![Father and sons passed away in accident](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/accident.jpg.webp?itok=5wtRiggD)
స్కూటీపై వెళ్తుండగా అతివేగంతో ఢీ
మరో కుమారుడికి గాయాలు
ఒడి బియ్యం పోసుకునేందుకుఅత్తగారింటికి వెళ్తుండగా ప్రమాదం
దౌల్తాబాద్ మండలంలో ఘటన
దుబ్బాక : ఒడి బియ్యం పోసుకునేందుకు సంతోషంగా అత్తగారింటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి వద్ద చోటు చేసుకుంది.
ఎస్‌ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్ కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు చెందిన చిట్యాల వేణు(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం వేణు ఇద్దరు కుమారులు శివ (15), విష్ణును స్కూటీపై ఎక్కించుకొని ఒడి బియ్యం పోసుకునేందుకు అత్తగారి గ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధరిపల్లికి బయలుదేరాడు.
దౌల్తాబాద్ మండలంలోని చెట్టనర్సంపల్లి బైపాస్ రోడ్డు వద్దకు రాగానే గజ్వేల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి వేణు, పెద్ద కుమారుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న కుమారుడు విష్ణు గాయాలతో బయటపడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు రోడ్డుపై గుర్తు పట్టరాకుండా పడిపోయాయి. మృతుడు శివ తిర్మలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదవ తరగతి చదువుతున్నాడు.
మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ముత్యంరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment