కార్టర్‌పురీ(గురుగ్రామ్): అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు మీద భారత్‌లో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలీదు. 46 సంవత్సరాల క్రితం అంటే 1978 జనవరి మూడో తేదీన హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలోని దౌల్తాబాద్ నసీరాబాద్ గ్రామంలో జమ్మీ కార్టర్ దంపతులు పర్యటించారు. కార్టర్ పర్యటించిన ఆ గ్రామం పేరును నాటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సిఫార్సు మేరకు కార్టర్‌పురీగా నామకరణంచేశారు. అంతకుపూర్వం ఈ గ్రామాన్ని ఖేదాగానూ సమీప గ్రామస్తులు పిలిచేవారు. కార్టర్ మరణవార్త తెల్సి కార్టర్‌పురీ గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు.
‘‘మా గ్రామం సొంత కుమారుడితో సమానమైన కార్టర్‌ను కోల్పోయింది’’అని కార్టర్‌పురీ గ్రామ మాజీ సర్పంచ్ యద్రామ్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కార్టర్ తల్లి లిలియాన్ 1960వ దశకంలో శాంతిదళాలతో కలిసి భారత్‌లో ఆరోగ్యకార్యకర్తగా సేవలందించారు. జైల్‌దార్ సర్ఫరాజ్‌కు చెందిన ఒక భవనంలో ఉంటూ లిలియాన్ సామాజిక కార్యకర్తగా చిన్నారులకు సేవచేశారు. వైద్యసాయం అందించారు.
‘‘కార్టర్ మా గ్రామానికి వచ్చినపుడు ఆయన భార్య రోసాలిన్ సంప్రదాయ భారతీయ గ్రామీణ కట్టుబొట్టులో వచ్చి అందరితో కలిసిపోయారు. కార్టర్ దంపతులు గ్రామంలో కలియతిరిగారు. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అయితే ఆ తర్వాతి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాయి. అయినా కార్టర్‌పై మాప్రేమ అలాగే ఉంది. 2003లో కార్టర్‌కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకున్నాం. గతంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ నుంచి ప్రత్యేక బృందం మా గ్రామంలో సందర్శించింది’’అని గ్రామస్థులు చెప్పారు. భారత్‌లో ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో జనతాపార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్టర్ భారత్‌లో పర్యటించారు. ఎమర్జెన్సీ తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి ప్రెసిడెంట్ ఈయనే. ఈ సందర్భంగా భారత పార్లమెంట్‌లోనూ కార్టర్ 1978 జనవరి రెండో తేదీన ప్రసంగించారు.
100 ఇళ్ల నిర్మాణంలో చేయూత
మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పటాన్ గ్రామంలో దిగువ తరగతి వర్గాల కోసం 2006 ఏడాదిలో వంద ఇళ్ల నిర్మాణం కోసం కార్టర్ ఎంతో సాయపడ్డారు. ఆ ఏడాది అక్టోబర్‌లో ఒక వారంపాటు ఇక్కడే ఉండి పనుల్లో మునిగిపోయారు. స్వయంగా కార్పెంటర్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మంది అంతర్జాతీయ, స్థానిక వలంటీర్లు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులూ తమ వంతు కృషిచేశారు. 1984 ఏడాది తర్వాత ప్రతి ఏటా ఒక వారం పాటు సమాజసేవకు కార్టర్ కేటాయించారు. ‘‘67 ఏళ్ల తల్లి లిలియాన్‌తో కలిసి నేను విఖ్రోలీలో కుషు్టరోగుల కాలనీలో సేవచేశా’’అని కార్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కార్పెంటరీ, లేబర్ పనుల్లో ఆరితేరిన కార్టర్ న్యూయార్క్‌లోనూ ఒక భవంతి ఆధునీకరణ పనుల్లో పాలుపంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment