ప్రేలాపనలు ఆపు | India Strong Reacts on Pak Army Chief Asim Munir Comments | Sakshi
Sakshi News home page

ప్రేలాపనలు ఆపు

Aug 11 2025 3:32 PM | Updated on Aug 12 2025 6:00 AM

India Strong Reacts on Pak Army Chief Asim Munir Comments

పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌పై భారత్‌ ఆగ్రహం  

బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్‌  

అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్‌కు అలవాటే  

ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మునీర్‌ అధ్యక్షుడు అవుతారేమో!  

న్యూఢిల్లీ: బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్‌ అని భారత ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. పొరుగు దేశంలో ప్రాణాంతక అణ్వాయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో భారత సైన్యం తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు సోమవారం తిప్పికొట్టాయి. 

అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచి్చపోవడం, నోరుపారేసుకోవడం, అసలు రంగు బయటపెట్టుకోవడం పాకిస్తాన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశాయి. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదని, అక్కడ సైన్యమే రాజ్యమేలుతోందని చెప్పడానికి అసిమ్‌ మునీర్‌ నోటిదురుసే తార్కాణమని వివరించాయి. మునీర్‌కు అమెరికాలో ఘనమైన స్వాగతం, గౌరవ మర్యాదలు లభించాయంటే దాని అర్థం ఆయన మౌనంగా ఉండొచ్చు లేదా అమెరికా అండతో పాక్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, అధ్యక్షుడు కావొచ్చని తెలిపాయి.

 ఫీల్డ్‌ మార్షల్‌ తదుపరి ప్రెసిడెంట్‌గా మారే పరిస్థితి కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అణ్వాయుధాలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తే బెదిరిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పాయి. అణ్వాయుధాలు కలిగిన దేశం బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికాయి. వాటిని చూపించి ఇతరులను బెదిరిస్తామంటే అది సాధ్యం కాదని సూచించాయి. తమ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టంచేశాయి. పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని అసిమ్‌ మునీర్‌కు తేల్చిచెప్పాయి.  

మునీర్‌ వ్యాఖ్యలను అమెరికా ఆమోదిస్తోందా?  
‘‘పాకిస్తాన్‌లో అణ్వాయుధాల బటన్‌ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కాకుండా సైన్యం చేతుల్లో చిక్కుకుంది. దక్షిణాసియాలో అణు అస్థిరతకు పాకిస్తాన్‌ అడ్డాగా మారింది. అసిమ్‌ మునీర్‌ వాగుడు దీనినే సూచిస్తోంది. అమెరికా గడ్డపై ఆయన అనుచితంగా మాట్లాడారు. ఈ బాధ్యతరహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తోందా? అణ్వాయుధ ఘర్షణలకు తెరపడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిజంగా కోరుకుంటున్నారా? ఆయన వైఖరి ఏమిటి? మునీర్‌ వ్యాఖ్యలకు ట్రంప్‌ సర్కార్‌ బాధ్యత వహిస్తుందా?’’ అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement