సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి..
మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్‌వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది.
‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు.
గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది.
జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది.
రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు.
సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము.
– సుల్తానా, అంగన్‌వాడి టీచర్
ఆమె సాయం మరువలేనిది
అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది.
–షేక్ జానీ బి, సయ్యద్ నగర్
అమ్మలా తోడైంది
అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను.
– బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం
– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment