మైత్రీబంధంలో శుభ పరిణామం | Anura Kumara Dissanayake tour of india | Sakshi
Sakshi News home page

మైత్రీబంధంలో శుభ పరిణామం

Published Thu, Dec 19 2024 4:11 AM | Last Updated on Thu, Dec 19 2024 4:11 AM

Anura Kumara Dissanayake tour of india

ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. 

పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్‌ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.

ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్‌ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్‌ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. 

వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్‌తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. 

అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్‌ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. 

హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. 

ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్‌ శక్తి, డిజిటల్‌ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్‌ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల  వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. 

అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. 

అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్‌కు శ్రీలంక కీలకం. 

అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement