శ్రీలంక చరిత్రలోనే కొత్తమలుపు | Sakshi Guest Column On Sri Lanka History | Sakshi
Sakshi News home page

శ్రీలంక చరిత్రలోనే కొత్తమలుపు

Published Wed, Sep 25 2024 5:14 AM | Last Updated on Wed, Sep 25 2024 5:14 AM

Sakshi Guest Column On Sri Lanka History

విశ్లేషణ

శ్రీలంక చరిత్ర, వారు బ్రిటిష్‌ వలస పాలన నుండి 1948లో స్వతంత్రులైన 74 సంవత్సరాల తర్వాత ఈ నెల 22న కొత్త మలుపు తిరిగింది. ఆ దేశాన్ని ఇంతకాలం మధ్యే మార్గానికి చెందిన, లేదా భారతదేశపు కాంగ్రెస్‌ వలె కొద్దిగా వామపక్షపు మొగ్గు గల పార్టీలు పాలించగా, ఈ ఆదివారం నాటి ఎన్నికలలో స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ విజయం సాధించింది. ఆ మరునాడే జేవీపీ నాయకుడు అనూర కుమార దిస్సనాయకే దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేవీపీ ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. తమిళ టైగర్లపై ఊచకోతను బలపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలకు గట్టి ప్రయత్నం అవసరం.

శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) విజయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఓటింగ్‌ శాతం అసాధారణంగా 75 శాతానికి చేరింది. జేవీపీకి లభించిన ఓట్లు 42.3 శాతం. వారి ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ప్రేమదాస వారసుడైన సజిత్‌ ప్రేమదాస రెండవ స్థానంలో నిలవగా ఆయనకు వచ్చినవి 32.71 శాతం. అధ్యక్షునిగా ఇపుడు పదవీ విరమణ చేసిన రణిల్‌ విక్రమసింఘే తెచ్చుకున్నవి 17.27 శాతం కాగా, రాజపక్షే వారసుడు నమల్‌ రాజపక్షే కేవలం 3 శాతానికి పరిమితమయ్యాడు. 

అనూర దిస్స నాయకే పేరు మనకిక్కడ తెలియదుగానీ, తక్కిన వంశాలన్నీ సుపరిచి తమే. ఎన్నికల ఫలితాలకు సంబంధించి గమనించవలసిన మరో విషయం, జేవీపీ మొదటిసారిగా దేశంలోని అన్ని ప్రాంతాలలో బలం సంపాదించటం. అక్కడ ఆ పార్టీకి మొదటినుంచి పునాది ఉన్నది దక్షిణ, మధ్య ప్రాంతాలలో మాత్రమే. తూర్పు, పడమరలలోగానీ, ఉత్తరానగానీ బలహీనం. ఇది నేను శ్రీలంకలో పర్యటించినపుడు స్వయంగా గమనించాను. 

దక్షిణాన, మధ్య ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు అన్నీ జేవీపీ కంచుకోటలు. అదే ప్రాంతాన గల పెరెదీనియా అనే అతి సుందరమైన యూనివర్సిటీకి వెళ్లగా, సీలింగ్‌ నుంచి కింది వరకు వేలాడే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ చిత్రాలు! ఆ యూనివర్సిటీ పూర్తిగా జేవీపీ విద్యార్థి సంఘపు స్థావరం. అది చూసి నాకు ఆ కాలపు కాకతీయ యూనివర్సిటీ గుర్తుకు వచ్చింది. అటువంటి దశ నుంచి జేవీపీ ఇపుడు అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.

అయితే, అదే సమయంలో గుర్తించవలసిన వాస్తవం ఒకటున్నది. జేవీపీ ఈ విధమైన బలాన్ని మొదటిసారిగా సాధించటానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, దేశాన్ని మొదటి నుంచి పాలించిన అన్ని పార్టీలు వరుసగా విఫలమవుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం; ఆర్థిక స్థితి తీవ్రంగా దెబ్బ తిని, భారీగా అప్పులపాలై, కొంత కాలం క్రితం దివాళా పరిస్థితికి చేరిన సంక్షోభం గురించి, ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, హింస, సైన్యం ద్వారా అణచివేత, దేశం నుంచి అధ్యక్షుడు రాజపక్షే పరారీల వార్తలు చూశాం. 

ఆ పరిస్థితుల్లో సైన్యం సహా అన్ని పార్టీల రాజీతో మరొక మాజీ అధ్యక్షుడైన రణిల్‌ విక్రమసింఘేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఐఎంఎఫ్‌ భారీ రుణంతో ఆయన ఆర్థిక స్థితిని చక్కబెట్టజూశారు గానీ ఆయన వల్ల కాలేదు. ప్రజల పరిస్థితులు క్షీణించటం, ధరలు ఆకాశానికి చేరటం, తీవ్ర నిరుద్యోగం వంటి కారణాలతో ఇతర పార్టీలన్నీ ప్రజల విశ్వా సాన్ని కోల్పోయాయి. ఒక శూన్యం ఏర్పడింది. 

రెండు, తాము ఆర్థిక స్థితిని చక్కబెట్టడంపై దృష్టిని కేంద్రీకరించగలమనీ, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించగలమనీ జేవీపీ నమ్మబలికిన మాటలను ప్రజలు నమ్మటం. మూడు, తమది మార్క్సిస్టు సిద్ధాంతం కాగా, డెమోక్రటిక్‌ సోషలిజం (మన దగ్గర సోషలిస్టు పార్టీల వలె), సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన అజెండాతో మార్పు, సంస్క రణ అనే లక్ష్యాలతో పనిచేయగలమని ప్రకటించటం.

జేవీపీ సిద్ధాంతాలు మొదటి నుంచి ప్రజానుకూలమైనవి. నిరాడంబరులు, నీతిపరులు, కష్టించి పనిచేసేవారు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారన్న పేరున్నది. పార్టీ వ్యవస్థాపకుడైన రోహణ విజెవీర యువకులకు రహస్యంగా సాయుధ శిక్షణలు ఇచ్చి ఒకసారి 1971లో, తర్వాత అంతకన్నా భీకరంగా 1987–89లో రెండవసారి ఆకస్మిక గెరిల్లా దాడులతో దేశాన్ని స్తంభింపజేశాడు. 

ఆయన గెరిల్లా బలాన్ని శ్రీలంక సైన్యం సైతం ఆపలేక పోవటంతో ఇతర దేశాలు సైన్యాలను పంపవలసి వచ్చింది. ఆ సైన్యాలన్నీ కలిసి దాదాపు 70 వేల మంది గెరిల్లాలను కాల్చివేసినట్లు అంచనా. ఆ కాలంలో ఇదంతా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత జేవీపీ సాయుధ పోరాటాన్ని వదలివేసింది. మార్క్సిస్టు–లెనినిస్టు సిద్ధాంతంతోనే పార్లమెంటరీ రాజకీయాలలోకి మళ్లింది.

ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన అనూర ఒక మారుమూల గ్రామానికి, అతి సాధారణ కుటుంబానికి చెందినవాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో పాల్గొంటూ క్రమంగా పార్టీలో గుర్తింపు పొంది ఎదుగుతూ వచ్చాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ విషయంలోనూ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. 

ఈ విధమైన వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా ఉన్నవాడు గనుకనే ఆదివారం నాటి ఎన్నికలలో అన్ని ప్రాంతాల ప్రజలు తనకు, తన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆధిపత్యవాదపు సింహళ జాతీయులు, తమిళులు, ముస్లిములు, దక్షిణ–మధ్య ప్రాంతాల వాసులుగా విడిపోయి ఉండే అక్కడి దేశీ యులు ఈ విధంగా మూకుమ్మడిగా ఒక పార్టీని బలపరచటం ఒక మేరకు దేశ స్వాతంత్య్రానంతరం బండారనాయకే కుటుంబ కాలంలో మినహా ఎపుడూ జరగలేదు. 

ఇపుడు జేవీపీ తన చిన్న మిత్ర పక్షాలతో కలిసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పేరిట ఒక ఏకీభావం గల కూటమితో ఆ ఘనతను సాధించింది. ‘ఇది దేశాభ్యుదయం, పునర్నవీకరణల సరికొత్త శకం దిశగా ఒక ముందడుగు’ అని, ‘సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశాన్ని కొత్త మలుపు తిప్పగలమనే నమ్మకం మాకున్న’దని ఈ సందర్భంగా అనూర ప్రకటించారు.

అయితే, శ్రీలంకను 1948లో దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచే సమస్యలకు గురిచేస్తూ, 1976లో వేలుపిళ్ళై ప్రభాకరన్‌ నాయకత్వాన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీటీఈ) స్థాపన తర్వాత మహా తీవ్ర దశకు చేరిన తమిళుల సమస్యపై జేవీపీ పరిష్కార మార్గం ఏమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. నేను కొలంబో శివార్లలోని జేవీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడి నాయకులతో మాట్లాడినపుడు, వారు తమిళులకు ప్రత్యేక రాజ్యం కాదు గదా కనీసం వారి ప్రాంతాలకు ఫెడరల్‌ హక్కులు ఇచ్చేందుకు కూడా వ్యతిరేకులని అర్థమైంది. 

అది మార్క్సిజం అవగాహనకు భిన్నం కదా అని నేను గుర్తు చేసినా వారు అంగీకరించలేదు. నాకు అర్థమైన దానిని బట్టి ఇతర సింహళీయులు, బౌద్ధ గురువుల వలెనే జేవీపీ పూర్తిగా జాతీయవాద పార్టీ. తమ దేశ ఐక్యతకు, భౌగోళికతకు చిన్నమెత్తు భంగపాటు అయినా కలగరాదన్నది వారి వైఖరి. అందు కోసం బౌద్ధ గురువులు బుద్ధుని బోధనలనైనా పక్కకు పెట్టినట్లు, జేవీపీ వారు మార్క్సిస్టు సూత్రాలనైనా విస్మరిస్తారు. 

అందుకే వీరు ఇరువురూ, తమిళ ప్రాంతాలకు ఫెడరల్‌ అధికారం కోసం రాజీవ్‌ గాంధీ, జయవర్ధనేల మధ్య ఒప్పందంతో శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళ టైగర్లపై ఊచకోతను పూర్తిగా బలపరిచారు. అప్పటితో పోల్చితే ప్రభాకరన్‌ గానీ, ఈలం పోరాటంగానీ లేనందున ఈ మారిన పరిస్థితులలో అనూర ప్రభుత్వ విధానం ఏమి కాగలదో వేచి చూడాలి.

శ్రీలంక పొరుగు దేశమైన ఇండియాకు వారి విదేశాంగ విధానం ముఖ్యమైనది. యథాతథంగా జేవీపీ మొదటినుంచి ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. అందుకు కారణాలను వారి కార్యా లయాన్ని సందర్శించినపుడు నాకు చెప్పారు. అదట్లా ఉంచితే, నిజా నికి ఇంతకు ముందటి అధ్యక్షులు కూడా చైనా పట్ల ఎంతో కొంత మొగ్గు చూపిన వారే తప్ప ఇండియా పట్ల కాదు. 

ఆ విధంగా ఇండి యాకు నాలుగు వైపుల గల దేశాలన్నింటిలో భూటాన్‌ తప్ప మనకు నిజంగా అనుకూలమన్నది ఒక్కటైనా లేదు. బంగ్లాదేశ్‌ కొంతమేర అట్లా ఉండగా షేక్‌ హసీనా పదవీచ్యుతితో పరిస్థితి మారింది. అటు వంటప్పుడు శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సంబంధాల అభివృద్ధికి గట్టి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement