కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్‌పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.
225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్‌లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్‌పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.
దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్‌పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment