రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు
పది మందికి తీవ్ర గాయాలు
రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లాలో ఘటన
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో ఒగ్గు పూజారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధి చెందిన రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద.. పూజల విషయమై ఒగ్గు పూజారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
పూజారులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ గంగరాజు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పూజల విషయమై కొన్నేళ్లుగా వివాదం..
రేకులకుంట మల్లన్న ఆలయంలో కొన్నేళ్లుగా ఒగ్గు పూజారుల మధ్య పూజల విషయమై వివాదం నెలకొంది. చెరుకూరి వంశానికి చెందిన 26 మంది, కోటి వంశంవారు 22 మంది, పయ్యావుల వంశం వాళ్లు 10 మంది పూజలు చేయడంతోపాటు పట్నాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల వంశం పూజారులు తాము 10 మందిమే ఉన్నామని, మరో 10 మందికి అవకా«శం ఇవ్వాలని కోరడంతో వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో పయ్యావుల వంశంవారు దేవాదాయ శాఖ నుంచి కొత్తగా 10 మంది పూజలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారని ఈఓ తెలిపారు. దీంతో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద పూజలు చేస్తున్న కొత్తవారిని పాత పూజారులు నిలదీయంతో ఘర్షణ మొదలైంది.
పరిస్థితి చేయిదాటిపోయి దాడులకు దిగారు. ఈ ఘటనతో ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాడుల విషయంలో పూజారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment