
ఐదుగురికి గాయాలు
తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన భారత్
ఢిల్లీలో శ్రీలంక రాయబారిని పిలిపించి నిరసన తెలిపిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్ సీరియస్‌గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.
‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.
అసలేం జరిగింది?
మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్‌ట్ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment