సాక్షి, సిద్ధిపేట: ఆర్టీసీ కార్మికుల ఉద్యమం సీఎం కేసీఆర్ పతనానికి నాంది పలుకుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం బీజేపీ సిద్ధిపేట జిల్లా కార్యాలయం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలనే పరిష్కరించాలని కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. ‘ఆర్టీసీ తో మంట పెట్టించుకున్నావ్ జాగ్రత్త.. ఆ మంటల్లో కాలి పోయే రోజు వస్తుందని’ హెచ్చరించారు.
కేసీఆర్ పాలనకు తగిన గుణపాఠం చెప్పేది బీజేపీ పార్టీయేనని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమం మంత్రుల కోసమో చైర్మన్ల కోసమో అమ్ముడుపోయే సరుకు కాదన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉసురు ఊరికే పోదన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. 33 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేరకపోతే డిస్మిస్ చేస్తానంటున్నావ్.. సచివాలయానికి రాని మిమ్మల్ని ఎన్ని సార్లు డిస్మిస్ చేయాలని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ముఖ్యమంత్రి జీతాలు ఆగలేదు కానీ, ఆర్టీసీ కార్మికుల జీతాలు మాత్రం ఎందుకు ఆపారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment