తల్లి లేకుండానే ఈ లోకంలోకి వచ్చారా? | Women Doctors Criticized Swamy Jnana Vathsalya | Sakshi
Sakshi News home page

ముందుకు రావొద్దా?

Published Tue, Jul 9 2019 12:07 PM | Last Updated on Tue, Jul 9 2019 2:28 PM

Women Doctors Criticized Swamy Jnana Vathsalya - Sakshi

అన్నిరంగాల్లో మహిళలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిబంధకాలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ సమాన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అతివలు వడివడిగా ముందుకు సాగుతున్నారు. అయితే ప్రగతి పథాన పరుగిడుతున్న పడతులకు ప్రతిచోటా ప్రోత్సహించే పరిస్థితులు కనబడటం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో జీర్ణించుకుపోయిన పురుషాంహకారం మహిళలకు ఆటంకాలు సృష్టిస్తుండటం నేటికీ ఆగలేదు. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది.

‘రాజ్‌ మెడికాన్‌ 2019’ సదస్సు చివరి రోజు ప్రేరణాత్మక ప్రసంగం చేసేందుకు వచ్చిన మోటివేషనల్‌ గురు స్వామి జ్ఞానవాత్సల్య చిటపటలాడుతూ వెళ్లిపోయారు. ఆయనగారి అసహనానికి కారణం మహిళామణులు. స్వాములోరు అక్కడకు రావడమే ఒక షరతు మీద వచ్చారు. ఆయన పెట్టిన నిబంధనకు నిర్వాహకులు కూడా ఒప్పుకున్నారు. జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు గురించి తెలియక తరుణీమణులంతా ‘ముందుకు’ రావడంతో ఆగ్రహించిన ఆయన అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), ఆల్‌ రాజస్థాన్‌ ఇన్‌–సర్వీసెస్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏఆర్‌ఐఎస్‌డీఏ) సంయుక్తంగా జూన్‌ 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు 26వ ‘రాజ్‌ మెడికాన్‌ 2019’ సదస్సును నిర్వహించాయి. నేటి సమాజంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దారి చూపాలన్న లక్ష్యంతో జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో ఈ సదస్సును  జరిపారు. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా స్వామి జ్ఞానవాత్సల్య ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రసంగించేందుకు ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన ఆయన.. ముందు వరుసలో మహిళలు కూర్చొని ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆడిటోరియంలోని ముందు వరుసల్లో మహిళలు కూర్చోవడానికి వీల్లేదని కార్యక్రమం ప్రారంభం కావడానికే ముందే  నిర్వాహకులకు ఆయన హుకుం జారీచేశారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరగడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.

ముందు ఏడు.. తర్వాత మూడు
‘‘స్వామి జ్ఞానవాత్సల్య ప్రేరణాత్మక మాటలు వినేందుకు చాలామంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చుకున్నారు. మహిళలు మొదటి ఏడు వరుసల్లో కూర్చోరాదని హఠాత్తుగా నిర్వాహకులు ప్రకటన చేశారు. మొదటి మూడు వదిలిపెట్టి నాలుగో వరుస నుంచి వనితలు కూర్చోవాలని తర్వాత మరోసారి ప్రకటించారు. ఈ గందరగోళం ఏంటని నిర్వాహకులను మహిళా వైద్యులు అడగ్గా.. ఇది స్వామి జ్ఞానవాత్సల్య పెట్టిన షరతు అని సమాధానమిచ్చారు. ‘‘పోనీలే పెద్దాయన ప్రసంగం బాగా చేస్తాడు కదా అని  ఆయన పెట్టిన నిబంధనకు అంగీకరించేందుకు మేమంతా సిద్ధమయ్యాం. డిమాండ్లు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రసంగం చేయకుండా జ్ఞానవాత్సల్య వెళ్లిపోయారు!’’ అని ఆయన నిర్వాకాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన డాక్టర్‌ రీతు చౌదరి వివరించారు. మహిళలు ముందు వరుసలో ఆసీనులయ్యారన్న అసహనంతోనే జ్ఞానవాత్సల్య ప్రసగించకుండానే వెనుదిరిగారని ఏఆర్‌ఐఎస్‌డీఏ ప్రతినిధి డాక్టర్‌ అజయ్‌ చౌదరి ధ్రువీకరించారు.

మా జోలికి రాకండి
స్వామి జ్ఞానవాత్సల్య పురుషాధిక్య వైఖరిపై మహిళా వైద్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాము ముందు కూర్చున్నామన్న ఒకే ఒక్క కారణంతో ఆయన వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. అందరికీ సుద్దులు బోధించే స్వామిజీలు కూడా ఆడవాళ్లను చులకనగా చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని నిరసించారు. ‘‘మహిళలపై వివక్షను ఒప్పుకోబోము’’ అన్నారు అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, లిబరేషన్‌ మాస పత్రిక సంపాదకురాలు కవితా కృష్ణన్‌. ‘‘స్త్రీలను ద్వేషించే ఇటువంటి ఆజ్ఞలు సైన్స్, మెడికల్‌ రంగంలోనే కాదు ఎక్కడా అనుమతించం. తాము 19వ శతాబ్దంలోనే ఉన్నట్టే ఉంటామని ఎవరైనా అంటే అటువంటి వారిని అలాగే ఉండిపొమ్మంటాం. కానీ మహిళలను ఇందులోకి లాక్కండి. వివక్షకు గురిచేసే ఆదిమ కాలం నాటి భావజాలాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక వనితలు ఉండరు. వైద్య, సాంకేతిక రంగాలకే కాదు అన్నిటికీ ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి’’ అని కవితా కృష్ణన్‌ గళమెత్తారు.

వివక్ష తగునా..?
స్వామి జ్ఞానవాత్సల్య వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను వివక్షకు గురిచేయకుండా స్వామికి సెల్ఫ్‌ మోటివేషన్‌ అవసరమని, చేసుకోవాలని చురకలు అంటించారు.  ఇటువంటి వారు చెప్పే ప్రబోధాలను బహిష్కరించాల్సిన అవసరముందన్నారు. విద్యాధికులైన డాక్టర్లే ఇటువంటి వివక్షను ఎదిరించకపోతే వారి కంటే నిరక్షరాస్యులే నయమనిపిస్తారని నినదించారు. ఇలాంటి స్వాములు చెప్పే హితవచనాల కన్నా తాము చేసే సేవలే అమూల్యమైనవని డాక్టర్లు గుర్తించాలని సూచించారు. ఇరుకు మనస్తత్వం కలిగిన ఇలాంటి స్వాములు మహిళలకు జీవనగమ్యాలను నిర్దేశిస్తామనడం గర్హనీయమని  కుండబద్దలు కొట్టారు. ‘తల్లి లేకుండానే ఆయన ఈ లోకంలోకి వచ్చారా?’ అని ట్విటర్‌లో ఓ మహిళ ఘాటుగా ప్రశ్నించారు. స్త్రీల పట్ల వివక్ష భావన కలిగిన ఇటువంటి వ్యక్తిని వైద్యులు తమ సదస్సుకు ఆహ్వానించకుండా  ఉంటే బాగుండేదని మరొకరు అభిప్రాయపడ్డారు.ఈ మొత్తం వ్యవహారంపై స్వామి జ్ఞానవాత్సల్య ఇప్పటివరకు స్పందించలేదు.

– పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement