కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు | Challenges before the new government | Sakshi
Sakshi News home page

కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు

Published Fri, Oct 11 2024 3:06 AM | Last Updated on Fri, Oct 11 2024 3:06 AM

Challenges before the new government

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్‌ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60  శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని  సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్‌ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. 

ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు  మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75  శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45  శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. 

అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్‌ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.

2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్‌ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 

ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్‌ డాలర్ల నుండి  37.40 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్‌లో 51.2  బిలియన్‌ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్‌లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్‌ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. 

ఇందువల్ల ఐఎంఎఫ్‌ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్‌ నాటికి సుమారు 237 మిలియన్‌ డాలర్ల మిగులు బడ్జెట్‌కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్‌ కూడా పెరిగి 44.9 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.

గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60  శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. 

వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్‌ నాడు జరిగిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25  శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. 

అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్‌ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.

అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్‌ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్‌ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌ 4 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. 

గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4  నుండి 6 బిలియన్‌ డాలర్ల  వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్‌ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్‌తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. 

ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్‌తో 2.9 బిలియన్‌ డాలర్ల బెయిలౌట్‌ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్‌ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.

- వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ ‘ 79089 33741
- డా‘‘ గద్దె ఓంప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement