కోల్‌కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం | IMA Says 24 Hour Hunger Strike To Support Bengal junior Doctors | Sakshi
Sakshi News home page

కోల్‌కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం

Published Sun, Oct 13 2024 8:47 PM | Last Updated on Sun, Oct 13 2024 9:30 PM

IMA Says 24 Hour Hunger Strike To Support Bengal junior Doctors

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.

మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్(జేడీఎన్‌), మెడికల్ స్టూడెంట్స్ నెట్‌వర్క్(ఎంఎస్‌ఎన్‌) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.

‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.

ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్‌వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్‌ యూనిట్‌.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్‌ కాలేజీ లేదా క్యాంపస్‌ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement