రణిల్, సజిత, అనూర అమీతుమీ
అనూరకే అవకాశమంటున్న పోల్స్
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్‌పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది.
అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది...
ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే...
2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి.
2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది.
చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment