వచ్చే నెలలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
రణిల్, సజిత్, నమల్ మధ్యే పోటీ
ప్రస్తుతానికి ఎవరికీ కని్పంచని మొగ్గు
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...
బరిలో 39 మంది
అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.
రణిల్ విక్రమ సింఘె
ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్‌ఎల్‌పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.
సజిత్ ప్రేమ దాస
మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.
నమల్ రాజపక్స
మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్‌ఎల్‌పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్‌ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్‌ఎల్‌పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.
అనూర కుమార దిస్స నాయకె
నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment