ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. ఇంతకి ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం? పదండి.
ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచంలోనే వ్యాపారం చేయడంలో గుజరాతీలను మించిన వారు లేరని అంటారు. కాబట్టే మన దేశంతో పాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం, కఛ్ జిల్లా, భుజ్ తాలూకాలో మధాపర్ గ్రామం మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది.
ఈ గ్రామ వాసుల డిపాజిట్లు మొత్తం రూ.7,000 కోట్లకు పైమాటే. గణాంకాల ప్రకారం.. మధాపర్ జనాభా 2011లో 17,000 నుండి దాదాపు 32,000గా ఉంది. ఈ ఊరిలోనే హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్‌తో పాటు మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కలిపి 17కి పైగా ఉన్నాయి. అయినప్పటికీ, ఇతర బ్యాంకులు సైతం ఈ ఊరిలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సంపన్న గ్రామంగా అవతరించడానికి కారణం
మధాపర్ సంపన్న గ్రామంగా అవతరించడానికి ఎన్‌ఆర్‌ఐలే కారణమని తెలుస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న ఆ ఊరి ప్రజలు గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో ప్రతిఏటా కోట్ల మొత్తంలో డబ్బులు డిపాజిట్లు చేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని నిర్మాణ వ్యాపార రంగాల్లో గుజరాతీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఊరిలో మిగిలిన వారు యూకే,ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు.
ఊరికి ఏదో ఒకటి చేయాలని
ఈ సందర్భంగా చాలా మంది గ్రామస్తులు విదేశాలలో నివసిస్తున్నారు. పని చేస్తున్నప్పటికీ, వారు తమ గ్రామ అభివృద్దికి అండగా నిలుస్తున్నారని, వారు నివసించే ప్రదేశంలో కాకుండా మధాపర్ గ్రామంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు పరుల్బెన్ కారా తెలిపారు.
సకల సౌకర్యాలకు నిలయంగా
గ్రామంలోని జాతీయ బ్యాంకు స్థానిక బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ భారీగా డిపాజిట్లు రావడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. నీరు, పారిశుధ్యం, రహదారి వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. బంగ్లాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సరస్సులు, దేవాలయాలు ఉన్నాయని మేనేజర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment