సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ భయపడిపోయారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని విమర్శించారు. మోదీ సర్కార్‌పై విమర్శలకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకున్నారన్నారు.
బుధవారం పార్టీ నాయకులు జయశ్రీ,, కొల్లి మాధవి, జె.సంగప్ప, ఎన్వీ సుభాష్‌లతో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా సాగాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీలో మరోసారి స్పష్టమైందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీపైనే విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్‌ఎస్ పూర్తిగా కబ్జా చేయడంతో రాష్ట్రం నుంచి ఆ పార్టీ కనుమరుగు కానుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment