అధికారిక నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు దేశాధ్యక్షులు
వాషింగ్టన్: దిగ్గజ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు అమెరికా ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన అధికారిక నివాళుల కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేసి తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. గురువారం వాషింగ్టన్ సిటీలోని జాతీయ చర్చికు కార్టర్ పార్థివదేహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక సంతాప కార్యక్రమాలు పూర్తిచేశారు.
ఈ నివాళుల కార్యక్రమంలో అధ్యక్షుడు బైడెన్‌తోపాటు అగ్రరాజ్య మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులుగా సేవలందించిన ఐదుగురు అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018 డిసెంబర్‌లో మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సంతాప కార్యక్రమానికి ఇలా ఒకే చోట ఐదుగురు అధ్యక్షులు హాజరయ్యారు.
కార్టర్‌కు ఘనంగా అంజలి ఘటిస్తూ బైడెన్ తన సంతాప సందేశం చదివి వినిపించారు. ‘‘ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు తదనంతర కాలంలో ఎలాంటి నిరాడంబర జీవించాలో, హుందాగా ఉండాలో కార్టర్ ఆచరించి చూపారు. అంతర్జాతీయ సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పానికి రాజకీయాలు ఏనాడూ ఆయనకు అడ్డురాలేదు’’ అని బైడెన్ అన్నారు.
నివాళుల కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు సైతం పాల్గొన్నారు. మాజీ అధ్యక్షునిగా నివాళిగా సైనికులు తుపాకులతో ‘21 గన్ సెల్యూట్’ సమర్పించారు. 39వ అధ్యక్షుడిగా సేవలందించిన కార్టర్ 100 ఏళ్లు జీవించి డిసెంబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. కార్టర్ భౌతిక కాయాన్ని మూడు రోజులపాటు అమెరికా పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
గురువారం ఉదయం నేషనల్ క్యాథడ్రల్‌కు తీసుకొచ్చి ఈ అధికారిక నివాళుల కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ అధికారిక వీడ్కోలు కార్యక్రమం గురువారంతో ముగిసింది. తర్వాత కార్టర్ భౌతికకాయాన్ని గురువారం జార్జియాలోని స్వస్థలం పెయిన్స్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భార్య రొజలిన్ కార్టర్ సమాధి పక్కనే కార్టర్‌ను ఖననం చేస్తారు. రోజలిన్ 77 ఏళ్ల వయస్సులో 2023 నవంబర్‌లో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment