Daulatabad
-
ఇక్కడి బడి, గుడి నేను కట్టించినవే: రేవంత్ రెడ్డి
వికారాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు.. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.' రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
చిన్నారిని చంపి తల్లి ఆత్మహత్య
దౌల్తాబాద్ : ఏడాది వయసున్న కుమారుడిని చంపేసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దౌల్తాబాద్ మండలం కుదురుమళ్లలో శనివారం చోటుచేసుకొంది. సీఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నీలి శ్రీనివాస్ హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన మల్లిక (24) పని చేస్తుండేది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరైనా వారిద్దరూ 2017 డిసెంబర్లో యాదాద్రిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి సాత్విక్ (1) జన్మించాడు. హైదారాబాద్‌లో వారి కాపురం సజావుగా సాగుతోంది. అయితే మార్చి నెలలో లాక్డౌన్ విధించడంతో భార్యాభర్తలు బాబుతో కలిసి కుదురుమళ్లకు వచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భర్త శ్రీనివాస్, అత్తామామ బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా మల్లిక ఫ్యాన్‌కు వేలాడుతుండగా ఏడాది బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన భర్త శ్రీనివాస్ వెంటనే భార్య మృతదేహాన్ని కిందకు దించాడు. అయితే కుమారుడిని గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే శ్రీనివాస్ అంతకుముందే ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఆమెతో ఆరు నెలలు కాపురం చేసి వదిలేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ విశ్వజాన్ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. -
గురుకులం.. సమస్యలతో సతమతం
దౌల్తాబాద్ : మండలంలోని బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 25 ఏళ్ల క్రి తం ప్రారంభించిన ఈ గురుకులంలో తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు సుమారు 672 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. గురువారం సా క్షి పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. కొన్న ఏళ్లుగా నీళ్ల చారు, చారును మరిపించే పప్పును వండుతున్నారని, ఉడికీ ఉడకని అన్నాన్ని రోజూ వడ్డిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్లిన, దెబ్బ తిన్న అరటిపండ్లు సరఫరా చేస్తూ అవి కూడా వారానికి ఎప్పుడో ఒకసారి అందిస్తున్నట్లు తెలిపారు. సాంబారు, పప్పుకు ఎక్కువగా కుళ్లిన కూరగాయలనే వాడుతూ వాటినే తమకు పెడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. బియ్యంలో చిన్న చిన్న రాళ్లతో పాటు చెత్తాచెదారం ఉండడంతో తినడానికి ఇబ్బదులు పడుతున్నట్లు వివరించారు. చివరకు పెరుగు అన్నం తిందామన్నా వాటిలో కూడా నీళ్ల శాతమే ఎక్కవగా ఉంటుందని తెలిపారు. అలాగే తమకు సరఫరా అయ్యే పాలల్లో అధిక శాతం ఉపాధ్యాయులకే సరఫరా అవుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. గురుకులంలో ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో చెట్లు, గుట్టలు పడతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్నానాల గదులు నీళ్లులేక నిరుపయోగంగా మారాయని, దీంతో ఆరుబయట నీళ్ల ట్యాంక్‌ల వద్ద స్నానాలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇంటర్ విద్యార్థులకు తప్పని తిప్పలు : ఇక్కడ రెండేళ్ల క్రితం ఇంటర్ మీడియట్ తరగతులను ప్రారంభించారు. ఇందులో 86 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక వంటశాల లేకపోవడంతో పాఠశాల విద్యార్థులతో పాటే భోజనాలు చేయిస్తున్నారు. దీంతో పాఠశాల, ఇంటర్ విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
కరువు మండలాలు రెండే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ద్వారా గత జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కరువు మండలాల జాబితా రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం 119 మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చారు. జిల్లా నుంచి రెండు మం డలాలకు జాబితాలో చోటు దక్కింది. లోటు వర్షపాతం, వర్షాభావం, పంటల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీ కరువు ప్రభావిత మండలాల జాబితా సిద్ధం చేసింది. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు దౌల్తాబాద్‌లో మైనస్ 36 శాతం, వెల్దుర్తిలో మైనస్ 22.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనిని పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, రెవెన్యూ శాఖల నుంచి సేకరించిన వివరాలు క్రోడీకరించి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో చాలా చోట్ల రైతులు పంట నష్టపోయారు. దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాల్లోనూ భారీ వర్షాల వల్ల చేతికందే సమయంలో పంటలు నేల పాలయ్యాయి. అటు కరువు, ఇటు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంపిక చేసిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంటూ జిల్లా గెజిట్‌లో నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రైతులకు రుణ, ఇతర సదుపాయాలు కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేరకు అమలవుతాయో చూడాల్సిందే.