ఇటీవలి భారత పర్యటనలో మోదీతో దిస్సనాయకే
విశ్లేషణ
శ్రీలంక ఎన్నికలలో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ముందు రెండు ముఖ్యమైన సమస్యలున్నాయి. ఒకటి, ఆర్థికం కాగా, రెండవది తమిళ, ముస్లిం అల్పసంఖ్యాక వర్గాల సమస్య. మొదటి దాని విషయమై చర్యలు ప్రారంభించారు. రెండవ దానిపై ఇంకా దృష్టి పెట్టవలసి ఉంది. కానీ ఆర్థికం కన్నా ఇది మరింత తీవ్రమైనదై దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు సంక్షోభంలోకి నెట్టివేసింది.
అనూర కుమార దిస్సనాయకేకు చెందిన జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీకి ఇతర జాతీయవాద బౌద్ధ పార్టీల వలెనే అల్ప సంఖ్యాక వర్గాలపట్ల మొదటి నుంచీ వ్యతి రేకత ఉంది. జేవీపీ మార్క్సిస్టు పార్టీ అయినప్పటికీ, ఇతర సింహళ పార్టీలు ఏ విధంగానైతే తమిళులు, ముస్లిములను వ్యతిరేకించాయో తను కూడా అదే వైఖరి తీసుకుంది. సెప్టెంబర్ అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకే ఎంత గొప్ప విజయం సాధించినా ఈ వర్గాలు ఆయ నకు ఓటు వేయలేదు. కానీ రెండు నెలలు గడిచి నవంబర్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు భారీ ఎత్తున బలపరిచాయి.
అందుకు కారణం ఆయన వారిని కూడా వెంట కలుపుకొని పోగలనని పదేపదే భరోసా ఇవ్వటమే. దీని ప్రభావం తమిళులు పెద్ద సంఖ్యలో గల కొలంబో నగరంతోపాటు, ఆధిక్యతలో ఉన్న జాఫ్నా, బట్టిక లోవా, ట్రింకోమలీ ప్రాంతాలలో కనిపించింది. కొలంబో, బట్టిక లోవా కేంద్రాలుగా గల ముస్లిములు కూడా అదే పని చేశారు.
‘సామరస్యత’ సాధ్యమేనా?
కానీ, తర్వాత ఈ మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి ఇంతవరకైతే ఎటువంటి కదలికలు కనిపించటం లేదు. దిస్సనాయకే ఈ డిసెంబర్‌లో ఇండియాను సందర్శించి ప్రధాని మోదీతో సమావేశ మైనప్పుడు, ఈ అంశంపై ఏదైనా ప్రకటన రావచ్చునని అను కున్నారు. కానీ ఇరు నాయకుల సంయుక్త ప్రకటనలోగానీ, ఇతరత్రా గానీ అటువంటిదేమీ ప్రత్యక్షమైన రీతిలో కనిపించటం లేదు. పరోక్ష సూచనలు మాత్రం కొన్నున్నాయి. మోదీ తన వైపు నుంచి ‘సామ రస్యత’, ‘రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరచటం’, ‘ప్రాంతాల కౌన్సిళ్లకు (ఇండియాలో అసెంబ్లీల వంటివి) ఎన్నికలు’ అనే సూచ నలు చేయగా, దిస్సనాయకే ‘మా ప్రజాస్వామ్యానికి వైవిధ్యత ఒక మూలస్తంభం’ అని మాత్రం అన్నారు.
ఇందులో మోదీ మాటలు మూడు కూడా అర్థవంతమైనవే. మైనారిటీలు అనే మాట ఉపయోగించకపోయినా, ‘సామరస్యత’ అనటం వారి గురించే. రాజ్యాంగం పూర్తిగా అమలు, ప్రాంతీయ కౌన్సిళ్లకు ఎన్నికలు అన్నది రాజీవ్–జయవర్ధనే ఒప్పందం (1987) ప్రకారం శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణలోని అంశా లకు సంబంధించినది. జయవర్ధనే కాలంలో ఆ ప్రకారం, తమిళులు ఆధిక్యతలోగల జాఫ్నా, బట్టికలోవా ప్రాంతాలను కలిపి ఒక ప్రావి న్స్‌గా మార్చి ఎన్నికలు నిర్వహించారు కూడా. ఆ ఎన్నికలలో వరదరాజ పెరుమాళ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తర్వాత కొలంబోలోని తన నివాసంలో నాకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనపై ఎల్టీటీఈ బెదిరింపులు, జయవర్ధనే ప్రభుత్వ సహాయ నిరాకరణతో విధి లేక రాజీనామా చేసినట్లు చెప్పారు.
ఆ వెనుక ఇక ఎన్నికలే జరగలేదు. అదట్లుంచితే, వరదరాజ పెరుమాళ్‌ది తెలుగు కుటుంబం కావటం విశేషం. ఆ మాట శ్రీలంకలో రహస్యమని, ఎక్కడా రాయ వద్దని కోరారు. అప్పటి పరిస్థితులన్నీ ఈ సరికి సమసి పోయినందున ఇప్పుడు రాస్తున్నాను. విషయానికి వస్తే, ఫెడరలిజం తరహాలో రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలకు ఎన్నికలు, ఫెడరల్ అధికారాలనే ఆలోచ నకే ఇతర సింహళ పార్టీల వలెనే బద్ధ వ్యతిరేకి అయిన జేవీపీ, 13వ రాజ్యాంగ సవరణను మోదీ పరోక్షంగా సూచించినట్లు అమలు పరచ గలదా అన్నది సందేహమే.
వికేంద్రీకరణ జరిగేనా?
ఫెడరలిజం రూపంలో అధికార వికేంద్రీకరణ, 13వ సవరణల సంగతి అట్లుంచినా, ఎల్టీటీఈ అధ్యాయం 2009లో ముగిసినా, అక్కడి ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలుగా వాటి పరిష్కారానికి ప్రయత్నించలేదు. ఆ సమస్యలు తమిళులకు సంబంధించి జాఫ్నా ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిబిరాల ఎత్తివేత, పౌర హక్కుల పునరుద్ధరణ, రకరకాల వివక్షల నిలిపివేత, సైన్యంతోపాటు సింహ ళీయులు ఆక్రమించిన తమ భూభాగాలను తిరిగి తమకు అప్పగించటం, తమిళ భాషకు తగిన గుర్తింపు వంటివి.
అదే విధంగా ముస్లింలకు సంబంధించి, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ (ఎస్‌ఎల్‌ఎంసి) అధ్యక్షుడు రవూఫ్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాము సింహళీయుల ఆధి క్యతా వాదానికి, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకమనీ, వారు తమ ప్రాంతాలను కాలనైజ్ చేస్తున్నారనీ, ఇటువంటిది ఆగిపోవాలనీ అన్నారు. తమకు యూనియన్ టెరిటరీ వంటిది ఏర్పాటు చేసి అధి కార వికేంద్రీకరణ జరగాలన్నారు.
శ్రీలంక జనాభాలో సింహళీయులు సుమారు 75 శాతం కాగా, తమిళులు 12 శాతం, ఇండియన్ తమిళులు లేదా తేయాకు తోటల కార్మికులు 4 శాతం, ముస్లిములు 10 శాతం ఉంటారు. సంఖ్యల రీత్యా వీరు తక్కువ అయినా, వారి జన సంఖ్యల కేంద్రీకరణ దృష్ట్యా శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలు కీలకం అవుతున్నాయి. 13వ సవరణను పక్కన ఉంచినా ఈ ప్రశ్నలకు దిస్సనాయకే పరిష్కారాలు ఏమిటన్నది ముఖ్యమవుతున్నది.
సింహళీయులకు ఉన్న దేశం ఇదొక్కటే!
ఇంతకూ ఈ విషయాలపై దిస్సనాయకే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఆయనను నేను కొలంబో సమీపాన బట్టరముల్లలో గల జేవీపీ ప్రధాన కార్యాలయంలో 2000లో ఇంటర్వ్యూ చేశాను. అపుడాయన వయసు 30 ఏళ్లే అయినా జేవీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ కూడా. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో ముస్లిముల ప్రస్తావన రాలేదుగానీ తమిళుల ప్రశ్నపై చాలా చెప్పారు. అప్పటినుంచి చాలాకాలం గడిచిన మాట నిజం. తమిళుల ప్రశ్నపై ఇప్పటికీ ఆయన అర్థోక్తులు, అస్పష్టతలను బట్టి చూసినపుడు, ఇంటర్వ్యూ నాటి వివరణలకు ఇంకా విలువ ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.
దిస్సనాయకే అన్నదేమిటో ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా యథాతథంగా అవసరమైన మేర చూద్దాము: ‘గ్రేటర్ ఈలం అనే మాట మొదట ఉపయోగించింది ద్రవిడ కజగం పార్టీ. ఈలం ఏర్పడి దానికి ట్రింకోమలి రాజధాని కావాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గల తమిళులు అంతా తిరిగి వచ్చి ఉత్తర శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడాలని పిలుపునిచ్చారు. హిందీ వ్యతిరేక ఉద్యమకాలంలో ఇందుకు బీజాలు పడ్డాయి. ఇక్కడ కూడా సింహళ భాషా వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. మా జనాభా 13 మిలియన్లు కాగా, తమి ళులు ఇక్కడి రెండు మిలియన్లు, తమిళనాడులోని 60 మిలియన్లు కలిపి మొత్తం 62 మిలియన్లు. మేమిక్కడ మెజారిటీ అయిన మైనారి టీలమనే భావన కలుగుతుంటుంది.
తమిళులు శ్రీలంకను తమ మాతృదేశంగా పరిగణించరు. అపుడ పుడు భారతీయ జెండాను ఎగరవేయటం, అక్కడి నాయకుల ఫొటోలు పెట్టుకోవటం వంటివి చేస్తారు. ఇక్కడి సంస్కృతిని పాటించరు. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి యువకులను రప్పించి సాయుధ శిక్షణలు ఇచ్చింది. తనను తాను పెద్దన్నగా భావించి మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. సింహళీయులమైన మాకు ఉన్న దేశం ఇదొక్కటే. దానిని మేము కాపాడుకోవాలి.
అధికార వికేంద్రీకరణకు మేము వ్యతిరేకం. అది జరిగితే దేశం సింహళ, తమిళ, ముస్లిముల మధ్య మూడు ముక్కలవుతుంది. ఇక్కడి నాగరికతకు, సంస్కృతికి సింహళ బౌద్ధుల మెజారిటీ సంస్కృతే ఆధారం. ఇంగ్లిష్ విద్య వల్ల మాకన్నా చాలా ముందుకు పోయిన తమిళులు తమకు ఇంకా కావాలంటున్నారు. బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని భౌగోళిక విభజనలు చేయగా, అవి తమ హోంల్యాండ్స్ అని వాదిస్తున్నారు. మేము ఎవరికీ వ్యతి రేకం కాదు. శ్రీలంక అందరికీ మాతృ దేశమని చెప్తున్నాం.’ ఇవీ దిస్స నాయకే చెప్పిన మాటలు. ఇవి వారి ఆలోచనలకు, విధానాలకు పునాదిగా ఉంటూ వచ్చాయి. మారిన పరిస్థితులలో ఇందులో మార్పులేమైనా ఉండవచ్చునా?
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment