతి అని ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017లో ‘నీట్’లో ఈ ముగ్గురికీ ఒకేసారి ఎంబీబీఎస్ సీటు రావడం మాత్రమే కాదు, ముగ్గురూ బళ్లారిలోని ‘విమ్స్’ (విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీటు సంపాదించారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 2014లో పీయూసీ పూర్తి చేసిన శ్వేత అప్పట్లో అనారోగ్య కారణాలతో ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోలేక పోయింది. రెండవ అమ్మాయి స్వాతి 2015లో పీయూసీ పూర్తి చేసి ఏఐపీఎంటీ (ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్) పరీక్షలు రాసి ఎంబీబీఎస్‌కు ప్రయత్నించింది. అయితే ఆ ఏడాది ఇద్దరికీ సీటు రాలేదు. మూడవ కుమార్తె శ్రుతి 2017లో పీయూసీ పూర్తి చేయడంతో ఈసారి ముగ్గురూ కలిసి బెంగళూరులో 2016–17 విద్యాసంవత్సరంలో జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్షలు రాశారు. నీట్లో శ్వేత 1216, స్వాతి 1413, శ్రుతి 750వ ర్యాంకులను సాధించడంతో బళ్లారి విమ్స్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు ముగ్గురికీ ఒకేసారి సీటు లభించింది. సాధారణంగా టెన్త్‌లో లేదా పీయూసీలో.. అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు ఒకే తరగతి గదిలో కూర్చొని చదువుకోవడం చూస్తుంటాం. అయితే ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే బ్యాచ్‌లో సీటు లభించడంతో పాటు ఒకే కాలేజీ, ఒకే బెంచ్‌లో కూర్చునే అవకాశం లభించడం నిజంగా విశేషమే. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ముగ్గురూ ఒకేసారి ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకోవడం మరొక విశేషం. శ్వేత, స్వాతి, శ్రుతి రోజూ ఉదయం ఇంటి నుంచి క్యారియర్ కట్టించుకుని కాలేజీకి వెళుతుంటే.. చూడముచ్చటగా ఉంటుందని చుట్టపక్కల వాళ్లు, బంధువులు అంటున్నారు. – జి.నరసనగౌడ్, స్టాఫ్ రిపోర్టర్, బళ్లారి -
ఇక్కడ పనిచేయలేం!
మహిళా వైద్యులన్న గౌరవమే లేదు వీఆర్ఎస్ తీసుకున్న ప్రసూతి విభాగాధిపతి అదే బాటలో మరికొందరు వైద్యులు ఇదీ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి విజయవాడ (లబ్బీపేట) : వారంతా సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు. అలాంటివారిని నిత్యం వేధించడం, అమర్యాదకరంగా వ్యవహరించడం, మాట్లాడడం చేస్తుంటే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధుల తాలూకా అంటూ ఒకరు.. మంత్రి కార్యాలయం నుంచి అంటూ మరొకరు.. అభివృద్ధి కమిటీ పేరు చెప్పి ఇంకొకరు.. ఇలా ఎవరు పడితే వారు మహిళా డాక్టర్లకు ఫోన్లు చేసి ఏకవచనంతో మాట్లాడడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడంకన్నా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రసూతి విభాగాధిపతి వీఆర్ఎస్పై వెళ్లిపోగా, మరికొందరు వైద్యులు అదే బాటపడుతున్నారు. అభివృద్ధి కమిటీ పేరుతో దబాయింపు ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో వైద్య రంగంపై ఏమాత్రం అవగాహన లేని సభ్యులను నియమించడంతో వారితో వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక సభ్యుడు నిత్యం ఏదో ఒక విభాగానికి వె ళ్లడం ..నేనెవరో తెలుసా.. ఉద్యోగం చేయాలని లేదా? అంటూ వైద్యుల నుంచి నర్సింగ్., నాలుగో తరగతి సిబ్బంది వరకు బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. పురుషులకు ప్రవేశం లేని లేబర్ వార్డుకు సైతం వెళ్లి దబాయిస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. సౌకర్యాల గురించి పట్టించుకోరు ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల రక్తపరీక్షలు నేటికీ అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి రక్తపరీక్షలు చేయాలన్నా, స్కానింగ్ తీయాలన్నా బయటకు వెళ్లాల్సిందే. దీని గురించి ఒక్క నాయకుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రసూతి విభాగాన్ని ఆరు యూనిట్లు చేయాలని మొరపెట్టుకున్నా ఒక్క నాయకుడూ స్పందించలేదు. కేవలం 40 పడకలు కొనుగోలు చేసి చేతులు దులుపుకొన్నారు. వైద్యులు, సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారో నాయకులకే ఎరుక. అసలు వైద్యంపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించినప్పుడే ప్రభుత్వ తీరు అర్థమయిందని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేయడం కంటే రాజీనామా చేసి వెళ్లిపోవడమే మేలనే నిర్ణయానికి వైద్యులు వచ్చేసినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్దీ అదే పరిస్థితి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ డెరైక్టర్ హోదాలో ఉన్నవారు పనిచేస్తుంటారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ సూర్యకుమారికి సైతం అడ్మినిస్ట్రేషన్‌లో 25 ఏళ్ల అనుభవం ఉంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా యూరాలజిస్ట్. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పరిస్థితి కూడా అలాగే మారింది. ఒక దశలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆమె వెళితే ఆ సీట్లో కూర్చునేందుకు ఏ ఒక్కరూ సిద్ధపడే పరిస్థితి లేదు. మూడేళ్ల కిందట నెలలో ముగ్గురు సూపరింటెండెంట్లు మారిన చందంగా మళ్లీ ఆస్పత్రి పరిస్థితి తయారవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్లలో ఏ ఒక్కరూ ఆ సీట్లు కూర్చునేందుకు ఆసక్తి చూపడంలేదు. నిత్యం తిట్ల దండకం ‘నేనెవరో తెలుసా..ఏం మాట్లాడుతున్నావ్..ఉద్యోగం చేయాలని లేదా...’ అంటూ మహిళా వైద్యురాలు అని కూడా చూడకుండా ఫోన్లో బెదిరింపు ధోరణులు. ‘ఏమిటి.. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా..’ అంటూ తిట్లపురాణం..ఇలా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మహిళలతో పాలకులు ఏకవచనంతో మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. మంత్రిగారి పేషీ అంటూ ఒకరు.. ఎమ్మెల్యే తాలూకా అంటూ మరొకరు నిత్యం ఫోన్లు చేస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై వైద్యులు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇలాంటి వేధింపులు ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.