
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు
మార్కాపురం/తర్లుపాడు: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.
రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు, మార్కెటింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.
ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్‌కార్ట్ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి.
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం
ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం.
డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం.
వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా..
ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు.
మహిళా లబ్ధిదారులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్‌లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్‌ల సమక్షంలో సీఎం ప్రారంభించారు.
ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు..
అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment