siddipet distric
-
రక్షకులకు ఆరోగ్య రక్షణ
రేయింబవళ్లు సవాళ్ల మధ్య పనిచేసే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే విధులు నిర్వర్తించగలరు. అందుకోసం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నారు. ఇందుకోసం గతేడాది నుంచి ఆరు నెలలకోసారి 56 రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, రక్తపోటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది జీవన శైలి, వారి ఆరోగ్య అలవాట్లలో మార్పులను తెలియజేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేటగతేడాది నుంచి ఆరోగ్య రక్షణ గతేడాది జనవరి నుంచి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీసులకు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణ కలి్పస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి జీవన శైలి ఆధారంగానే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వస్తుంటాయి. వీటిబారిన పోలీసులు పడకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నాలుగు రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 1,449 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. మూడు రకాలుగా విభజన మొదట సిబ్బందికి ఎత్తు, బరువు, నడుం చుట్టుకొలత, రక్తపోటు పరిశీలిస్తున్నారు. పరీక్షల తర్వాత పోలీస్ సిబ్బందిని మూడు విభాగాలుగా విభజించనున్నారు. సాధారణ ఆరోగ్యవంతులు, భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు, ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇలా గుర్తిస్తున్నారు. వీరికి మెడికల్ కళాశాల, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మొదట అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడతల వారీగా వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు సైతం రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంతో ఉపయోగకరం పోలీసుల ఆరోగ్య రక్షణకు ఈ హెల్త్ ప్రొఫైల్ ఎంతో ఉపయోగపడుతోంది. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా గతేడాది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించారు. అప్పటి నుంచి పోలీసులకు ఆరు నెలలకోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు.హెల్త్ ప్రొఫైల్‌తో ఎన్నో ప్రయోజనాలు గత ఏడాది నుంచి మాకు రక్త పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్‌ను అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే తెలిసిపోతుంది. పోలీస్ అధికారులు సిబ్బందికి ఉచితంగా హెల్త్ ప్రొఫైల్ నిర్వహించడం సంతోషకరం. – ఉమేశ్, ఏఎస్ఐ, ట్రాఫిక్ సిద్దిపేటసిబ్బంది ఆరోగ్యమే ముఖ్యం సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. నివేదికల ఆధారంగా మూడు విభాగాలుగా విభజిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులతో సలహాలు ఇప్పిస్తున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ అనురాధ, సీపీ -
ఒగ్గు పూజారుల ఘర్షణ
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో ఒగ్గు పూజారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధి చెందిన రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద.. పూజల విషయమై ఒగ్గు పూజారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పూజారులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గంగరాజు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పూజల విషయమై కొన్నేళ్లుగా వివాదం.. రేకులకుంట మల్లన్న ఆలయంలో కొన్నేళ్లుగా ఒగ్గు పూజారుల మధ్య పూజల విషయమై వివాదం నెలకొంది. చెరుకూరి వంశానికి చెందిన 26 మంది, కోటి వంశంవారు 22 మంది, పయ్యావుల వంశం వాళ్లు 10 మంది పూజలు చేయడంతోపాటు పట్నాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల వంశం పూజారులు తాము 10 మందిమే ఉన్నామని, మరో 10 మందికి అవకా«శం ఇవ్వాలని కోరడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పయ్యావుల వంశంవారు దేవాదాయ శాఖ నుంచి కొత్తగా 10 మంది పూజలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారని ఈఓ తెలిపారు. దీంతో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద పూజలు చేస్తున్న కొత్తవారిని పాత పూజారులు నిలదీయంతో ఘర్షణ మొదలైంది. పరిస్థితి చేయిదాటిపోయి దాడులకు దిగారు. ఈ ఘటనతో ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాడుల విషయంలో పూజారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది
-
కొత్తరాతి యుగానికి చెందిన మట్టిబొమ్మ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాతి యుగానికి చెందిన అరుదైన మట్టిబొమ్మ సిద్దిపేటలో దొరికింది. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారు పాటిగడ్డలో కొలిపాక శ్రీనివాస్ ఈ బొమ్మను గుర్తించారు. ఆదిమానవులకు సంబంధించిన అనేక ఆధారాలను అందించిన నర్మెట్టలోనే ఇదీ దొరకటం విశేషం. క్రీ.పూ.6500 నుంచి క్రీ.పూ.1800 మధ్య కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ మట్టి బొమ్మ కొంతమేర విరిగి ఉంది. 6సెం.మీ. పొడవున్న ఈ బొమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకులు కర్ణాటకకు చెందిన రవి కొరిసెట్టర్ చెప్పారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనీ్వనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న మెహర్‌ఘర్ ప్రాంతంలో గతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన బొమ్మలను ఇది పోలి ఉందన్నారు. నంగునూరు–నర్మెట్ట మధ్య 6కి.మీ. పరిధిలో ఆదిమానవుల మనుగడను రూఢీ చేసే ఆధారాలు విస్తారంగా వెలుగు చూస్తున్నాయని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. చదవండి: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
ములుగు మండలం లో ప్రేమజంట ఆత్మహత్య
-
మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!
సాక్షి, హైదరాబాద్: సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయటపడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది. ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ సేకరించిన కొన్ని వస్తువుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగో పాల్ పేర్కొ న్నారు. తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు. దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు దారం వడికే మట్టికదురు.. టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్ ఉన్న పెంకులు లభించాయన్నారు. (చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!) -
Tourist Spot: కొత్తదంపతులు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు..
స్వయంబువుగా వెలిసిన కొమురెల్లి మల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారం. చందమామలాంటి బిడ్డనిచ్చి ఒడినింపుతాడని నమ్మకం. మల్లన్నకు ఉయ్యాల కడితే ఇంట్లో ఉయ్యాల ఊగుతుందని విశ్వాసం. అందుకే... ఉయ్యాల కట్టి మరీ మల్లన్నకు మొక్కుతారు. నూతన దంపతులు కొమురెల్లి మల్లన్నను దర్శించుకుంటే పండండి బిడ్డ నట్టింట నడయాడుతుందని నమ్ముతారు భక్తులు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం కుందారం గ్రామంలో కొలువైన స్వయంభువు కొమురెల్లి మల్లన్న. కడుపు పండాలని మల్లన్నకు మొక్కి, కొత్త గుడ్డలో కొబ్బరికాయను కట్టి చెట్టుకు వేళ్లాడదీస్తారు. ఈ ఆలయంలోని చెట్ల కొమ్మలు నిండుగా ఈ ఉయ్యాలలే కనిపిస్తాయి. కుందారం గ్రామంలో పదేళ్ల కిందట కాకతీయుల కాలం నాటి కొమురెల్లి మల్లన్న విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా మారింది. కార్తీకమాసం మొదలైంది. ఇక శివుని కోవెలలన్నీ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఈ టూర్లో శివ్వారంలోని మొసళ్ల మడుగును కూడా కవర్ చేయవచ్చు. – వేముల శ్రవణ్‌కుమార్, సాక్షి, మంచిర్యాల చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో అంగన్వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్’ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు. ఎన్ఐఎన్ నిర్ధారణతో... సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్ వేవ్ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కిట్స్‌లో ఇలా ►జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు. ►వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్ పంపిణీ చేయనున్నారు. ►కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్ పౌడర్, విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి. -
తండ్రిని చంపిన కొడుకు
అక్కన్నపేట (హుస్నాబాద్): భూ వివాదం వల్ల కన్న తండ్రిని కొడుకే హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లునావత్ సోమ్లానాయక్ (70), అతని కుమారుడు సమ్మయ్యకు మధ్య ఎనిమిదేళ్లుగా భూ తగాదాలు నడుస్తున్నాయి. సోమ్లాకు ముగ్గురు కుమారులు ఉండగా ఒక కుమారుడు కొంతకాలం కిందట మృతి చెందాడు. ఆస్తి పంపకంలో తన వాటా ఇంకా రావాల్సి ఉందని పెద్ద కొడుకు సమ్మయ్య.. తండ్రితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట పొలం వద్ద తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సమ్మయ్య ఆదివారం పొలం నుంచి ఇంటికి వస్తున్న తండ్రిని మార్గమధ్యలో కర్రతో తలపై బలంగా కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కొడుకు సమ్మయ్య, కోడలు లక్ష్మి పరారీలో ఉన్నారని ఎస్సై రవి తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. -
ఏందయ్యా.. చెబితే అర్థంకాదా?
సాక్షి, సిద్దిపేట: ‘ఏందయ్యా.. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోరా’అని రోడ్ల పై తిరుగుతున్న వాహనదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు క్లాస్ పీకారు. సోమ వారం సిద్దిపేటలో ద్విచక్ర వాహనదారులు వెళుతుండటాన్ని గమనించి ఆపారు. ఈ సం దర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్ నివారణకు మందు లేదు.. స్వీయ నిర్బంధం.. భౌతిక దూరం పాటించడమే సమస్యకు పరిష్కారం. ఈ వైరస్ నుం చి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు’అని మండిపడ్డారు. అధికారులు ప్రమాదం పొంచి ఉం దని తెలిసినా లెక్క చేయకుండా మీ కోసం పని చేస్తున్నా.. సహకరించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోకపోతే కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. కాగా, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించాలని మంత్రి కోరారు. -
‘ఆర్టీసీ ఉద్యమం అమ్ముడుపోయే సరుకు కాదు’
సాక్షి, సిద్ధిపేట: ఆర్టీసీ కార్మికుల ఉద్యమం సీఎం కేసీఆర్ పతనానికి నాంది పలుకుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం బీజేపీ సిద్ధిపేట జిల్లా కార్యాలయం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలనే పరిష్కరించాలని కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. ‘ఆర్టీసీ తో మంట పెట్టించుకున్నావ్ జాగ్రత్త.. ఆ మంటల్లో కాలి పోయే రోజు వస్తుందని’ హెచ్చరించారు. కేసీఆర్ పాలనకు తగిన గుణపాఠం చెప్పేది బీజేపీ పార్టీయేనని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమం మంత్రుల కోసమో చైర్మన్ల కోసమో అమ్ముడుపోయే సరుకు కాదన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. 33 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేరకపోతే డిస్మిస్ చేస్తానంటున్నావ్.. సచివాలయానికి రాని మిమ్మల్ని ఎన్ని సార్లు డిస్మిస్ చేయాలని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ముఖ్యమంత్రి జీతాలు ఆగలేదు కానీ, ఆర్టీసీ కార్మికుల జీతాలు మాత్రం ఎందుకు ఆపారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బర్త్ డే కేక్ తిని.. కుటుంబంలో విషాదం
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే కేక్ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేక్ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి సోదరుడు బుధవారం రాత్రి బస్సులో ఈ కేక్‌ను పంపించినట్టు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా విరోధమున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు పంపించిన కేక్‌లో విషం కలిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
సాక్షి, గజ్వేల్: కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి వైద్యుల బృందం 5కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. గురువారం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిపి కణితిని తొలగించారు. ఆర్వీఎం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్ జిల్లా మండల కేంద్రమైన ఏదులాబాద్ గ్రామానికి చెందిన మండీ లక్ష్మయ్య భార్య సువర్ణ గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆమె ఆర్వీఎం ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆర్వీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వైద్య నిపుణులు డాక్టర్.మంజుల, డాక్టర్.స్వాతి, డాక్టర్.కవితలతో పాటు మత్తు డాక్టర్లు రవీందర్, విజయ్, వంశీ ఇతర వైద్య సిబ్బందితో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి ఆ మహిళ కడుపులోనుంచి 5 కిలోలకు పైగా బరువుగల పెద్ద కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబీకులు, గ్రామస్తులు ఆర్వీఎం ఆసుపత్రి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శస్త్రచికిత్స సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. రోగి పూర్తిగా కోలుకుంటుందని వైద్యుల బృందం పేర్కొంది. -
‘దేశంలో రూ. 2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే’
సాక్షి, సిద్దిపేట: దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 130 కోట్ల జనాభాలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్లో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 6 నెలల నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. పెరిగిన పెన్షన్ పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ పెన్షన్లను రెట్టింపు చేసి పేదలకు ఆసరాగా నిలుస్తున్నారన్నారు హరీశ్ రావు. 57 ఏండ్లు నిండిన వారితో పాటుగా.. కొత్తగా పీఎఫ్ వచ్చిన బీడీ కార్మికులను కూడా గుర్తించి పెరిగిన పెన్షన్లు అందిస్తామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బంద్ చేయాలని కోరారు. త్వరలోనే అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూంలు ఇస్తామని స్పష్టం చేశారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. సిద్దిపేట పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచాలని హరీశ్ రావు కోరారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
సాక్షి, సిద్దిపేటటౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తామని డ్యూటీ డాక్టర్ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు: తలసాని
కొమురవెల్లి (సిద్దిపేట): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాలం దగ్గర పడిందని, రాబోయే ఎన్నికల్లో అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం వీఐపీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ చంద్రబాబు అని అన్నారు. ఆయన స్వార్థ రాజ కీయ ప్రయోజనాల కోసం ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని సంసారం చేసి విడాకులు తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం చూస్తుంటే చంద్రబాబుకు కానరావడం లేదని, ఆయన వంకర బుద్ధికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్ గౌరవం చాటాలె..
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: ‘మీ బిడ్డగా ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్లా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు గజ్వేల్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశా. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి గజ్వేల్ గౌరవాన్ని చాటాల’ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందకు పైగా సీట్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌కు ఓ ప్రత్యేకత ఉందని... ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్లు లేని కుటుంబం ఉండరాదనేదే లక్ష్యంతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నాని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ తల్లి దీవెనతో ప్రాజెక్టు పూర్తవుతుందని.. రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సాగునీరు పుష్కలంగా ఉంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు నూరు శాతం సబ్సిడీతో అందజేస్తామని వివరించారు. అవసరమైతే మండలానికో చిల్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు లాభసాటిగా ఉండేలా చేస్తామన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పెట్టుకొని పండిన పంటలకు డిమాండ్ ధర వచ్చేలా చూస్తామన్నారు. కాలుష్యం లేని పరిశ్రమలు తెస్తాం రానున్న రోజుల్లో గజ్వేల్ రూపురేఖలు మారిపోతాయని.. భూములకు ఆకాశాన్నంటే విధంగా రేట్లు వస్తాయన్నారు. గజ్వేల్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని కేసీఆర్ వివరించారు. అయితే కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని.. దళితులు, గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామన్నారు. దేశం మొత్తం బడ్జెట్లో మైనార్టీలకు రూ. 4వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ఒక్క తెలంగాణలోనే రూ. 2వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వివరించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. దొంగ సర్వేలు చూపించి గోల్మాల్ చేస్తున్నారని.. వారి మాటలు పట్టించుకోవద్దని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలుంటాయని.. గిరిజనుల తండాల్లో వారే సర్పంచ్‌లుగా ఎన్నుకోబడుతారన్నారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ వద్దు.. సిద్దిపేట ముద్దు
బెజ్జంకి: బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలోనే కలపాలని యూత్‌నాయకులు బెజ్జంకి క్రాసింగ్ వద్ద సోమవారం రాస్తారోకో చేశారు. సిద్దిపేట జిల్లాలో ఉండడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, మండలం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సబబుకాదన్నారు. 25కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటను కాదని కరీంనగర్ ఎలా కలుపుతారని ప్రశ్నించారు. సిద్దిపేటలో కలిపే వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బండిపెల్లి రమేష్, మాజీ సర్పంచ్ రెడ్డివేని వినోద్‌కుమార్, బండిపెల్లి శ్రీనివాస్, బొడిగె అనిల్, ఐలేని నర్సింహరెడ్డి, వంగల నరేష్, కత్తి అనిల్, రవి, మల్లేశం, అజయ్, మున్నా, శ్రీనివాస్, బొడిగే శ్రీను, బామండ్ల శ్రీను పాల్గొన్నారు.