న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్దెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి ఓ ఆగంతకుడు కారును వేగంగా నడిపాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ కారు మార్కెట్‌లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా వెళ్లినట్లు సీసీఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో కనీసం 41 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని మీడియా తెలిపింది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ.(50)అనే వ్యక్తిని సాయుధ పోలీసులు వెంటనే చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు.
వచ్చిన దారినే తిరిగి వెళ్లేందుకు కారును మళ్లించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా కేవలం మూడే మూడు నిమిషాల్లో జరిగిపోయింది. కారు ముందుభాగం, విండ్ స్క్రీన్ ధ్వంసమైంది. రద్దీగా మార్కెట్‌లో పాదచారుల మార్గంపైకి బీఎండబ్ల్యూ కారు వెళ్తున్న దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది. తాలెబ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
భయానక విషాద ఘటన
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితులను తరలించేందుకు 100 మంది పోలీసులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లతోపాటు 50 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. దారుణం తెలిసిన వెంటనే ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ మగ్దెబర్గ్ వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. దాడిని భయానక విషాద ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆనందానికి మారుపేరుగా ఉన్న మగ్దెబర్గ్‌లో ఘోరం చోటుచేసుకుందన్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో జర్మనీ వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ వారాంతపు మార్కెట్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు.
7 Indian nationals have been injured in Magdeburg, Germany. 3 have been discharged from the hospital. Indian Mission is in touch with all those injured in the attack: Sources
— ANI (@ANI) December 21, 2024
ఖండించిన భారత్
క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిని భారత్ ఖండించింది. దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, గాయపడిన భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. గాయపడిన భారతీయులతో, అలాగే వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. సాధ్యమైన మేరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని ’ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment