jimmy carter
-
రోసాలిన్ కార్టర్ కన్నుమూత
అట్లాంటా(అమెరికా): మానసిక వైద్య సంస్కరణల కోసం అహరి్నశలు కృషిచేసిన మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య, మానవతావాది రోసాలిన్ కార్టర్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల రోసాలిన్ ఆదివారం జార్జియా రాష్ట్రంలోని ప్లేన్స్ నగరంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘నాకు అత్యవసరమైన ప్రతిసారీ సరైన సలహాలిచి్చంది. చక్కని మార్గదర్శిగా ఉంటూ జీవితాంతం తోడుగా నిలిచింది’ అని 99 ఏళ్ల భర్త జిమ్మీ కార్టర్ పేర్కొన్నారు. -
ట్రంప్ అంతకుమించి ఏమీ చేయలేరు!
వాషింగ్టన్: మహమ్మారి కరోనాను కట్టడి చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం విఫలమైందని అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ విమర్శించారు. ప్రాణాంతక వైరస్ కారణంగా లక్షా డెబ్బై వేల మంది అమెరికా పౌరులు మరణించారని, ఆర్థిక సంక్షోభం తలెత్తి వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. నిరుద్యోగం పెరిగిందని, లక్షలాది మంది యువత ఉపాధి లేక విలవిల్లాడుతున్నారని ట్రంప్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఇలాంటి విపత్కర సమయంలో కమాండ్ సెంటర్‌గా ఉండాల్సిన శ్వేతసౌధం.. అధ్యక్షుడి అనుచిత సలహాలతో తుపాను కేంద్రంగా మారిందంటూ విమర్శలు సంధించారు. మరో నాలుగేళ్లు ఆయనకు అధికారం అప్పగిస్తే ఎదుటి వారిపై నిందలు వేయడానికి, ఇతరులపై నోరు పారేసుకోవడానికే సమయం సరిపోదని, అలాంటి వ్యక్తి మెరుగైన పాలన ఎలా అందిస్తారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలు అంటే ట్రంప్‌కు టీవీ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపడం వంటి విషయమని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. (ఇది నా జీవితానికి లభించిన అరుదైన గౌరవం: బిడెన్) కాగా అగ్రరాజ్యంలో నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్‌ను నామినేట్ చేస్తూ డెమొక్రటిక్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బిడెన్ రన్నింగ్మేట్గా కమలా హారిస్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్ మాట్లాడుతూ.. అమెరికాకు పూర్వవైభవం రావాలంటే బిడెన్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రతీ విషయంలోనూ బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్లగల సత్తా ఆయనకు ఉందని పేర్కొన్నారు. ‘‘మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి గ్రామీణ అమెరికాను పట్టణాలతో కలపడం, నల్లజాతీయులు, స్థానిక అమెరికన్లు, మహిళలు, వలసదారులు, ఇతర వర్గాలన్నింటినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసి సమతౌల్య సమాజ నిర్మాణానికి పాటుపడటం, క్లైమేట్ చేంజ్, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించడం, వినూత్న ఆర్థిక విధానాలతో చిరు వ్యాపారులను ఆదుకోవడం వంటి అనేకానేక ప్రణాళికలతో బిడెన్ ముందుకు వచ్చారు. (డెమోక్రాటిక్ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్) ఇలాంటి పనిచేసే అధ్యక్షుడు కావాలో లేదా సోషల్ మీడియాలో ఇతరులను పదే పదే కాల్చుకు తింటూ తన వైఫల్యాలను ఇతరులపైకి నెట్టివేసే ట్రంప్ కావాలో మీరే నిర్ణయించుకోండి. దేశ భవిష్యత్తు మీ చాయిస్ మీదే ఆధారపడి ఉంది’’అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ.. అమెరికా గొప్పదనాన్ని, చరిత్రను నిలబెట్టగల సత్తా జో బిడెన్‌కే ఉందన్నారు. అనుభవం, ఇతరులతో హుందాగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీకి మారుపేరు. నిబద్ధతతో పనిచేసే నాయకుడు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు బాధ్యతాయుతంగా వ్యవహించే వ్యక్తి. ప్రస్తుతం దేశానికి ఇలాంటి నాయకుడే కావాలి. ఆయన అవసరం దేశానికి ఎంతగానో ఉంది’’అని పేర్కొన్నారు. -
అగ్రరాజ్యాధీశుల భారతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్‌ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్‌కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం.. డ్వైట్ డి ఐసన్‌హోవర్, 1959 డిసెంబర్ 9 – 14 సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్‌హోవర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రిచర్డ్ ఎం నిక్సన్, 1969 జూలై–31 1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్‌కే కొమ్ముకాశారు. జిమ్మీ కార్టర్, 1978 జనవరి 1 – 3 1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు. బిల్ క్లింటన్, 2000 మార్చి 19–25 ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. జార్జ్ డబ్ల్యూ బుష్, 2006 మార్చి 1–3 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది. బరాక్ ఒబామా 2010, 2015 2010, నవంబర్ 6–9 2015, జనవరి 25–27 అమెరికా, భారత్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్‌తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్‌తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్‌కు ప్రకటించారు. -
ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు
వాషింగ్టన్ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా, మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (సీనియర్) జిమ్మీ కార్టర్లు శనివారం టెక్సాస్‌లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. డెమోక్రాట్ పార్టీ నుంచి బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మి కార్టర్లు, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్, జార్జి డబ్ల్యూ బుష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ (93) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్‌తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
నేను ఉత్తర కొరియా వెళ్తా..!
న్యూయార్క్ : అమెరికా-ఉత్తర కొరియాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (93) ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన వెబ్సైట్లో ప్రకటించింది. అందులో భాగంగా ఆయన ఉత్తర కొరియాకు వెళుతున్నట్లు ఆ వార్తా సంస్థపేర్కొంది. దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలోనే జిమ్మీకార్టర్ ఉత్తరికొరియా వెళుతున్నట్లు సదరు సంస్థ తెలిపింది. డెమోక్రాట్ పార్టీకి చెందిన జిమ్మీ కార్టర్ 1977 నుంచి 1981 వరకూ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మ్యాక్మాస్టర్కు కార్టర్ సన్నిహిత మిత్రుడు. అతని కోరిపైనే కార్టర్ పనికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కార్టర్ వాషింగ్టన్లో మాట్లాడుతూ.. అమెరికా-ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం చూస్తుంటే నాకు భయంగానే ఉంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న అనుమానం వెంటాడుతోందన్నారు. ఉత్తర కొరియాను చైనా అధికంగా ప్రభావితం చేస్తోందన్న భ్రమలో అమెరికా ఉంది.. ఇదేమంత సమజసం కాదని కార్టర్ తెలిపారు. -
మాజీ అధ్యక్షుడికి కేన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మెదడు కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తనకు రేడియేషన్, కెమోథెరపీ మూడు వారాలకోసారి జరుగుతాయని ఆయన అన్నారు. వాస్తవానికి మొట్టమొదట ఎమ్మారై తీయించుకుని.. తనకు కేన్సర్ ఉందన్న విషయం తెలుసుకున్న తర్వాత మరికొద్ది వారాలు మాత్రమే బతుకుతానేమో అనుకున్నానని చెప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం చాలా సాధారణంగానే ఉన్నానని, పూర్తిస్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, సరికొత్త సాహసాలు చేయడానికి ఎదురు చూస్తున్నానని జిమ్మీ కార్టర్ తెలిపారు.