ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
మొహాలీ నుంచి ఐర్లాండ్‌కు
సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్‌మెంట్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
సౌతాఫ్రికాపై శతకం బాది
అద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం బాది సంచలనం సృష్టించాడు.
ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది.
భార్య కాలేయదానం
కాగా సిమి భార్య అగమ్‌దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్‌లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్‌కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment