సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు
హోంగార్డు నుంచి అదనపు డీసీపీల వరకు..
ఆరోగ్యపరంగా మూడు కేటగిరీలుగా విభజన
సలహాలు, సూచనలు చేస్తున్న వైద్యులు
రేయింబవళ్లు సవాళ్ల మధ్య పనిచేసే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే విధులు నిర్వర్తించగలరు. అందుకోసం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నారు. ఇందుకోసం గతేడాది నుంచి ఆరు నెలలకోసారి 56 రకాల రక్త పరీక్షలు, ఈసీజీ, రక్తపోటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది జీవన శైలి, వారి ఆరోగ్య అలవాట్లలో మార్పులను తెలియజేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట
గతేడాది నుంచి ఆరోగ్య రక్షణ
గతేడాది జనవరి నుంచి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీసులకు ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణ కలి్పస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి జీవన శైలి ఆధారంగానే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వస్తుంటాయి. వీటిబారిన పోలీసులు పడకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నాలుగు రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 1,449 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మూడు రకాలుగా విభజన
మొదట సిబ్బందికి ఎత్తు, బరువు, నడుం చుట్టుకొలత, రక్తపోటు పరిశీలిస్తున్నారు. పరీక్షల తర్వాత పోలీస్ సిబ్బందిని మూడు విభాగాలుగా విభజించనున్నారు. సాధారణ ఆరోగ్యవంతులు, భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారు, ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇలా గుర్తిస్తున్నారు. వీరికి మెడికల్ కళాశాల, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మొదట అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడతల వారీగా వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు సైతం రక్త పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంతో ఉపయోగకరం
పోలీసుల ఆరోగ్య రక్షణకు ఈ హెల్త్ ప్రొఫైల్ ఎంతో ఉపయోగపడుతోంది. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా గతేడాది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించారు. అప్పటి నుంచి పోలీసులకు ఆరు నెలలకోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు.
హెల్త్ ప్రొఫైల్‌తో ఎన్నో ప్రయోజనాలు
గత ఏడాది నుంచి మాకు రక్త పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్‌ను అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే తెలిసిపోతుంది. పోలీస్ అధికారులు సిబ్బందికి ఉచితంగా హెల్త్ ప్రొఫైల్ నిర్వహించడం సంతోషకరం.
– ఉమేశ్, ఏఎస్‌ఐ, ట్రాఫిక్ సిద్దిపేట
సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యం
సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. నివేదికల ఆధారంగా మూడు విభాగాలుగా విభజిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులతో సలహాలు ఇప్పిస్తున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ అనురాధ, సీపీ
Comments
Please login to add a commentAdd a comment