Anura Kumara Dissanayake
-
మైత్రీబంధంలో శుభ పరిణామం
ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్‌ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్‌ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్‌తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్‌కు శ్రీలంక కీలకం. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే! -
దిస్సనాయకే విజయం సంపూర్ణం
సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్‌లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి గెలుచుకున్నవి 159. ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు. సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్ఎల్ఎఫ్ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.తమిళ ఈలమ్‌కు వ్యతిరేకంవాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్‌గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది. ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్‌గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు. నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.సాహసించి పార్లమెంటు రద్దుఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్‌ను రద్దు చేశారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.ఇండియాతో సత్సంబంధాలు?దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన. కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్‌ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో NPP విక్టరీ
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. -
కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75 శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45 శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్ డాలర్ల నుండి 37.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్‌లో 51.2 బిలియన్ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్‌లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. ఇందువల్ల ఐఎంఎఫ్ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్ నాటికి సుమారు 237 మిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్‌కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగి 44.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్ నాడు జరిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25 శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్‌తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్‌తో 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ ‘ 79089 33741- డా‘‘ గద్దె ఓంప్రసాద్ -
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in -
శ్రీలంక చరిత్రలోనే కొత్తమలుపు
శ్రీలంక చరిత్ర, వారు బ్రిటిష్ వలస పాలన నుండి 1948లో స్వతంత్రులైన 74 సంవత్సరాల తర్వాత ఈ నెల 22న కొత్త మలుపు తిరిగింది. ఆ దేశాన్ని ఇంతకాలం మధ్యే మార్గానికి చెందిన, లేదా భారతదేశపు కాంగ్రెస్ వలె కొద్దిగా వామపక్షపు మొగ్గు గల పార్టీలు పాలించగా, ఈ ఆదివారం నాటి ఎన్నికలలో స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ విజయం సాధించింది. ఆ మరునాడే జేవీపీ నాయకుడు అనూర కుమార దిస్సనాయకే దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేవీపీ ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. తమిళ టైగర్లపై ఊచకోతను బలపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలకు గట్టి ప్రయత్నం అవసరం.శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) విజయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఓటింగ్ శాతం అసాధారణంగా 75 శాతానికి చేరింది. జేవీపీకి లభించిన ఓట్లు 42.3 శాతం. వారి ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ప్రేమదాస వారసుడైన సజిత్ ప్రేమదాస రెండవ స్థానంలో నిలవగా ఆయనకు వచ్చినవి 32.71 శాతం. అధ్యక్షునిగా ఇపుడు పదవీ విరమణ చేసిన రణిల్ విక్రమసింఘే తెచ్చుకున్నవి 17.27 శాతం కాగా, రాజపక్షే వారసుడు నమల్ రాజపక్షే కేవలం 3 శాతానికి పరిమితమయ్యాడు. అనూర దిస్స నాయకే పేరు మనకిక్కడ తెలియదుగానీ, తక్కిన వంశాలన్నీ సుపరిచి తమే. ఎన్నికల ఫలితాలకు సంబంధించి గమనించవలసిన మరో విషయం, జేవీపీ మొదటిసారిగా దేశంలోని అన్ని ప్రాంతాలలో బలం సంపాదించటం. అక్కడ ఆ పార్టీకి మొదటినుంచి పునాది ఉన్నది దక్షిణ, మధ్య ప్రాంతాలలో మాత్రమే. తూర్పు, పడమరలలోగానీ, ఉత్తరానగానీ బలహీనం. ఇది నేను శ్రీలంకలో పర్యటించినపుడు స్వయంగా గమనించాను. దక్షిణాన, మధ్య ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు అన్నీ జేవీపీ కంచుకోటలు. అదే ప్రాంతాన గల పెరెదీనియా అనే అతి సుందరమైన యూనివర్సిటీకి వెళ్లగా, సీలింగ్ నుంచి కింది వరకు వేలాడే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ చిత్రాలు! ఆ యూనివర్సిటీ పూర్తిగా జేవీపీ విద్యార్థి సంఘపు స్థావరం. అది చూసి నాకు ఆ కాలపు కాకతీయ యూనివర్సిటీ గుర్తుకు వచ్చింది. అటువంటి దశ నుంచి జేవీపీ ఇపుడు అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.అయితే, అదే సమయంలో గుర్తించవలసిన వాస్తవం ఒకటున్నది. జేవీపీ ఈ విధమైన బలాన్ని మొదటిసారిగా సాధించటానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, దేశాన్ని మొదటి నుంచి పాలించిన అన్ని పార్టీలు వరుసగా విఫలమవుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం; ఆర్థిక స్థితి తీవ్రంగా దెబ్బ తిని, భారీగా అప్పులపాలై, కొంత కాలం క్రితం దివాళా పరిస్థితికి చేరిన సంక్షోభం గురించి, ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, హింస, సైన్యం ద్వారా అణచివేత, దేశం నుంచి అధ్యక్షుడు రాజపక్షే పరారీల వార్తలు చూశాం. ఆ పరిస్థితుల్లో సైన్యం సహా అన్ని పార్టీల రాజీతో మరొక మాజీ అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఐఎంఎఫ్ భారీ రుణంతో ఆయన ఆర్థిక స్థితిని చక్కబెట్టజూశారు గానీ ఆయన వల్ల కాలేదు. ప్రజల పరిస్థితులు క్షీణించటం, ధరలు ఆకాశానికి చేరటం, తీవ్ర నిరుద్యోగం వంటి కారణాలతో ఇతర పార్టీలన్నీ ప్రజల విశ్వా సాన్ని కోల్పోయాయి. ఒక శూన్యం ఏర్పడింది. రెండు, తాము ఆర్థిక స్థితిని చక్కబెట్టడంపై దృష్టిని కేంద్రీకరించగలమనీ, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించగలమనీ జేవీపీ నమ్మబలికిన మాటలను ప్రజలు నమ్మటం. మూడు, తమది మార్క్సిస్టు సిద్ధాంతం కాగా, డెమోక్రటిక్ సోషలిజం (మన దగ్గర సోషలిస్టు పార్టీల వలె), సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన అజెండాతో మార్పు, సంస్క రణ అనే లక్ష్యాలతో పనిచేయగలమని ప్రకటించటం.జేవీపీ సిద్ధాంతాలు మొదటి నుంచి ప్రజానుకూలమైనవి. నిరాడంబరులు, నీతిపరులు, కష్టించి పనిచేసేవారు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారన్న పేరున్నది. పార్టీ వ్యవస్థాపకుడైన రోహణ విజెవీర యువకులకు రహస్యంగా సాయుధ శిక్షణలు ఇచ్చి ఒకసారి 1971లో, తర్వాత అంతకన్నా భీకరంగా 1987–89లో రెండవసారి ఆకస్మిక గెరిల్లా దాడులతో దేశాన్ని స్తంభింపజేశాడు. ఆయన గెరిల్లా బలాన్ని శ్రీలంక సైన్యం సైతం ఆపలేక పోవటంతో ఇతర దేశాలు సైన్యాలను పంపవలసి వచ్చింది. ఆ సైన్యాలన్నీ కలిసి దాదాపు 70 వేల మంది గెరిల్లాలను కాల్చివేసినట్లు అంచనా. ఆ కాలంలో ఇదంతా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత జేవీపీ సాయుధ పోరాటాన్ని వదలివేసింది. మార్క్సిస్టు–లెనినిస్టు సిద్ధాంతంతోనే పార్లమెంటరీ రాజకీయాలలోకి మళ్లింది.ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన అనూర ఒక మారుమూల గ్రామానికి, అతి సాధారణ కుటుంబానికి చెందినవాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో పాల్గొంటూ క్రమంగా పార్టీలో గుర్తింపు పొంది ఎదుగుతూ వచ్చాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ విషయంలోనూ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఈ విధమైన వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా ఉన్నవాడు గనుకనే ఆదివారం నాటి ఎన్నికలలో అన్ని ప్రాంతాల ప్రజలు తనకు, తన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆధిపత్యవాదపు సింహళ జాతీయులు, తమిళులు, ముస్లిములు, దక్షిణ–మధ్య ప్రాంతాల వాసులుగా విడిపోయి ఉండే అక్కడి దేశీ యులు ఈ విధంగా మూకుమ్మడిగా ఒక పార్టీని బలపరచటం ఒక మేరకు దేశ స్వాతంత్య్రానంతరం బండారనాయకే కుటుంబ కాలంలో మినహా ఎపుడూ జరగలేదు. ఇపుడు జేవీపీ తన చిన్న మిత్ర పక్షాలతో కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట ఒక ఏకీభావం గల కూటమితో ఆ ఘనతను సాధించింది. ‘ఇది దేశాభ్యుదయం, పునర్నవీకరణల సరికొత్త శకం దిశగా ఒక ముందడుగు’ అని, ‘సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశాన్ని కొత్త మలుపు తిప్పగలమనే నమ్మకం మాకున్న’దని ఈ సందర్భంగా అనూర ప్రకటించారు.అయితే, శ్రీలంకను 1948లో దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచే సమస్యలకు గురిచేస్తూ, 1976లో వేలుపిళ్ళై ప్రభాకరన్ నాయకత్వాన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీటీఈ) స్థాపన తర్వాత మహా తీవ్ర దశకు చేరిన తమిళుల సమస్యపై జేవీపీ పరిష్కార మార్గం ఏమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. నేను కొలంబో శివార్లలోని జేవీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడి నాయకులతో మాట్లాడినపుడు, వారు తమిళులకు ప్రత్యేక రాజ్యం కాదు గదా కనీసం వారి ప్రాంతాలకు ఫెడరల్ హక్కులు ఇచ్చేందుకు కూడా వ్యతిరేకులని అర్థమైంది. అది మార్క్సిజం అవగాహనకు భిన్నం కదా అని నేను గుర్తు చేసినా వారు అంగీకరించలేదు. నాకు అర్థమైన దానిని బట్టి ఇతర సింహళీయులు, బౌద్ధ గురువుల వలెనే జేవీపీ పూర్తిగా జాతీయవాద పార్టీ. తమ దేశ ఐక్యతకు, భౌగోళికతకు చిన్నమెత్తు భంగపాటు అయినా కలగరాదన్నది వారి వైఖరి. అందు కోసం బౌద్ధ గురువులు బుద్ధుని బోధనలనైనా పక్కకు పెట్టినట్లు, జేవీపీ వారు మార్క్సిస్టు సూత్రాలనైనా విస్మరిస్తారు. అందుకే వీరు ఇరువురూ, తమిళ ప్రాంతాలకు ఫెడరల్ అధికారం కోసం రాజీవ్ గాంధీ, జయవర్ధనేల మధ్య ఒప్పందంతో శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళ టైగర్లపై ఊచకోతను పూర్తిగా బలపరిచారు. అప్పటితో పోల్చితే ప్రభాకరన్ గానీ, ఈలం పోరాటంగానీ లేనందున ఈ మారిన పరిస్థితులలో అనూర ప్రభుత్వ విధానం ఏమి కాగలదో వేచి చూడాలి.శ్రీలంక పొరుగు దేశమైన ఇండియాకు వారి విదేశాంగ విధానం ముఖ్యమైనది. యథాతథంగా జేవీపీ మొదటినుంచి ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. అందుకు కారణాలను వారి కార్యా లయాన్ని సందర్శించినపుడు నాకు చెప్పారు. అదట్లా ఉంచితే, నిజా నికి ఇంతకు ముందటి అధ్యక్షులు కూడా చైనా పట్ల ఎంతో కొంత మొగ్గు చూపిన వారే తప్ప ఇండియా పట్ల కాదు. ఆ విధంగా ఇండి యాకు నాలుగు వైపుల గల దేశాలన్నింటిలో భూటాన్ తప్ప మనకు నిజంగా అనుకూలమన్నది ఒక్కటైనా లేదు. బంగ్లాదేశ్ కొంతమేర అట్లా ఉండగా షేక్ హసీనా పదవీచ్యుతితో పరిస్థితి మారింది. అటు వంటప్పుడు శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సంబంధాల అభివృద్ధికి గట్టి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణ స్వీకారం
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య దస్సనాయకేతో ప్రమాణం చేయించారు .కాగా శ్రీలంకకు అనూర కుమార దిస్సనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.ప్రమాణ స్వీకారం అనంతరం దిస్సనాయకే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ‘నేనేం మాంత్రికుడిని కాదు, నాకు తెలిసినవి, తెలియని విషయాలు ఉన్నాయి. ఉత్తమ సలహాలు తీసుకొని మంచి నేతగా పనిచేసేందుకు కృష్టి చేస్తాను, అందుకు నాకు అందరి సహాకారం అవసరం’ అని పేర్కొన్నారు.కాగా అదివారం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయ తన సమీప ప్రత్యర్థి, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలిగారు. చదవండి: ఇజ్రాయెల్ విధ్వంసం.. హమాస్ చీఫ్ మృతిశ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. -
శ్రీలంకలో పోలింగ్ ప్రశాంతం
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి హింసాత్మక ఘటనలూ నమోదు కాలేదు. చివరి సమాచారం అందేసరికి 75 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను ఈయూ, కామన్వెల్త్ తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. 38 మంది బరిలో దిగినా ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో పాటు జనాదరణతో దూసుకుపోతున్న జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్యే నెలకొనడం తెలిసిందే. రేసులో దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేస్తారు. పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థి విజేత అవుతాడు. -
#SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది... ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే... 2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి. 2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది. చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్