ఆమె జన నేత: బిల్ క్లింటన్
ట్రంప్ షోమ్యాన్, స్వార్ధపరుడు
డెమొక్రటిక్ కన్వెన్షన్లో ధ్వజం
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఫక్తు షోమ్యాన్‌గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.
ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..
హారిస్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమర్‌గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్‌నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్‌డొనాల్డ్స్‌లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్‌గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్‌పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.
అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..
హారిస్ రన్నింగ్‌మేట్‌గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.
ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..
ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్‌కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.
హారిస్‌కు ఓప్రా మద్దతు..
వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్‌ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.
‘‘హారిస్‌ను, ఆమె రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్‌ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్‌ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.
డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..
షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్‌సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.
‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment