నిర్వహణలోనూ రాణిస్తాం | Womens in health leading the Health Sector | Sakshi
Sakshi News home page

నిర్వహణలోనూ రాణిస్తాం

Published Thu, Mar 6 2025 5:04 AM | Last Updated on Thu, Mar 6 2025 5:04 AM

Womens in health leading the Health Sector

వైద్యరంగ రథసారథులు

ఒకరు వైద్యశాస్త్రం చదివాక... తన సేవలకు ఆ పరిధి సరిపోదేమోనని సివిల్‌ సర్వీసెస్‌ రాసి... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హెల్త్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరొకరు ఓ పెద్ద హాస్పిటల్‌కు వైస్‌ ప్రసిడెంట్‌... ఇంకొకరు మరో పేరుమోసిన హాస్పిటల్‌కు సీవోవో... మరికొందరు హాస్పిటల్‌ డైరెక్టర్లు. వైద్యశాస్త్రం చదివి మహిళా వైద్యులుగా పేరు పొందినవాళ్లు చాలామందే ఉన్నారు. 

కానీ హాస్పిటల్‌ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్లుగా, ఆరోగ్యరంగ సారథులుగా ఉంటూ సారథ్యం వహిస్తున్న వారు కాస్త తక్కువే గానీ ఇప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా వైస్‌ ప్రెసిడెంట్లుగా, సీవోవోలుగా, కీలకమైన స్థానాల్లో ఉండి రాష్ట్రానికీ, హాస్పిటళ్లకూ దిశానిర్దేశం చేస్తూ... వాటిని ముందుండి నడిపిస్తూ ప్రధాన బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న మహిళా వైద్యుల స్ఫూర్తిమంతమైన మాటలివి.

పల్లెనాడి పట్టడానికి ఐఏఎస్‌గా...
నా మీద చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ప్రభావం ఎంతో ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, మిజోరా రాష్ట్రాల్లో అనేక శాఖల్లో పనిచేస్తూ సమాజానికి అంకితభావంతో సేవలందించిన మంచి ఉద్యోగి ఆయన. పల్లె ప్రాంతల్లో పనిచేసే సమయంలో మా నాన్న ఎదుర్కొన్న సవాళ్లూ, వాటిని ఆయన పరిష్కరించిన తీరు... ఇవన్నీ చూస్తూ పెరిగాను నేను. ఆయన అనుభవాలన్నీ అటు తర్వాత నాకెంతో ఉపకరించాయి. 

గ్రామీణప్రాంతాల్లో నాన్న ఎదుర్కొన్న సవాళ్లకు ఆరోగ్యసేవల ద్వారానే ఉత్తమమైన పరిష్కారం అందించవచ్చని అనిపించడంతో నేను ఎంబీబీఎస్‌ చేశా. నా ఇంటర్న్‌షిప్‌ సమయంలో మారుమూల పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు నేను కనుగొన్న కొన్ని లోపాలను మంచి పాలనతోనే అధిగమించవచ్చని నాకు అనిపించింది. దాంతో సివిల్‌ సర్వీసెస్‌ రాశా. అలా నేను డాక్టర్‌ నుంచి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌గా మారాను. 

ఎంత పెద్ద ప్రయాణమైనా... మొట్టమొదటి అడుగుతో మొదలవుతుందనే సూక్తిని నమ్మిన నేను ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించాక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అందునా వైద్యశాఖ ద్వారానే నా సేవలందిస్తున్నా. 
మన సమాజమే పితృస్వామ్య సమాజమైనప్పటికీ మహిళలు తమ సామర్థ్యాలు చూపుతూ చాలా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు.  ఒక్కోసారి తమ పురుష ప్రత్యర్థుల కంటే మహిళల సామర్థ్యాలే మెరుగ్గా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఒక్కోసారి మా నాన్నవాళ్ల తరం కంటే మా తరం బాగానే పురోగమిస్తోందనిపిస్తోంది. నిజానికి మా వైద్యశాఖలో పనిచేసే సిబ్బందిలో చాలామంది మహిళలే ఉన్నారు. 

సమాజంలో ఈ వివక్ష  ఉన్నప్పటికీ నా మట్టుకు నేను మంచి సామర్థ్యంతో,ప్రొఫెషనలిజమ్‌తో కష్టపడి పనిచేస్తే ఈ వివక్షనూ అధిమించవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను.  గత 24 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికంతటికీ నా సేవలందించేలా మనస్ఫుర్తిగా పనిచేయడం నాకు గుండెల నిండా ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. హెల్త్‌ సెక్రటరీగా రాష్ట్రంలోని అట్టడుగు, బడుగువర్గాల వారందరికీ మా ప్రభుత్వ సేవలందాలనేదే నా మొట్టమొదటి లక్ష్యం. మేము అమలు చేసిన కార్యక్రమాలతో మెరుగైన స్క్రీనింగ్‌ పరీక్షలూ, వైద్యపరీక్షలతో ఎన్నో  మాతృమరణాలూ, శిశుమరణాలూ... వీటన్నింటినీ గణనీయంగా తగ్గించగలిగాం. 

మారుమూల గిరిజన్ప్రాంతాల్లో వ్యాధినిర్ధారణ కేంద్రాలూ, ఐటీడీఏలకు అంబులెన్స్‌ సర్వీసులపై దృష్టి నిలిపాం. చిన్న పల్లెల్లో చదివే ప్రతిభావంతులైన పిల్లలకూ వైద్యవిద్య అందాలనే సదుద్దేశంతో ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలూ, 16 నర్సింగ్‌ కాలేజీలూ, 28 పారామెడికల్‌ కాలేజీలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో... ఎంతో వివక్షకు లోనవుతున్న ట్రాన్స్‌జెండర్‌ వాళ్ల ఆరోగ్యం కోసం ఓ తొలి ప్రయత్నంగా 33 క్లినిక్‌లు ఏర్పాటు చేసే దిశగా పనిచేశాం. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా సివిల్‌ సర్వీసెస్‌లో ఉంటూ నా పనుల ద్వారా సమాజంలో ఎంతో మార్పు తెచ్చామన్న తృప్తి ప్రతిరోజూ ప్రతిక్షణం ఉండటమే ఈ వృత్తిలో ఉన్నందుకు నాకు దక్కే సంతృప్తి.  
   – డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, సెక్రటరీ టు ద గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ                            

సంకల్ప బలంతోనే సాధన సులభం
ఒక హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా, మా టీమ్‌లోని  ఉద్యోగులకు స్ఫూర్తిని అందించే మెంటార్‌గా, మా హెచ్‌ఆర్‌ టీమ్‌లకూ, పారామెడికల్‌ స్టాఫ్‌కూ మార్గనిర్దేశనం చేస్తూ, వారికి నేతృత్వం వహించే పనిచేయడాని కంటే ముందు నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. దాంతో నా తల్లిదండ్రుల బాధ్యతలూ నేనే నిర్వహించాలి. దాంతోపాటు నా భర్తకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని, నా అత్తమామలకు అవసరమైన సేవలందిస్తూ ఇలా ఇంటిబాధ్యతలు చూస్తూనే... కెరియర్‌ పరంగా ఓ ఎంట్రప్రెన్యూర్‌గా హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలు చేపట్టా. 

ఓవైపు ఇంటిబాధ్యతలూ, మరోవైపు కెరియర్‌ బాధ్యతలు... ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మా సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. సంకల్పబలం ఉంటే కష్టసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించగలం అనేది నేను నమ్మే తారకమంత్రం. ఈ మాట ఎందుకు చె΄్పాల్సి వస్తోందంటే... నేను రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు నా రేడియాలజీ పీజీ పూర్తి చేశా. అటు తర్వాత ప్రతిష్ఠాత్మమైన ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో  ఏఎమ్‌పీహెచ్‌ ప్రోగ్రామ్‌ పూర్తికావడంతోనే ప్రీతీ హాస్పిటల్స్‌ గ్రూపునకు ఆపరేషన్స్‌ అధినేతగా బాధ్యతలు తీసుకున్నా.

 ప్రస్తుతం నేను మా సంస్థలో వందల సంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్నా. ఈ క్రమంలో మా సంస్థలో జెండర్‌ వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో వీలైనంత మేరకు మహిళా ఉద్యోగులనే నియమిస్తున్నాం. రోజు డ్యూటీ ముగిసి ఇంటికెళ్లే సమయానికి... మేం మా పేషెంట్ల పట్ల మాత్రమే కాకుండా... సమాజంలోని నిరుపేదల విషయంలోనూ సహానుభూతితో వ్యవహరిస్తున్నామన్న తృప్తే మమ్మల్ని ముందుకు నడిపించే మరో స్ఫూర్తిమంత్రమంటూ వినమ్రంగా చెబుతున్నాను.     

– డాక్టర్‌ రూప పుట్టా, సీనియర్‌ రేడియాలజిస్ట్, డైరెక్టర్‌ అండ్‌ కో ఫౌండర్‌ ఆఫ్‌ ప్రీతీ యూరాలజీ అండ్‌  కిడ్నీ హాస్పిటల్స్, హైదరాబాద్‌     

సారథ్యం అంత కష్టమేమీ కాదు!
ప్రస్తుతం నా వయసు 37 ఏళ్లైతే... మా హాస్పిటల్‌ వయసు 32 ఏళ్లు. అంటే నా ఊహ తెలిసినప్పటినుంచి మా అమ్మతో పాటు హాస్పిటల్, క్లినిక్‌... ఇలా నిత్యం వైద్యుల మధ్యనే మెలగుతున్నా. నా ఇంటర్మీడియట్‌ టైమ్‌లో బైపీసీ తీసుకుని వైద్యరంగం వైపునకు వెళ్లడం అనివార్యంగా జరిగిపోయింది. మాకు ఓ సొంత హాస్పిటల్‌ ఉండటం... అలాగే మేము నడుపుతున్న మెడికల్‌ కాలేజీలూ ఉండటం వల్ల  అక్కడ హాస్పిటల్‌ సారథిగా కీలకమైన అడ్మినిస్ట్రేషన్‌ స్థానంలోకి నేను వెళ్లడం చాలా సులువు అని కొంతమందికి అనిపించవచ్చు. 

అయితే ఈ పురుషులప్రాధాన్య ప్రపంచంలో ప్రతి సవాలునూ, ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ రావడం, ఓ మహిళగా ప్రతి నిమిషం, ప్రతిక్షణం తనను తాను నిరూపించుకుంటూ ఉండటం, ఆ స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోవడం, అందులో పదికాలాలు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మనం చేయాల్సిందొక్కటే... మన హద్దులను మనమే మరింతగా విస్తృత పరచుకుంటూ, మన పరిధిని మనమే మరింత విశాలం చేసుకుంటూ మన తోటివారినీ మనతోపాటు ముందుకు తీసుకెళ్తూ ఉండటమే. ఓ మహిళగా నా టీమ్‌ను ఈ దిశగా నడిపిస్తూ నా డాక్టర్లూ, నా సిబ్బందీ వీళ్లందరూ మంచి కౌన్సెలర్లుగా సహానుభూతితో పనిచేసేలా చేయగలగడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం ప్రస్తుతం నేను చేస్తున్న పని. చాలాకాలం పాటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన నిరుపేద పేషెంట్లకూ, గ్రామీణప్రాంతపు రోగులకూ ఈ సౌకర్యాలన్నీ ఇవ్వగలుగుతూ వస్తున్నామన్న ఓ అద్భుతమైన భావనే నాకు సంతృప్తినిస్తుంది.       
 – డాక్టర్‌  గాయత్రి కామినేని, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అండ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌  ఆఫీసర్‌ (సీవోవో), కామినేని 
హాస్పిటల్స్, హైదరాబాద్‌

మేనేజ్‌మెంట్‌లో మేమే బెస్ట్‌!
మొదట నేను ఓ డాక్టర్‌గానే సేవలందిస్తా అనుకున్నా. కానీ ఓ ఎంట్రప్రెన్యూర్‌గా, ఓ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడం వల్ల చాలా విస్తృతస్థాయిలో సేవలందించడానికి మనకు సాధ్యమవుతుందని గ్రహించాను.  సరిగ్గా ఇదే సమయంలో విజయవాడలో డాక్టర్‌ భాస్కర్‌రావుగారు కిమ్స్‌ తమ హాస్పిటల్‌ శాఖనుప్రారంభించారు. ఆ టైమ్‌లో అసిస్టెంట్‌ మెడికల్‌ డైరెక్టర్‌గా కిమ్స్‌లో పనిచేయడం మొదలుపెట్టా.  హాస్పిటల్‌ నడిపించడమెలాగో నేర్చుకోవడం  కోసం ప్రతిరోజూ నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లి... అక్కడ ప్రతి విభాగంలో ఉండే కష్టనష్టాలూ, సాధకబాధకాలు బాధకాలూ తెలుసుకుంటుండేదాన్ని. ఆ రంగంలో నాకున్న ఆసక్తి కారణంగా ప్రతిరోజూ గుంటూరు నుంచి విజయవాడకు వస్తూ పోతూ ఉండటాన్ని కంటిన్యువస్‌గా నాలుగేళ్లపాటు కొనసాగించా. అటు తర్వాత హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కిమ్స్‌ విభాగానికి మెడికల్‌ డైరెక్టర్‌గా, ఇప్పుడు కిమ్స్‌ హాస్పిటల్స్‌ తాలూకు వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. 
పేదలూ, బడుగువర్గాల నుంచి ప్రతిభావంతులైన మహిళలను ఎంచుకుని వారు సమర్థంగా పనిచేయగల స్థానాల్లో వారి నియామకాలు జరిగేలా చూసినప్పుడు... సమాజానికి అవసరమైన పని చేశామన్న సంతృప్తి ఉంటుంది. రేపు ఇంతకంటే మెరుగ్గా చేయాలన్న సంకల్పమూ ఉంటుంది.   
– డాక్టర్‌ హరిణి చేబ్రోలు, వైస్‌ ప్రెసిడెంట్‌ 
(రెవిన్యూ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌), కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌                         

కెరియర్‌ మెట్లపై‘ఫెమ్‌’నిస్టులం!
అందరూ మహిళా డాక్టర్లే ఉంటూ, మహిళలతోనే నడిచే ఓ పూర్తిస్థాయి మహిళల హెల్త్‌కేర్‌ సెంటర్‌ను మేము ఏర్పాటు చేయడానికి వెనక ఓ చిన్న కథ ఉంది. చిన్నపిల్లల వైద్యుడూ, రోజుల పిల్లల స్పెషలిస్తూ (నియోనేటాలజిస్ట్‌) అయిన నా భర్త దగ్గరికి తమ పిల్లలను తీసుకొచ్చే తల్లులు తనను నిత్యం ఓ ప్రశ్న అడుగుతుండేవారు. ‘ఏమండీ... ఎవరైనా మహిళా రేడియాలజిస్టు ఉన్నారా?... ఎక్కడైనా ఓ లేడీ బ్రెస్ట్‌ సర్జన్‌ దొరుకుతారా?’’ అన్నదే చాలామంది ప్రశ్న. 
దీంతో ఆ రంగాల్లో మహిళా వైద్యుల అవసరముందనే విషయం మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు మరో అంశమేమిటంటే... మా అమ్మ గారు క్యాన్సర్‌ విజేత. ఆమెకు క్యాన్సర్‌ చికిత్స జరుగుతున్న సమయంలో నేను ఆమె వెంట వెళ్తూ ఉండేదాన్ని. ఎవరైనా మహిళా వైద్యురాలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె చాలా సౌకర్యంగా ఫీలవుతుండటాన్ని గ్రహించా. అలాంటి అనుభవాల నుంచి పుట్టిందే మా ఫెమ్‌సిటీ హాస్పిటల్‌. 

ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే మహిళకు జస్ట్‌ 9 టు 5 జాబ్‌ చేయడం కుదరని పని. మనం ఎంచుకునే కెరియర్‌ అంతకంటే ఎక్కువే డిమాండ్‌ చేస్తుంటుంది. ఉదాహరణకు... నా చిన్నారి బేబీకి జన్మనివ్వడానికి కేవలం  నాలుగు గంటల ముందు కూడా నేను నా టీమ్‌తో పనిలో నిమగ్నమయ్యే ఉన్నాను. అంతేకాదు... నా టీమ్‌తో ఏదో చర్చిస్తూ, వాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మరో నాలుగ్గంటల తర్వాతే నా బేబీని నా చేతుల్లోకి తీసుకున్నా. 

నిజానికి మహిళలు తమ చుట్టూ ఉండేవాళ్ల ఆరోగ్యాన్నీ, సంక్షేమాన్ని, భద్రతనూ ఎల్లప్పుడూ కోరుకుంటూ, వాళ్లకేప్రాధాన్యమిస్తుంటారు. అందుకే ఈ సమాజానికి మరో తరాన్ని ఇస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే మహిళలతో సాటి మహిళగా కనెక్ట్‌ అవుతూ, ఆమెకు మానసిక, శారీరక ఆరోగ్యానందాలను ఇవ్వడం చాలా కీలకమైన అంశంగా ఫీలవుతుంటాను. ఫెమ్‌సిటీ కేర్స్‌ అనే ఫౌండేషన్‌ సహాయంతో ఖర్చులు భరించలేని, అఫర్డ్‌ చేయలేని అనేక మందికి శానిటరీ న్యాప్‌కిన్స్‌ పంపిణీ, నెలల పిల్లలకూ, చిన్న చిన్నపిల్లల వైద్యం, అనేక మందికి సర్జరీలూ ఉచితంగా అందిస్తున్నాం. ఇలాంటి సేవలెన్నో మా మహిళా, చిన్నపిల్లల హాస్పిటల్‌ ద్వారా నిరంతరం అందించగలుగుతున్నామన్నదే నాకు సంతృప్తినిచ్చే అంశం.         
 – ఎల్మిరా సిద్దీఖీ, కౌ–ఫౌండర్‌ 
అండ్‌ డైరెక్టర్‌ (పబ్లిక్‌ రిలేషన్స్‌), ఫెమ్‌సిటీ హాస్పిటల్స్, హైదరాబాద్‌

రంగుల కళ
ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే సింబల్, పోస్టర్‌ డిజైన్‌లలో సాధారణంగా పింక్‌ కలర్‌లో కనిపిస్తుంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే
అంటే ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు మాత్రమేప్రాచుర్యం పొందాయి.  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్‌సైట్‌ ప్రకారం... ఊదా రంగు గౌరవానికి, న్యాయానికి, ఆకుపచ్చ ఆశకు, తెలుపు స్వచ్ఛతకు ప్రతీక.  యూకేలోని ఉమెన్స్‌ సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ యూనియన్‌  (డబ్ల్యూ ఎస్పీయూ–1908) ద్వారా ఈ రంగులుప్రాచుర్యంలోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement