
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్‌లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి.