ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో వరం
నేటి నుంచి రిజిస్ట్రేషన్
ప్రక్రియను ప్రారంభించనున్న ఆప్ అధినేత
ఎలాంటి అవాంతకాలు కలిగించద్దని బీజేపీకి విన్నపం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు.
ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది.
పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు.
బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్‌లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment