విశ్లేషణ
సెప్టెంబర్‌లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.
శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్‌లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) కూటమి గెలుచుకున్నవి 159.
ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్‌పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు.
సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్‌లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.
తమిళ ఈలమ్‌కు వ్యతిరేకం
వాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్‌గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది.
ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్‌గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు.
నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్‌టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.
సాహసించి పార్లమెంటు రద్దు
ఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు.
శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్‌లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్‌లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్‌ను రద్దు చేశారు.
దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.
ఇండియాతో సత్సంబంధాలు?
దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన.
కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు.
తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్‌ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.
ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి.
తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment