లంకతో ఆరు రక్షణ ఒప్పందాలు | India, Sri Lanka ink 6 agreements including in defence, power, energy | Sakshi
Sakshi News home page

లంకతో ఆరు రక్షణ ఒప్పందాలు

Published Sun, Apr 6 2025 4:32 AM | Last Updated on Sun, Apr 6 2025 4:32 AM

India, Sri Lanka ink 6 agreements including in defence, power, energy

దిస్సనాయకెతో మోదీ చర్చలు 

భారత వ్యతిరేక కార్యకలాపాలకు లంకను వాడుకోనీయం 

ప్రధానికి అధ్యక్షుని హామీ 

మత్స్యకారులను విడిచిపెట్టండి: మోదీ 

లంకకు అండగా ఉంటామని వెల్లడి

కొలంబో: పొరుగు దేశం శ్రీలంకతో భారత్‌ ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు పవర్‌ గ్రిడ్‌ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి. శనివారం లంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకెతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపూర్‌ సౌర విద్యుత్కేంద్రాన్ని నేతలిద్దరూ వర్చువల్‌గా ప్రారంభించారు. 

భద్రత విషయంలో ఇరుదేశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దిస్సనాయకె అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎన్నుకున్నారు. ఆయన హయాంలో లంకను సందర్శించిన తొలి విదేశాధినేతను నేనే. ద్వైపాక్షిక బంధానికి ఇరు దేశాలూ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం’’ అన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో పలు కీలకమైన అంశాలు వారి నడుమ ప్రస్తావనకు వచ్చాయి. 

లంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడిచి పెట్టాల్సిందిగా మోదీ కోరారు. ఈ విషయంలో ఇరు దేశాలూ మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘ఆర్థిక సాయంలో భాగంగా లంకకు ఇచ్చిన రుణాలను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నాం. వాటిపై వడ్డీరేటును మరింత తగ్గిస్తున్నాం. లంకకు ఇచ్చిన 10 కోట్ల డాలర్ల మేరకు రుణాలను గ్రాంట్లుగా మార్చాం. శ్రీలంక ప్రజలకు భారత్‌ అన్నివిధాలా అండగా నిలుస్తుంది’’ అని పునరుద్ఘాటించారు. లంక తూర్పు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి నిమిత్తం 240 కోట్ల శ్రీలంక రూపాయల సాయాన్ని ప్రకటించారు. 

చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు దిస్సనాయకె తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు లంక భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. శ్రీలంకలోని కీలక నౌకాశ్రయాలు, భూభాగాలను నిఘా తదితర కార్యకలాపాలకు వాడుకునేలా చైనా పథక రచన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్‌లో ఆరావళి ప్రాంతాల్లో 1960లో దొరికిన బుద్ధుని పవిత్ర అవశేషాలను లోతైన పరిశోధనల నిమిత్తం లంకకు పంపుతున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. 

మోదీకి అత్యున్నత పురస్కారం 
ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. అధ్యక్షుడు దిస్సనాయకె ఆయనకు స్వయంగా అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీన్ని 140 కోట్ల పై చిలుకు భారతీయులకు లభించిన గౌరవంగా ప్రధాని అభివరి్ణంచారు.  

ఘనస్వాగతం 
అంతకుముందు రెండు రోజుల థాయ్‌లాండ్‌ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి బ్యాంకాక్‌ నుంచి కొలంబో చేరుకున్నారు. నగరంలోని చారిత్రక 
ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌ వద్ద శనివారం ఆయనకు అత్యంత ఘనస్వాగతం లభించింది. అధ్యక్షుడు దిస్సనాయకె స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతలకు ఈ స్థాయి స్వాగతం లభించడం శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి.

తమిళులకు న్యాయం చేయండి 
శ్రీలంక తమిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారికి న్యాయం జరిగేలా చూసేందుకు భారత్‌ ఎప్పుడూ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటన సందర్భంగా శనివారం స్థానిక తమిళ నేతలతో సమావేశమయ్యాక ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అధ్యక్షుడు దిస్సనాయకెతో చర్చల సందర్భంగా కూడా ఈ అంశాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘లంక తమిళుల ఆకాంక్షలను గౌరవించండి.

 హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం రాజ్యాంగంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చండి. ప్రొవిన్షియల్‌ కౌన్సిళ్లకు తక్షణం ఎన్నికలు జరిపించండి’’ అని సూచించారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లంక తమిళుల ఆకాంక్షలను దిస్సనాయకె సర్కారు నెరవేరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. భారత మూలాలున్న తమిళులకు 10 వేల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు తమకు కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలని తమిళులు చిరకాలంగా కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement